అల వైకుంఠ‌పుర‌ములో.. క‌థ ఇదే

May 26, 2020

సంక్రాంతికి రాబోయే భారీ చిత్రాల్లో ఒక‌టి అల వైకుంఠ‌పుర‌ములో. దీనిపై అంచ‌నాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. ఈ సినిమా టీజ‌ర్ చూస్తే దీని క‌థేంట‌న్న‌ది అంచ‌నాకు రాలేక‌పోయారు ప్రేక్ష‌కులు. ఐతే ఈ క‌థ‌పై ఇప్పుడు స్వ‌యంగా త్రివిక్ర‌మే క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు ఓ ఇంట‌ర్వ్యూలో.
ఎవ్వ‌రికైనా స్థానం ఇవ్వ‌గ‌లం కానీ.. స్థాయి ఇవ్వ‌లేం.. ఈ పాయింట్‌ను స‌ర‌దాగా చెప్పే ప్ర‌య‌త్నం చేశాడ‌ట త్రివిక్ర‌మ్. దీని గురించి మ‌రింత వివ‌రిస్తూ.. ‘‘సంప‌ద వేరు, ఐశ్వ‌ర్యం వేరు. డ‌బ్బున్న ఇల్లు చూడండి. బాగా విశాలంగా ఉన్న‌ప్ప‌టికీ అక్క‌డ కాసేపు కూర్చుంటే బోర్ కొట్టేస్తుంది. కానీ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఇంట్లోకి వెళ్లండి. ఇల్లు చిన్న‌దిగానే ఉంటుంది. హాల్లో ఉన్న దివాన్ మీద కూర్చుంటే రేడియోలో మంచి పాట వినిపిస్తుంది. కిటికీని అల్లుకున్న మ‌ల్లె పందిరి నుంచి మంచి సువాస‌న వ‌స్తుంది. వంటింట్లో వేగుతున్న బంగాళ‌దుంప వేపుడు నోరు ఊరిస్తుంది. ఆక‌లి పెంచుతుంది. ఓ టీ తాగి వెళ్లిపోదామ‌నుకుంటే... భోజ‌నం పెట్టి పంపిస్తారు. పెద్ద వాళ్లింట్లో సంప‌ద ఉంటుంది. ఇక్క‌డ ఐశ్వ‌ర్యం ఉంటుంది. అదే తేడా. దాన్ని స‌ర‌దాగా  ఎలా చెప్పాలో ఆలోచించి ఈ క‌థ రాసుకున్నా’’  అని త్రివిక్ర‌మ్ తెలిపాడు. 

గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ముందు అనుకున్న‌ట్లే జ‌న‌వ‌రి 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది.