‘రంగస్థలం’ రికార్డు బద్దలేనా?

May 29, 2020
CTYPE html>
‘రంగస్థలం’ అనే సినిమా విడుదల కావడానికి ముందు దాని బిజినెస్ లెక్కలు చూసి బ్రేక్ ఈవెన్ అవుతుందా అన్న సందేహాలు కలిగాయి. రూ.90 కోట్ల దాకా షేర్ సాధిస్తే కానీ.. అది బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేదు. ఐతే దానికి ముందు ‘ధృవ’తో రూ.65 కోట్ల షేర్ మార్కును దాటిన రామ్ చరణ్.. ఒకేసారి రూ.25 కోట్ల మొత్తం అధికంగా రాబట్టగలడా అని సందేహాలు వ్యక్తం చేశారు. కానీ ఆ చిత్రం ఏకంగా రూ.128 కోట్ల షేర్ సాధించి ఔరా అనిపించింది. ‘ఖైదీ నంబర్ 150’ పేరిట ఉన్న నాన్ బాహుబలి రికార్డులు అలవోకగా బద్దలు కొట్టి సమీప భవిష్యత్తులో ఎవ్వరూ అందుకోలేని షేర్‌తో రికార్డు నెలకొల్పింది. 
గత రెండేళ్లలో వచ్చిన ఏ తెలుగు సినిమా ఆ రికార్డును బద్దలు కొట్టలేదు. ‘సాహో’, ‘సైరా’ సినిమాలు ఓవరాల్‌గా ఎక్కువ షేరే సాధించాయి కానీ.. తెలుగు వెర్షన్‌తో ‘రంగస్థలం’ను అందుకోలేకపోయాయి. ఐతే ఇప్పుడు సంక్రాంతి కానుకగా విడుదలైన అల్లు అర్జున్ సినిమా ‘అల వైకుంఠపురములో’ జోరు చూస్తుంటే ‘రంగస్థలం’ రికార్డుకు చేరువగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం ఇప్పటికే రూ.100 కోట్ల షేర్ మార్కును దాటింది. వచ్చే వారం రాబోతున్న ‘డిస్కో రాజా’ దీనికి మరీ పోటీ కాదు. ‘సరిలేరు నీకెవ్వరు’ ఆల్రెడీ జోరు తగ్గిపోయింది. కాబట్టి ‘అల..’ మరింతగా షేర్ సాధించే అవకాశాలున్నాయి. రెండో వీకెండ్లో పట్టు నిలుపుకుంటే ఈ చిత్రం ‘రంగస్థలం’ రికార్డును అందుకున్నా ఆశ్చర్యమేమీ లేదు. చూద్దాం మరి ఏమవుతుందో?