‘అల వైకుంఠపురములో’ రివ్యూ

July 08, 2020

నటీనటులు: అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, జయరాం, మురళీ శర్మ, సచిన్ ఖేద్కర్, సుశాంత్, నివేథా పెతురాజ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ తదితరులు

సంగీతం- తమన్
ఛాయాగ్రహణం- పి.ఎస్.వినోద్
నిర్మాతలు- అల్లు అరవింద్, సూర్యదేవర రాధాకృష్ణ
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం- త్రివిక్రమ్
 

‘అల వైకుంఠపురములో’ టీజర్, ట్రైలర్ చూస్తే.. త్రివిక్రమ్ తీసిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అత్తారింటికి దారేది’తో పాటు ఆయన్నుంచి వచ్చిన డిజాస్టర్ మూవీ ‘అజ్ఞాతవాసి’ ఛాయాలు కూడా కనిపించాయి. మరి ఈ చిత్రం ఆ రెంటిలో దేని కోవకు చెందుతుందా అన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. ఆ ఉత్కంఠకు తెరపడిపోయింది. ‘అల..’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. భయపడాల్సిందేమీ లేదు.. ఇది మరో ‘అత్తారింటికి దారేది’నే. ఇంకో ‘అజ్ఞాతవాసి’ ఎంతమాత్రం కాదు.

త్రివిక్రమ్ ఫ్యామిలీ సినిమాలన్నీ ఒక స్టయిల్లో సాగిపోతాయి. హీరో ఒక పెద్దింటికి వెళ్తాడు. ఇంటిలోపలున్న మనుషుల మధ్య దూరాలు తగ్గిస్తాడు. బయటి మనుషుల నుంచి ఆ ఇంటికి వచ్చిన సమస్యల్ని పరిష్కరిస్తాడు. ముందు అతణ్ని అపార్థం చేసుకుంటారు. చివరికి అతడి గొప్పదనం తెలుసుకునాన్ని తెలుసుకుంటారు. ‘అల వైకుంఠపురములో’లో కూడా ఆ లైన్లో సాగిపోయే సినిమానే. ఈ సినిమాలు చూస్తున్నంతసేపు ‘అత్తారింటికి దారేది’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అజ్ఞాతవాసి’ లాంటి త్రివిక్రమ్ సినిమాలు తలపుల్లోకి వస్తాయి. కానీ ఎంతమాత్రం మొనాటనీ ఫీలింగ్ రానివ్వకుండా కథాకథనాల్ని ఆహ్లాదంగా నడిపిస్తూ ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయడంలో త్రివిక్రమ్ విజయవంతం అయ్యాడు. త్రివిక్రమ్ కుటుంబ కథల రీహ్యాష్ లాగే అనిపించినప్పటికీ.. తన కెరీర్లో త్రివిక్రమ్ అత్యంత సిన్సియర్‌గా చేసిన సినిమాల్లో ఒకటిగా ‘అల వైకుంఠపురములో’ నిలుస్తుంది.

త్రివిక్రమ్ గొప్ప రచయిత, దర్శకుడే కానీ అతడి విషయంలో చాలామందికి కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి. మనుషులు, వ్యక్తిత్వాలు, పరిస్థితులు, సమాజం గురించి ఏ చిన్న అవకాశం వచ్చినా తన పాత్రలతో విపరీతంగా క్లాసులు పీకించేస్తాడని.. కామెడీ కోసం అసహజమైన సన్నివేశాలు రాస్తాడని.. డైలాగుల కోసమే కొన్ని సన్నివేశాలు సృష్టిస్తాడని.. ప్రాసల కోసం పాకులాడతాడని.. ఇవీ ఆయన మీదున్న కంప్లైంట్స్. ఐతే ‘అల వైకుంఠపురములో’ వీటన్నింటికీ మినహాయింపుగా నిలవడం విశేషం. తాను ఫెయిల్ అయిన ‘అజ్ఞావాసి’ కథనే మళ్లీ కొంచెం మార్చి రాసి.. దాన్ని అందంగా, ఆహ్లాదంగా చెప్పే ప్రయత్నం చేశాడు త్రివిక్రమ్. ఈ సినిమాలో ఆయన ఏం చేసినా కథ కోసమే చేశాడు. కథను అనుసరించే సాగాడు. అందుకే సినిమా సహజంగా అనిపిస్తుంది. త్రివిక్రమ్ గత కొన్ని సినిమాల్లోని అసహజత్వం కనిపించదు.

త్రివిక్రమ్ ఈ సినిమాను ఒక ‘ప్యాకేజీ’లా మలచలేదని.. అతను సిన్సియర్‌గా ఓ కథ చెప్పబోతున్నాడని.. ఈ సినిమా ఆరంభ సన్నివేశంతోనే అర్థమైపోతుంది. ఒక పెద్ద కంపెనీలో పని చేసే ఇద్దరు చిరుద్యోగులు. అందులో ఒకరు యజమానిని మెప్పించి అతడి అల్లుడైపోతాడు. ఆ కంపెనీకి అధిపతి అవుతాడు. తన లాంటి ఒకడికి ఒక్కసారిగా అంత అదృష్టం పట్టేసరికి రెండో వాడు తట్టుకోలేకపోతాడు. అసూయతో అతడికి పుట్టిన కొడుకు స్థానంలో తన కొడుకును పెట్టి.. అతడి కొడుకును తన కొడుకుగా పెంచుతాడు. తాను పని చేసే ఇంటికి వెళ్లి మహరాజులా పెరుగుతున్న తన కొడుకును చూసి మురిసిపోతూ.. తన దగ్గర పెరుగుతున్న కొడుకు కాని కొడుకును నిరంతరం వేధించుకు తింటుంటాడు ఆ తండ్రి. ఈ స్థితిలో ఆ కొడుకు తనను కన్నవాళ్లను ఎలా కలిశాడు.. ఆ ఇంట్లో నెలకొన్న సమస్యల్ని ఎలా పరిష్కరించాడు.. తన జన్మరహస్యం తెలిశాక ఎలా స్పందించాడు అన్నదే ఈ కథ.

ఒక రకంగా చెప్పాలంటే ఇది ‘అజ్ఞాతవాసి’ని తలపించే కథే. కానీ దానిలా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టకుండా ‘అత్తారింటికి దారేది’ తరహాలో ఆహ్లాదంగా సాగుతుంది. కాకపోతే అందులో మాదిరి ఇక్కడ హంగామా లేదు. కామెడీ పేలిపోలేదు. ఎమోషన్లు పతాక స్థాయికి చేరలేదు. త్రివిక్రమ్ ఈసారి తనను తాను నియంత్రించుకుని అన్ని విషయాల్లోనూ కాస్త సంయమనం పాటించాడు. సింపుల్ హ్యూమర్, సింపుల్ ఎమోషన్లతో సినిమా చాలా వరకు లైటర్ వీన్‌లో సాగిపోతుంది. మాస్‌ గురించి పట్టించుకోకుండా త్రివిక్రమ్ పూర్తిగా తన క్లాస్ స్టయిల్లో ఈ సినిమాను నడిపించాడు. దానికి అల్లు అర్జున్ స్టైల్ కూడా యాడ్ అవడం.. తమన్ వీనుల విందైన సంగీతం, పి.ఎస్.వినోద్ ఆహ్లాదకరమైన ఛాయాగ్రహణం కూడా తోడవడంతో ‘అల వైకుంఠపురములో’ వినోదాల వల్లరిగా మారింది. ప్రేక్షకులు పగలబడి నవ్వే స్థాయిలో కామెడీ లేకపోయినా.. పెదాలపై నవ్వు ఎప్పుడూ నిలిచి ఉండేలా సినిమా సాగుతుంది. రెండు మూడు సన్నివేశాలు మాత్రమే కొంచెం సీరియస్‌గా, ఎమోషనల్‌గా సాగుతాయి. వాటిలోనూ ఓవర్ ద బోర్డ్ వెళ్లలేదు త్రివిక్రమ్. హీరోయిన్‌ పాత్రను చక్కగా మొదలుపెట్టి ఆ తర్వాత తేల్చి పడేయడం.. విలనీ బలంగా లేకపోవడం కాస్త నిరాశ కలిగించే విషయాలే కానీ.. అవి పెద్ద ప్రతిబంధకాలైతే కావు. పాటలన్నీ చాలా అందంగా, ఆహ్లాదంగా తెరకెక్కించడం పెద్ద ప్లస్. ఫైట్లు కూడా స్టైలిష్‌గా డిజైన్ చేశారు.

మాస్ కోసమని సినిమాలో ఏమీ లేకుంటే బాగుండదని.. ఒక స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశాడు త్రివిక్రమ్. ద్వితీయార్ధంలో ఒక చోట అల్లు అర్జున్ తన తండ్రి ఆఫీసులో బోర్డ్ మీటింగుకు వెళ్లి ఒక సెటిల్మెంట్ చేస్తాడు. అక్కడ చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రాజశేఖర్ పాటలకు అతను స్టెప్పులేస్తూ చేసే అల్లరికి థియేటర్లు హోరెత్తిపోవడం ఖాయం. ఏమాత్రం ఇగో లేకుండా ఇలా వేరే స్టార్ల పాటలకు స్టెప్పులేసిన బన్నీ అభినందనీయుడే. ఈ ఒక్క చోటే కాదు.. సినిమా అంతా బన్నీ పాత్ర చాలా సరదాగా, అల్లరిగా సాగిపోతుంది. అతను ఆస్వాదిస్తూ చేసిన పాత్రలా కనిపిస్తుందిది. త్రివిక్రమ్ రాతకు అతను పూర్తిగా న్యాయం చేస్తూ సినిమాను తన భుజాల మీద నడిపించే ప్రయత్నం చేశాడు. మిగతా నటీనటులు కూడా తమ వంతుగా చక్కటి పెర్ఫామెన్స్ ఇచ్చారు. సంక్రాంతి సీజన్లో కుటుంబమంతా కలిసి చూడటానికి ఢోకా లేని క్లీన్ ఎంటర్టైనర్ ఈ చిత్రం. సంక్రాంతి విజేత ‘అల వైకుంటపురములో’నే అనే విషయంలో మరో మాట లేదు.

 

రేటింగ్-3.25/5

Read Also

అమరావతి విషయంలో బీజేపీ షాకింగ్ డెసిషన్ ??
జగన్‌పై సినీ ప్రముఖుడి ఫైర్
‘సరిలేరు నీకెవ్వరు’ రివ్యూ