వైసీపీలో చేరిన అలీ.. మహిళా నేతపై పోటీ

June 01, 2020

కొద్దినెలలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు ప్రముఖ సినీ నటుడు అలీ. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న నేపథ్యంలో ఆయన.. పదే పదే రాజకీయ నేతలతో సమావేశం అవుతూ వచ్చారు. అందరి కంటే ముందు అలీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశం అయ్యారు. ఆ వెంటనే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను కలిశారు. దీంతో ఆయన ఏ పార్టీలో చేరుతారో ఎవరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకే మంత్రి గంటాను విశాఖలో కలిశారు. దీని తర్వాత అలీ 40 ఏళ్ల సినీ ప్రస్థానం కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. దీంతో అందరూ అలీ టీడీపీలో చేరడం ఖాయమని అనుకున్నారు. కానీ, ఊహించని రీతిలో ఆయన వైసీపీ గూటికి చేరారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో జగన్‌తో భేటీ అయిన అలీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. టీడీపీ నుంచి గుంటూరు ఈస్ట్ నుంచి పోటీ చేయాలని అలీ ఆశించారు. ఈ విషయంలో చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతోనే ఆయన వైసీపీలో చేరినట్లు తెలుస్తోంది. 

వాస్తవానికి గత ఎన్నికల సమయంలోనే అలీని గుంటూరు సిటీ నుండి టీడీపీ బరిలోకి దింపాలని భావించింది. మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి అలీతో చర్చించారు. కానీ, ఆ సమయంలో పోటీకి ఆయన దూరంగా ఉన్నారు. దీనికి కారణం ఆయన రాజమహేంద్రవరం టికెట్ అడగడమేనని అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలని ఆయన భావించారు. అందుకే అన్ని పార్టీలనూ సంప్రదించారు. చివరకు వైసీపీలో చేరారు. వైసీపీ తరఫున అలీ.. గుంటూరు పశ్చిమ లేదా రాజమండ్రి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆయన విజయవాడ నగరంలోని పశ్చిమ నియోజకవర్గం కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ వైసీపీ సమన్వయకర్తగా వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఇప్పుడు అలీ చేరికతో ఆయనను తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అందుకే గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున జలీల్ ఖాన్ ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరిపోయారు. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి జలీల్ ఖాన్ కుమార్తెకు సీటు ఖరారు అయింది. ఆమె ప్రచారం కూడా ప్రారంభించేశారు.