అలీ టికెట్ కన్‌ఫర్మ్ అయినట్లేనా..?

December 06, 2019

గత కొంత కాలంగా ఆలీ రాజకీయ ప్రవేశం గురించిన చర్చలు ఊపందుకున్నాయి. ఆయన ఈ ఎన్నికల్లో పోటీకి దిగనున్నారని, ఆయనకు ఆశించిన టికెట్ దక్కనుందని వార్తలు వచ్చాయి. ఎన్నాళ్ల నుంచో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాడు కమెడీయన్ అలీ. కానీ ఆయనకు సరైన అవకాశం రాలేదు. గత 20 ఏళ్లనుంచి టీడీపీలో కార్యకర్తగా ఉన్న అలీ.. మొన్నటి ఎన్నికల్లో గుంటూరు తూర్పు నుంచి పోటీ చేద్దామని అనుకున్నాడు. కానీ అప్పటికే ఆ సీటు కన్‌ఫర్మ్ కావడంతో సత్తెనపల్లి నుంచి పోటీ చేయమని చంద్రబాబు అడిగారు. కానీ అలీ ఒప్పుకోకుండా పోటీ నుంచి దూరంగా ఉండిపోయారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికల సీజన్ కావడంతో.. ఈసారైనా గుంటూరు తూర్పు టిక్కెట్ ఇమ్మని అడిగాడు అలీ. దీనికి చంద్రబాబు కూడా సరేనని ఒప్పుకున్నారు. మొన్నటికి మొన్న విజయవాడలో జరిగిన అలీ సన్మాన సభకు ముఖ్య అతిథిగా వెళ్లారు. అక్కడే అలీని రాజకీయాల్లోకి రావాల్సిందిగా చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే.

కాగా ఎన్నికలకు టీడీపీ అభ్యర్థుల్ని ఫైనల్ చేసే ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం గుంటూరు జిల్లా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసే పనిలో పడ్డారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో గుంటూరు పార్లమెంట్ ను మళ్లీ  గల్లా జయదేవ్ కే ఇచ్చారు చంద్రబాబు. ఇక గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకించి మూడు పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. అందులో ఒకరు అలీ కాగా మిగిలిన వారు మహబూబ్ షరీఫ్, షేక్ షౌకథ్ లు. అయితే మిగిలిన ఇద్దరితో పోలిస్తే.. వ్యక్తిగతంలో అలీకి మంచి పేరుంది.  రాజమండ్రిలో సేవా  కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా ఆయన ఇప్పటికే మంచి పేరు సంపాదించుకున్నాడు. అన్నింటికి మించి 20 ఏళ్లనుంచి పార్టీనే నమ్ముకొని ఉన్నారు. అదీగాక సినిమా హీరో. దీంతో అలీకి గుంటూరు తూర్పు టిక్కెట్ దాదాపుగా ఖాయమైపోయినట్లే అని తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించడమే తరువాయి. దీంతో.. అలీ కూడా గుంటూరులో పోటీకి అలాగే ప్రచారానికి కూడా రెడీ అవుతున్నాడని సమాచారం. అలీకి రంగంలోకి దించితే.. తమకు ప్లస్ అవుతుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి.