కేంద్రం మరో సంచలన నిర్ణయం

August 15, 2020

మోడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటలీలో కరోనా మారణహోమం చూశాక అన్ని దేశాలు వణికి పోతున్నాయి. ప్రస్తుతం కరోనా ఉన్న అన్ని జిల్లాల్లో లాక్ డౌన్ చేసిన కేంద్రం తీవ్ర చర్యలకు సిద్ధమవగా... కొన్ని రాష్ట్రాలు ఒకడుగు ముందుకువేసి కరోనా కట్టడానికి రాష్ట్రాలకు రాష్ట్రాలనే షట్ డౌన్ చేశాయి. దీంతో దేశంలో వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. 22 నుంచి అంతర్జాతీయ విమానాలను రద్దు చేసిన కేంద్రం అన్ని రకాల రైళ్లను కూడా రద్దుచేసిన విషయం తెలిసిందే. తాజాగా విమానాలను కూడా రద్దు చేసింది. అంటే... ఇక జనం ఎక్కడి వారు అక్కడే ఉండాలి. కదలడానికి వీళ్లేదు. సింపుల్ గా చెప్పాలంటే... అనధికారికంగా కర్ఫ్యూ వాతావరణం ఉంది దేశంలో. 

ప్రాణాంతకంగా పరిణమిస్తున్న కరోనా వైరస్ ను ఆపడానికి ఇంతకుమించిన మార్గం కూడా ఏం కనిపించడం లేదు. ఎందుకంటే మన దేశ జనాభా చాలా ఎక్కువ. సదుపాయాలు చాలా తక్కువ. ఇక్కడ కరోనా ఎక్కువ మందికి సోకితే ప్రభుత్వాలు చేతులు ఎత్తేయడం మినహా చేసేదేమీ ఉండదు.  అందుకే ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి దేశీయ విమాన సర్వీసులు పూర్తిగా ఆగిపోతాయి. ఈ మేరకు సోమవారం సాయంత్రం పౌర విమానయాన శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం గూడ్స్ రైళ్లు నడుస్తున్నట్లే సరుకులు మోసుకెళ్లే విమానాలు మాత్రం నడుస్తాయి. దేశంలో ఇప్పటిదాకా... 19 రాష్ట్రాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు లాక్ డౌన్‌ను ప్రకటించాయి.