నోరు తెరిస్తే అబద్ధం

May 28, 2020

నోరు తెరిస్తే అబద్ధం
రాజధానికి ప్రపంచబ్యాంకు రుణం నిరాకరించలేదు
రాష్ట్రప్రభుత్వానికి ఇష్టం లేకపోవడం వల్లే వెనక్కి!
రాజధాని అమరావతి అభివృద్ధి ప్రాజెక్టు కోసం ప్రపంచబ్యాంకు ఇస్తానన్న రూ.3,324 కోట్ల రుణం ఆగిపోయింది. చంద్రబాబు అవినీతి వల్లే ఈ ప్రాజెక్టు వెనక్కు వెళ్లిపోయిందని సీఎం జగన్‌, ఆయన బృందం ఊదరగొట్టారు. కానీ అప్పటికే అమరావతిని మార్చేద్దామన్న దురుద్దేశం వారి మనసులో ఉంది. అంతర్గతంగా ఆ దిశగా పనిచేస్తూ.. బయటకు మాత్రం చంద్రబాబు నిర్వాకం వల్లే ప్రపంచబ్యాంకు వెనక్కి తగ్గిందని అబద్ధాలు చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణమని ప్రపంచబ్యాంకు లేఖలను బట్టి స్పష్టమవుతోంది. అమరావతి సుస్థిర మౌలిక సదుపాయాలు, సంస్థాగత అభివృద్ది ప్రాజెక్టు(ఏఎస్‌ఐఐడీపీ) కింద భారీ మొత్తం రుణం ఇచ్చేందుకు ఒక దశ వరకు రాష్ట్రప్రభుత్వం, ప్రపంచబ్యాంకు మధ్య చర్చలు జరిగాయి. రాష్ట్రప్రభుత్వం రూ.3,324కోట్ల ప్రపంచబ్యాంకు రుణసాయం కోసం ప్రతిపాదనలు సమర్పించగా.. కేంద్ర ఆర్థిక వ్యవహారల విభాగం ఆమోదించింది. ప్రపంచబ్యాంకుకు 2016 మే 15న లేఖ రాసింది. ఆ తర్వాత ప్రపంచబ్యాంకు ఈ ప్రాజెక్టుపై పరిశీలనకు వచ్చింది. ఈలోపుగా అమరావతిలో భూసేకరణ, ఇతర అంశాల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రపంచబ్యాంకుకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. దీనిపై నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుడు జూన 24న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. అమరావతి అభివృద్ది ప్రాజెక్టు రుణం ప్రతిపాదనపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ బృందాన్ని పంపించాలని అనుకోవడం, అలా చేస్తే ప్రాజెక్టు ఆలస్యం అవుతుందన్న విషయాలను ప్రపంచబ్యాంకు గుర్తుచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సదరు అమరావతి ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏంటని అడిగింది. నూతన ముఖ్యమంత్రి జగన్‌ సీఆర్‌డీఏ వ్యవహారాలపై సమీక్ష నిర్వహిస్తున్నారని, దానిలో అమరావతి ప్రాజెక్టుపైనా ఒక స్పష్టత వస్తుందని అధికారులు తెలియజేశారు. కానీ ఆ తర్వాత సీఎం సమీక్షలో ఏం జరిగిందో సీఆర్‌డీఏ బ్యాంకుకు సమాచారమివ్వలేదు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం రెండు లేఖలు రాసినా నాటి సీఎస్‌ స్పందించలేదు. వరుసగా రెండుసార్లు లేఖలు రాసి, సమయం ఇచ్చినా...తుది గడువు ఇచ్చి అభిప్రాయం చెప్పమన్నా రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు. అభిప్రాయం చెప్పకపోతే ఈ ప్రాజెక్టునుంచి ప్రపంచబ్యాంకును వెళ్లిపొమ్మని చెప్పడమే అవుతుందని, రుణం వద్దనడమేనని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని నేరుగా ప్రపంచబ్యాంకుకు రాస్తామని చెప్పింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో జూలై 15వ తేదీన  కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం ప్రపంచబ్యాంకుకు లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రుణం విషయంపై ఏమీ చెప్పలేదని, మీరు ఎంత వీలుంటే అంత తొందరగా ఈ ప్రాజెక్టు నుంచి వెనక్కువెళ్లొచ్చని లేఖ రాసింది. ఇక చేసేదేమీ లేక ప్రపంచబ్యాంకు ఆ మర్నాడే ఈ ప్రాజెక్టునుంచి వైదొలుగుతూ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. చంద్రబాబు కారణంగానే ప్రపంచబ్యాంకు పారిపోయిందని.. రుణం ఇవ్వడానికి నిరాకరించిందని అన్నారు. ఈ లేఖలు బయటపెట్టేసరికి కిమ్మనలేదు. ఇప్పుడు పీపీఏల రద్దు వ్యవహారం, విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిల ఎగవేత నేపథ్యంలో దేశంలో ఏ బ్యాంకు వద్దా పైసా ముట్టే పరిస్థితి లేదు. దీంతో సాగునీటి ప్రాజెక్టులకు రుణం కోసం తాజాగా ప్రపంచబ్యాంకుకు లేఖ రాసినట్లు తెలిసింది. కానీ ఇచ్చే నాథుడేడీ? ఇచ్చిన డబ్బులు ఎలా చెల్లిస్తారని సాక్షాత్తూ భారతీయ స్టేట్‌బ్యాంకే రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో ఏ బ్యాంకూ ముందుకు రావడం లేదు. 

Read Also

బాబు ఘనత నీ నోటితో చెప్పావు జగన్
అయ్యోరాామా... వైసీపీ కర్మరా మామా
'యథారాజా.. తథా నాయకులు'.

RELATED ARTICLES

  • No related artciles found