కామ‌న్ పాయింట్: బ‌రిలో నిలిచినోళ్లంతా రెడ్లే!

May 30, 2020

తెలంగాణ స్థానిక సంస్థ‌ల నుంచి ఎన్నిక‌య్యే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఎన్నికకు స‌మ‌యం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేసింది. రంగారెడ్డి.. న‌ల్గొండ‌.. వ‌రంగ‌ల్ జిల్లాల స్థానిక సంస్థ‌ల‌కు జ‌రుగుతున్న ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌నున్న అభ్య‌ర్థుల్ని అధికార టీఆర్ఎస్.. విప‌క్ష కాంగ్రెస్ పార్టీలు ప్ర‌క‌టించాయి.

ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే.. బ‌రిలో నిలిచిన అభ్య‌ర్థులంతా రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వారు కావ‌టం గ‌మ‌నార్హం. సాధార‌ణంగా ఎన్నిక‌లు ఏమైనా స‌రే.. వీలైనంత‌వ‌ర‌కు సామాజిక న్యాయం జ‌రిగేలా క‌స‌ర‌త్తు జ‌రగ‌టం క‌నిపిస్తుంది. అగ్ర‌వ‌ర్ణాల‌తో పాటు.. వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు.. ఎన్నిక‌లు జ‌రిగే ప్రాంతాల్లో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గానికి టికెట్లు కేటాయించ‌టం రాజ‌కీయాల్లో స‌హ‌జంగా చూసేదే.
కానీ.. అందుకు భిన్నంగా తాజాగా జ‌రుగుతున్న మూడు స్థానాల్లో బ‌రిలో నిలిచే టీఆర్ఎస్.. కాంగ్రెస్ అభ్య‌ర్థులంతా రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వారే. ఒక ఎన్నిక‌లో ఒకే సామాజిక వ‌ర్గానికి ఇంత భారీగా ప్రాధాన్య‌త‌ ఇచ్చింది ఇదే తొలిసారిగా చెబుతున్నారు. అధికార‌.. విప‌క్ష పార్టీల అభ్య‌ర్థులు ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన వారైన వేళ‌.. తెలంగాణ రాజ‌కీయాల్ని ప్ర‌భావితం చేసే స‌త్తా ఉంద‌ని చెప్పే రెడ్ల‌కు అధికారం చేతిలో లేద‌న్న బాధ‌ను తాజా ఎంపిక అంతో ఇంతో లేకుండా చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
మూడు స్థానాల‌కు టీఆర్ఎస్.. కాంగ్రెస్ అభ్య‌ర్థుల్ని చూస్తే..

1. న‌ల్గొండ తేరా చిన్న‌ప‌రెడ్డి (టీఆర్ఎస్‌) కోమ‌టిరెడ్డి ల‌క్ష్మీరెడ్డి (కాంగ్రెస్‌)

2. రంగారెడ్డి మ‌హేంద‌ర్ రెడ్డి (టీఆర్ఎస్‌) ఉద‌య‌మోహ‌న్ రెడ్డి (కాంగ్రెస్)

3. వ‌రంగ‌ల్ పోచంప‌ల్లి శ్రీ‌నివాస్ రెడ్డి (టీఆర్ఎస్‌) ఇనుగుల వెంక‌ట్రామిరెడ్డి (కాంగ్రెస్‌)