ఉండమ్మా.. బొట్టు పెడతా.. అందరిదీ ఇదే బాట..!

September 18, 2019

ఆంధ్రప్రదేశ్‌లో కొద్దిరోజుల్లో జరగనున్న ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టత్మకంగా తీసుకున్నాయి. అందుకోసం ఎంతగానో శ్రమిస్తున్నాయి. అయితే, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. సమయం లేదు. ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దీనిలో భాగంగానే అభ్యర్థులు ఎన్నికల ప్రచారాల సరళి మార్చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. పగటిపూట ప్రచారాలు చేస్తున్నారు. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి 10 గంటల వరకు అలుపెరగకుండా అభ్యర్థులు చెమటోడుస్తున్నారు. అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. ఒకరి కంటే మరొకరు ముందుండెలా ప్రచారంలో పరుగులు పెడుతున్నారు. ప్రచారానికి ఒక అంగూ ఆర్భాటం ఉండేలా అభ్యర్థులు జాగ్రత్త పడుతున్నారు. ఏ పల్లె చూసినా, పట్టణానికి వెళ్లినా ప్రచారాలు హోరెత్తి పోతున్నాయి. సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు. ఈ క్రమంలోనే కొత్త పద్దతికి శ్రీకారం చుడుతున్నారు అన్ని పార్టీల అభ్యర్థులు.

ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంటున్న దశలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో పోలింగ్‌ జరగనుండడంతో ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది. అన్ని పార్టీలు తమ అభ్యర్థుల విజయం కోరుతూ మైక్‌ల ద్వారా ప్రచారం ముమ్మరం చేశారు. ఆటోలు, ప్రత్యేక వాహనాలపై ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వాహనాలపై నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఒక వాహనం తరువాత మరోపార్టీ వాహనం, అన్ని పార్టీల వాహనాలు కలియతిరుగుతున్నాయి. వీటితో పాటు ప్రధాన కూడళ్లలో సాయంత్ర సమయంలో ఎల్‌ఈడీ స్ర్కీన్స్‌ ద్వారా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీల అధ్యక్షుల ఉపన్యాసాలు పలు పథకాల చిత్రాలతో ప్రజలను ఆకర్షించే విధంగా ప్రచారం సాగుతోంది. ఎండలో సైతం ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇదే పరిస్థితి గ్రామాల్లో కూడా కనిపిస్తోంది. ఎన్నికల వేడి మరింత పెరిగిన నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు వార్డులు, గ్రామాల్లో ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

స్థానిక నాయకులతో కలసి ఇంటింటికి వెళ్ళి సంక్షేమ పథకాల కరపత్రాలు, తాము అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల వివరాలతో ఊదరగొడుతూ తమ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దీంతో వార్డుల్లో సందడి ప్రారంభమైయింది. అవసరమైతే ప్రచార కార్యక్రమాల్లో ముఖ్య నాయకులు పాల్గొనేలా చూసుకుంటున్నారు. సమయం దగ్గర పడే కొద్ది ప్రచారంలో కూడా కొత్త పద్ధతులు వచ్చేలా కనిపిస్తోంది. అభ్యర్థి కుటుంబ సభ్యులను కలుపుకుని ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఇలా.. చాలా మంది కుటుంబ సభ్యులు నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. ముఖ్యంగా నియోజకవర్గాల్లోని మహిళలక బొట్టు పెట్టి మరీ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. గతంలో శుభకార్యాలకు వెళ్లి బొట్లు పెట్టి పిలిచేవారు.. ఇప్పుడిదే పద్దతిని ప్రచారంలో వాడుకుని ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఏ ఒక్క పార్టీకే పరిమితం కాలేదు. అన్ని పార్టీల్లోనూ ఈ పద్దతి కనిపిస్తోంది.