వచ్చేదంతా నవరత్నాలకే

August 13, 2020

శాఖల సొమ్మంతా వాటికే
ఉద్యోగుల జీతాలకూ దిక్కులేదు
పెండింగ్‌ బిల్లులు అటకెక్కినట్లే!
మౌలిక, అభివృద్ధి ప్రాజెక్టులు కలే!!

రాష్ట్ర బడ్జెట్‌ అతలాకుతలమైంది. సీఎం జగన్‌ ప్రవచిత నవరత్నాల్లో రెండు ఇంకా మొదలే కాలేదు. సప్తరత్నాలకే డబ్బు తీసుకురాలేక అధికారులు విలవిలలాడుతున్నారు. గత జూన్‌ నుంచి ఫిబ్రవరి వరకు చూస్తే.. అప్పు తేకుండా గండం గడచిన సందర్భమే లేదు. ఇక రాబోయే బడ్జెట్‌లో కూడా నవరత్నాలకే పెద్దపీట వేయాలన్నది జగన్‌ సంకల్పం. సంక్షేమ పథకాల గురించి తర్వాత.. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకే కటకటగా ఉంది. ప్రతి రెండ్రోజులకు ఓవర్‌డ్రాఫ్టు.. ప్రతి వారం బాండ్ల వేలం తప్పనిసరవుతోంది. వేతనాలకు, నవరత్నాలకు పోను డబ్బు మిగిలితే.. అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల గురించి అప్పుడు ఆలోచిద్దామన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాష్ట్ర సొంత ఆదాయం పడకేసింది. కొత్త పన్నులు వేస్తే తప్ప ఊపిరి నిలిచే పరిస్థితి లేదు. దీంతో ఆర్థిక  శాఖ చూపు కేంద్రంపై పడింది. నవరత్నాలకు సరిపోయే కేంద్ర పథకాలపై ఆరా తీస్తోంది. అవేమైనా ఉంటే ఆర్థిక భారం తగ్గుతుందని.. వాటిని తమ పథకాలుగా ప్రచారం చేసుకోవచ్చన్నది జగన్‌ ప్రభుత్వ అభిమతంగా ఉంది. రాష్ట్ర బడ్జెట్‌లో పలు శాఖలకు భారీగా కేటాయింపులు జరిపినా.. కొన్ని కీలక శాఖలకైతే ఇంతవరకు పైసా కూడా కేటాయించలేదు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులకు తెగ ప్రాధాన్యం ఇచ్చేస్తున్నామని ప్రతి వారం సీఎం ఆర్భాటంగా ప్రకటించడమే తప్ప.. ఈ 11 నెలల్లో రూపాయి కూడా జలవనరుల శాఖకు ఇవ్వలేదు. కీలకమైన రోడ్లు భవనాల శాఖకు అప్పుడప్పుడు కొంత మేరకు సర్దుబాటు చేస్తున్నా.. ఆ శాఖలో వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు ఉన్నాయి. వ్యవసాయ శాఖ పరిస్థితీ ఇలాగే ఉంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పంచాయతీరాజ్‌ శాఖకే నికరంగా నిధులు అందుతున్నాయి. పురపాలక శాఖకు అసలు దిక్కేలేదు. దీంతో చాలా మంది మంత్రులు ఆర్థిక శాఖ నిర్వహిస్తున్న ప్రీ-బడ్జెట్‌ సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు. కేటాయింపులు తప్ప నిధులివ్వనప్పుడు వచ్చి ఉపయోగమేమిటని వారు అసంతృప్తితో ఉన్నారు.
కొండలా పెండింగ్‌..
కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావలసిన నిధులను సమర్థంగా తెచ్చుకోవాలని భావిస్తున్నా.. అది జరిగే పనిలా కనిపించడం లేదు. ఉపాధి హామీ పథకం నిధులు తప్ప ఠంచనుగా ఏవీ అంత తొందరగా అందడం లేదు. ఉపాధి నిధుల్ని పనులుచేసిన వారికి ఇవ్వకుండా రాష్ట్రప్రభుత్వం తొక్కిపెట్టి.. అమ్మఒడి పథకానికి, రైతు భరోసాకు సర్దుబాటుచేసినట్లు ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. వివిధ శాఖలు, కార్పొరేషన్లలో మిగిలిన డబ్బంతా ఆర్థిక శాఖకు జమ చేయాలని ఆదేశించారు. వాటికి నెలకొత చొప్పున సర్దుబాటు చేయాలనుకుంటున్నా.. కుదరడం లేదు. దీంతో ఆయా శాఖలు తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. దీనికితోడు పెండింగ్‌ బిల్లులు కొండలా పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం పెండింగ్‌ బిల్లులు రూ.30 వేల కోట్లకు చేరుకున్నాయి. మార్చి 31 నాటికి రూ.50 వేల కోట్లకు పెరిగే అవకాశాలున్నాయని ఆర్థిక శాఖ అంచనా. అయితే తమ తాబేదార్లు, మద్దతుదార్లయిన ఆరేడుగురు కాంట్రాక్టర్లకు మాత్రమే చెల్లింపులు జరుగుతున్నాయి. రాబోయే బడ్జెట్‌లో పెండింగ్‌ బిల్లుల భవిష్యత ఏంటో అర్థం కాని పరిస్థితి. ఈ సంవత్సరం నిధుల్లేక మూలన పడ్డ సాగునీటి ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు వచ్చే ఏడాదైనా బడ్జెట్‌ విడుదల చేస్తారో లేదో స్పష్టత లేదు. ప్రస్తుత బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు రూ.16 వేల కోట్లు కేటాయించారు. మరో నెలలో ఆర్థిక సంవత్సరం పూర్తికావస్తోంది. ఇప్పటికీ ఒక్క ప్రాజెక్టుకు కూడా ఒక్క రూపాయి విడుదల కాలేదు. ఆ శాఖలో ఉన్న పెండింగ్‌ బిల్లుల చెల్లింపులు జరపలేదు. దీంతో వచ్చే ఏడాది పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.
మౌలికం పడకే..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి జీతాలు, పెన్షన్లు, అప్పుల రీ పేమెంట్లు, వాటి వడ్డీలు కట్టుకోవడానికే సరిపోతుంది. సంక్షేమ పథకాలన్నీ అప్పులతోనే నడుస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులకు, మౌలికసదుపాయాల కల్పనకు, సాగునీటి ప్రాజెక్టులకు, అభివృద్ధి కార్యకలాపాలకు నిధులు అందుబాటులో లేవు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2.28 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పటికీ అప్పులతో కలిపి మార్చి 31 నాటికి మొత్తం ఆదాయం 1.40 కోట్లకు మించకపోవచ్చని అంచనా. అంటే రూ.85 వేల కోట్ల వరకు లోటు ఏర్పడుతుంది. రూ.50 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులను కలిపితే 1.35 లక్షల కోట్లన్నమాట.