ఆరోపణలు - వాస్తవాలు

May 26, 2020

ఆరోపణలు - వాస్తవాలు
(ఓపిక, నిజమేమిటో తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్న వాళ్లకు మాత్రమే)
ఆరోపణ - ఒక ఇజ్రాయెల్ కంపెనీ నుంచి టెలిఫోన్ tapping పరికరాలు కొన్నారు
వాస్తవం - అధికారంలో ఉన్న వాళ్ళను అడగండి - కొన్నారా? కొంటే ఎక్కడున్నాయి? అని
ఆరోపణ - ఏ బి ఒక ఇజ్రాయెల్ కంపెనీ తో కుమ్మక్కయి తన కొడుకు కంపెనీ కి కాంట్రాక్టు ఇప్పించాడు
వాస్తవం - కొనుగోలు ఆర్డర్ ఏ కంపెనీ కి ఇచ్చారు? అది ఏ బి కొడుకు దా? లేక పరికరాలు తయారు చేసే అసలు సిసలు ఇజ్రాయెల్ కంపెనీ యా?
ఆరోపణ - దేశ రహస్యాలను, పోలీసు రహస్యాలను disclose చేసాడు
వాస్తవం - ఏ రహస్యాలు? ఒక పక్క BSF , CRPF లతో పాటు 25 దేశాల్లో పోలీసు, మిలిటరీ బహిరంగంగా వాడుతున్న పరికరాలు రహస్యాలా? మైండు దొబ్బిందా?
ఆరోపణ - తద్వారా దేశద్రోహానికి పాల్పడ్డాడు
వాస్తవం - లీకుల్లో చెప్పడం కాదోయ్. పేపర్ మీద పెట్టి చూపు. నోటితో నవ్వరు
ఆరోపణ - నాసి రకం పరికరాలు కొనబోయారు
వాస్తవం - ప్రపంచం లోని అత్యంత టెన్షన్ ఉండే ఇజ్రాయెల్ - గాజా సరిహద్దుల్లో వాడే పరికరాలు నాసి రకమా? బుద్ధి ఉందా?
ఆరోపణ - కావాలని నాణ్యత ప్రమాణాలు, వారంటీ నిబంధనలు మార్చారు
వాస్తవం- కొంచెం కరెక్ట్ గా చెప్పు? నాణ్యత ప్రమాణాలు మార్చారా? వారంటీ నిబంధనలా? లేక రెండూనా? ఐదేళ్ల వారంటీ కి సరిపడా నిధులు చాలక స్టాండర్డ్ ఒక సంవత్సరం వారంటీ కి సిద్దపడిపోయారా లేక డమ్మి కంపెనీ లని క్వాలిఫై చెయ్యడానికే? ఫైల్ లో యేమని రాసుందో చూసి చెప్పు కొంచెం
ఆరోపణ - టెండర్ ని రిగ్గింగ్ చెయ్యడానికి డమ్మి కంపెనీ లతో బిడ్లు వేయించారు.
వాస్తవం - ఒరే బాబూ ఇన్ని పేర్లు బయటపెట్టావు కదా, ఆ డమ్మి కంపెనీ ల పేర్లు కూడా బయటపెట్టు. మీడియా వాళ్ళం మా పరిశోధన మేము చేసుకుంటాం. అవి డమ్మి లా లేక ఔత్సాహికులా అని తెలుసుకుంటాం.
ఆరోపణ - కావాల్సిన పర్మిషన్ లు లేకుండానే ముందుకెళ్లారు
వాస్తవం - కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చాకే పర్మిషన్ లు తెచ్చుకునే ప్రక్రియ మొదలవుతుంది. అసలు కొనుగోలే లేకుండా పర్మిషన్ ల కోసం వెడితే చెత్త బుట్టలో పడేస్తారు. అదీ గాక కొనుగోలు ఆర్డర్ ఇచ్చాక కొన్ని పర్మిషన్ లు తెచ్చారు, కొన్ని పైప్ లైన్ లో ఉండగానే కొనుగోలు ఆర్డర్ కాన్సల్ చేసారు. ఫైల్ లో ఉంటుంది సరిగ్గా చూడు
ఆరోపణ - కొనుగోలు ఆర్డర్ కాపీ లను కనబడకుండా చేసారు
వాస్తవం - నీ దుంప తెగ. నిన్ను ఈ వెధవ పనిలో పెట్టిందెవడో గానీ వాణ్ని వాడు చెప్పుచ్చుకుని కొట్టుకోవాలి. కొనుగోలు ఆర్డర్ కాపీ ఫైల్ లోనే ఉంటుందిరా. కనపడకపోతే గుమాస్తాలను అడుగు.లేదంటే ఇంకో ఆఫీస్ ఫైల్ లో ఉంటుంది చూడు.అప్పటికీ కళ్ళు సహకరించకపోతే STC ని అడుగు. కొనుగోలు ఆర్డర్ రిలీజ్ చేసింది వాళ్ళేగా!!
ఆరోపణ - నళిన్ ప్రభాత్ లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోలేదు.
వాస్తవం - నళిన్ ప్రభాత్ డీజీపీ కి రాశాడా? ఏ బి కి రాశాడా? డీజీపీ కి రాస్తే ఆ విషయం ఏ బి కి సమాచారం ఇచ్చి దీని మీద ఏమంటావ్ అని ఏమన్నా అడిగారా? అదేమీ లేకుండా తన దృష్టి లో లేని విషయం గురించి ఏ బి ని ఎలా తప్పు పడుతున్నావ్?

ఇంకేమన్నా ఆరోపణలు ఊహించగలిగిన వాళ్ళు సోషల్ మీడియా లో వదలండి. ఎవడు చేసాడో ఎలాగూ తెలియని anonimity ఉంది గదా

దుష్ప్రచారం జరిపే విధానం:
ఇది మాస్ కమ్యూనికేషన్స్ స్టూడెంట్స్ కి ఒక నిజ జీవిత పాఠం. జాగ్రత్తగా గమనించండి.
ఉద్యోగి, కాదు ప్రత్యర్థి, కాదు కాదు శత్రువు గా భావించే ఒకానొక వ్యక్తి మీద నాజీ ల స్థాయిలో ముప్పేట దాడి చేయడమెలా? అందులో ప్రింట్, టీవీ, సోషల్ మీడియాలను ఎలా వాడాలి, అధికారికంగా తీసుకునే చర్యలకు అనధికారంగా ఇచ్చే లీకులను ఎలా అనుసంధానించాలి? సోదాహరణం గా వివరింపుము అన్నది ప్రశ్న.

ముందుగా ఆ అధికారిని మానసికంగా క్రుంగ దీయడానికి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టాలి. అడిగేవాడెవడు? అడిగితే వాడే అడగాలి. అడుగుతాడేమో చూద్దాం. అప్పోయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అడిగే అవకాశమే ఇవ్వొద్దు. ఎవరో ఒకర్ని పట్టుకుని కాళ్ళ బేరానికి వస్తాడేమో చూద్దాం. వచ్చి కాళ్ళు పట్టుకుంటే అప్పుడు ఆలోచిద్దాం. వాడికి జీతం కూడా ఇవ్వొద్దు. ఏం చేస్తాడో చూద్దాం. జీతం లేకుండా వాడెలా బ్రతుకుతాడో, వాడి పెళ్ళాం పిల్లలకి కూడెలా పెడతాడో మనకెందుకు? బాధుంటే వచ్చి కాళ్ళు పట్టుకోమను, అప్పుడు ఆలోచిద్దాం. మూణ్నెల్లు దాటి VR లో ఉంచితే కూర్చోబెట్టి జీతమివ్వాల్సినందుకు ఆడిట్ అభ్యంతరం వస్తుందా? వస్తే రానీ. అప్పుడు చూసుకుందాం.
ఈ లోపల వీడెవడు, వీడి బంధువులెవరు, వీడి ఆస్థి పాస్తులేంటి, అందులో దేన్ని ఎలా దెబ్బకొట్టొచ్చు, దేన్ని ఎలాంటి దుష్ప్రచారానికి వాడుకోవచ్చు - ఇవన్నీ మన దగ్గరున్న అధికార వ్యవస్థ ద్వారా సేకరించండి. అవసరమైనప్పుడు వాడదాం.
ఎనిమిది నెలలైనా వీడు ఇంకా కాళ్ళ బేరానికి రాలేదా? అదీ కాక జీతమిమ్మని, పోస్టింగ్ ఇమ్మని లెటర్ పెడతాడా? అది రికార్డు లో ఉంటుంది కాబట్టి ఏదో ఒక నాడు సమాధానం చెప్పాల్సి వస్తుందా? ఊ!! ఇంత దాకా వచ్చిందా? సరే ఇక విజృంభించండి. అన్ని మర ఫిరంగులనీ ఒక్క సారే పేల్చండి. దిమ్మ తిరిగి పోవాలి. ఏం జరిగిందో తెలిసే లోగా అంత ఐపోవాలి.

అధికారంనుపయోగించి సస్పెండ్ చెయ్యాలి. సస్పెన్షన్ ఆర్డర్ ఒక వారాంతంలో ఇవ్వండి. కోర్టుకు పోయే అవకాశం లేకుండా. అర్ధరాత్రి ఇవ్వండి. మీడియా వాళ్ళు ఏమి జరిగిందో, ఎందుకు జరిగిందో తెలుసుకునే సమయం ఉండకూడదు. జీవో తో పాటు అదిరిపోయే ఆరోపణలతో మీడియా కు మేత అందించండి. అందమైన ప్రెసెంటేషన్ తో రంగు రంగుల్లో ఇష్టమొచ్చిన ఆరోపణలతో, ఎవరు పంపారో చెప్పకుండా అర్ధరాత్రి వదలండి. దాన్ని యథా తథంగా ప్రచురించడం తప్ప మీడియా కు ఇంకో మార్గం ఉండకూడదు. మన సొంత మీడియా లో ఫుల్ బ్లాస్ట్ లో వెళ్ళండి. మనమిచ్చే యాడ్స్ మీద బతికే వాళ్లకు ఫోన్ చేసి చెప్పండి - ఏయ్ తెలుసుగా..- అని. తస్మదీయ మీడియా ఎలాగూ మన మాట వినదు. మసాలా మిస్సయిందని వాళ్ళ పాఠకులే తిడతారు. మనకెందుకు?

మొదటి రోజు ఆపరేషన్ సక్సెస్. రెండో రోజు మన మీద బతికే మధ్యస్థ మీడియాలో మనం పెట్టిన ఆరోపణలే ముఖ్యం గా హైలైట్ అయ్యేట్టు చర్చలు నడిపించండి. చెప్పగా చెప్పగా - ఆ నిప్పు లేనిదే పొగ వస్తుందా - అని ప్రజల్లో అనుమానం రేకెత్తించండి చాలు, మన పని అయినట్టే. మన మీడియా ఎలాగూ ఉండనే ఉంది.

మూడో రోజుకి కొంత అధికారిక సమాచారం లీకుల్లాగా ఎంచుకున్న పేపర్లకు చానళ్లకు ఇచ్చి రాయించండి, వేయించండి. వ్యక్తిగత వివరాలు, ఆస్థి పాస్తుల వివరాలు కూడా ఉప్పందించండి. కొంచెం మసాలా అవుతుంది. అందులో నిజమెంతో తెలుసుకునే ఓపిక మీడియా కి ఉండదు, ప్రజలు కూడా చచ్చినట్టు నమ్ముతారు. వాడి వ్యక్తిగతానికీ నువ్వు చేసిన సస్పెన్షన్ కి సంబంధం ఉందా లేదా అని ఆలోచించేదెవడు?

ఇంకా దారికి రాలేదా? వాడి ఆస్తుల మీద శల్య శోధన చెయ్యండి. ఎక్కడో ఒక చోట దొరక్కపోతాడా? దొరక్కపోయినా దొరికేశాడని లీకులు వదిలితే కాదనే వాడెవడు? ఏసీబీ, సిబిఐ, FBI , CAI అన్నీ వాడి మీద పంపుతున్నామని లీకులు వదలండి. టైమ్స్ నుండి ఆదాబ్ దాకా నమిలి ఉమ్మేస్తారు వాడిని. వీడి పనైపోయింది. కాకపోతే ఇంకో రొండు రోజులు కొనసాగించండి. అన్నీ చెప్పాలా?

చలో. నెక్స్ట్ టార్గెట్ ఎవర్రా? ఎవరక్కడ?