మెగాస్టార్ కల నిజం చేయనున్న అరవింద్?

July 02, 2020

చిరంజీవి ఎంత మెగాస్టార్ అయినప్పటికీ.. ఆయనకు కూడా ఫలానా దర్శకుడితో పని చేయాలనే కోరికలు లేకుండా ఉండవు. ఓ సందర్భంలో ఒక దర్శకుడితో పని చేయాలని ఉందంటూ బహిరంగంగా తన కోరికను వెల్లడించాడు కూడా. ఆ దర్శకుడు మరెవరో కాదు.. శంకర్. ‘రోబో’కు సంబంధించిన ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న చిరు.. శంకర్‌తో పని చేయాలన్న తన కోరికను బయటపెట్టాడు. ఏదో మాట వరసకు అన్నట్లు కాకుండా శంకర్‌తో సినిమా చేేయడం కోసం తానెంత ఆసక్తితో ఉన్నానో చెప్పకనే చెప్పాడు చిరు. ఆయన ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేసినట్లు గతంలో వార్తలొచ్చాయి. కానీ వర్కవుట్ కాలేదు. ఐతే ఎట్టకేలకు చిరు కల నిజం కాబోతోందని.. శంకర్‌తో ఆయన సినిమా త్వరలోనే సాకారం అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
చిరు కలను నిజం చేయడానికి ఆయన బావమరిది అల్లు అరవింద్ రంగంలోకి దిగాడట. ప్రస్తుతం ‘భారతీయుడు-2’ చేస్తున్న శంకర్‌తో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారట. శంకర్‌కు నిన్నటి తరం స్టార్ హీరోలతో సినిమాలు చేయడం ఇష్టం. రజనీతో ఏకంగా మూడు చిత్రాలు చేశాడు. అర్జున్‌తో రెండు చిత్రాలు రూపొందించాడు. కమల్‌తో రెండో సినిమా చేస్తున్నాడు. శంకర్‌ పీక్స్‌లో ఉండగా.. తెలుగు స్టార్ హీరోలు చాలామంది ఆయన కోసం ప్రయత్నించినా వర్కవుట్ కాలేదు. ఐతే ఇప్పుడు చిరు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి మునుపటి కంటే వేగంగా సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ‘సైరా’ తర్వాత కొరటాల శివ సినిమాను త్వరలోనే మొదలుపెట్టనున్న చిరు.. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమాను లైన్లో పెట్టాడు. ఇవన్నీ అయ్యేసరికి శంకర్ ‘భారతీయుడు-2’ పూర్తి చేసి ఖాళీ అవుతాడు. అల్లు ప్రయత్నాలు ఫలిస్తే వచ్చే ఏడాది చిరు-శంకర్ మెగా ప్రాజెక్టు మొదలయ్యే అవకాశముంది.