మ‌హేష్ - బ‌న్నీ మ‌ధ్య రాజీ... రంగంలోకి అగ్ర నిర్మాత‌...!

May 27, 2020

టాలీవుడ్ లో వచ్చే సంక్రాంతి పండుగ సీజన్ భారీ సినిమాలతో కళ‌కళ‌లాడేదుకు రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల‌ వైకుంఠపురంలో సినిమాలతో పాటు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ దర్బార్ సైతం రిలీజ్ అవుతున్నట్టు ప్రకటించారు. నంద‌మూరి హీరో కళ్యాణ్ రామ్ ఎంత మంచి వాడవురా సినిమా సైతం జనవరి 15న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాల సంగతి ఇలా ఉంటే ఇద్దరు అగ్ర హీరోలు మహేష్ బాబు, బన్నీ ఇద్దరు తమ సినిమాలను పోటాపోటీగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించడంతో తెలుగు సినిమా పరిశ్రమతో పాటు ట్రేడ్ వర్గాల్లో గందరగోళం నెలకొంది.

ఈ ఇద్దరు హీరోలు పంతానికి పోయి ఒకేరోజు తమ సినిమాలను రిలీజ్ చేస్తే సోలో రిలీజ్ లేక ఓపెనింగ్స్‌పై ఆ ఎఫెక్ట్ ప‌డి ట్రేడ్‌ వర్గాలు నష్టపోడం ఖాయంగా కనిపిస్తోంది. ముందుగా అల వైకుంఠపురంలో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన కొద్దిసేపటికే... మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా సైతం అదే రోజున రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్లు వదిలారు. రెండు భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో పాటు... రెండిటికీ భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరగటంతో ఇండస్ట్రీకి చెందిన పెద్దలు సైతం ఈ పోటీ నివారించడానికి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

ఇక సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో ఒకే రోజు రిలీజ్ కావడంపై ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూట‌ర్ దిల్ రాజు తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇందులో స‌రిలేరుకు ఆయ‌న నిర్మాత‌. ఇక అల వైకుంఠ‌పురంలో సినిమాకు డిస్ట్రిబ్యూట‌ర్‌. ఈ రెండు సినిమాలు ఒకే రోజు వ‌చ్చి.. ఫ‌లితం ఏదైనా తేడా కొడితే ఆయ‌నే తీవ్రంగా న‌ష్ట‌పోతారు. అందుకే ఆయ‌న నేరుగా రంగంలోకి దిగుతున్నార‌ట‌. ఈ ఇద్ద‌రు హీరోల‌తోనూ త‌న‌కు ఉన్న‌ సన్నిహిత సంబంధాల వల్ల వారితో చర్చించి.. ఒక సినిమా రెండు రోజులు వాయిదా వేయించే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు భోగ‌ట్టా.

ఈ నేపథ్యంలో మహేష్ - అల్లు అర్జున్‌తో పాటు ఈ రెండు సినిమాల మేక‌ర్ల మ‌ధ్య ఓ సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసి... ఇరు వ‌ర్గాల‌ను ఒప్పించి... ఒక సినిమా వెన‌క్కు త‌గ్గించేలా ఒప్పించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. మ‌రి ఈ విష‌యంలో రాజు ప్ర‌య‌త్నాలు స‌క్సెస్ అవుతాయా ?  లేదా ? ఇద్ద‌రు హీరోలు అదే పంతం మీద ఉంటారా ? అన్న‌ది చూడాలి.