అతి స‌ర్వ‌త్ర వ‌ర్జ‌యేత్ బ‌న్నీ

February 25, 2020

ఒక‌ప్పుడు అల్లు అర్జున్ అంద‌రికీ ఆమోద యోగ్యుడైన హీరోలా ఉండేవాడు. అత‌డి మీద అంత‌గా నెగెటివిటీ క‌నిపించేది కాదు. అంద‌రు హీరోల అభిమానులూ అత‌డి ప‌ట్ల సానుకూల‌త‌తో ఉండేవాళ్లు. కానీ గ‌త కొన్నేళ్ల‌లో బ‌న్నీ అనూహ్యంగా రైజ్ కావ‌డం.. సొంత ఇమేజ్ బిల్డ‌ప్ చేసుకుని ఫాలోయింగ్, క‌లెక్ష‌న్ల విష‌యంలో పెద్ద స్టార్ల‌కు దీటుగా నిల‌బ‌డ‌టంతో నెమ్మ‌దిగా నెగెటివిటీ మొద‌లైంది. అదే స‌మ‌యంలో బ‌న్నీని ఎక్కువ చేసి చూపించ‌డానికి అత‌డి పీఆర్వో బ్యాచ్ సోష‌ల్ మీడియాలో మితిమీరిన ప్ర‌చారాలు చేయ‌డం కూడా చేటు చేసింది. బ‌న్నీని సోష‌ల్ మీడియా కింగ్‌గా అభివ‌ర్ణిస్తూ ప్ర‌చారం హోరెత్తించ‌డం అత‌డి ప‌ట్ల నెటిజ‌న్ల‌లో నెగెటివిటీని పెంచింది. దువ్వాడ జ‌గ‌న్నాథం సినిమా విష‌యంలో చేసిన అతి తాలూకు ప్ర‌భావం బ‌న్నీ త‌ర్వాతి చిత్రం నా పేరు సూర్య మీడ ప‌డ‌టం వాస్త‌వం.
నా పేరు సూర్య మ‌రీ అంత పెద్ద డిజాస్ట‌ర్ కావాల్సిన సినిమా ఏమీ కాదు. కానీ వివిధ సంద‌ర్భాల్లో బ‌న్నీ ప్ర‌వ‌ర్త‌న‌ ఆ సినిమా మీద నెగెటివిటీ పెంచింద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌తో సున్నం పెట్టుకోవ‌డం కూడా ఇందులో ఒక కార‌ణ‌మే. ఇక బ‌న్నీ గురించి పీఆర్వో టీమ్స్ చేసే అతి ప్రచారాలు అత‌డి మీద జ‌నాల్లో నెగెటివిటీ పెంచేలా చేస్తున్నాయి. అయినా వీళ్ల‌లో ఏ మార్పూ రావ‌ట్లేదు. బ‌న్నీ కొత్త సినిమా అల వైకుంఠ‌పుర‌ములో సినిమా నుంచి రిలీజైన రెండు పాట‌ల‌కు యూట్యూబ్‌లో ఎక్కువ వ్యూస్, లైక్స్ రావ‌డం గురించి అదే ప‌నిగా ఊద‌ర‌గొట్టేస్తున్నారు. జ‌నాలు భ‌రించ‌లేని స్థాయికి వీళ్ల ప్ర‌చారాలు వెళ్లిపోయాయి. రికార్డుల గురించి ఆప‌కుండా ప్ర‌చారం హోరెత్తిస్తుండ‌టం ప్రేక్ష‌కుల్లో పాజిటివిటీ పెంచ‌క‌పోగా నెగెటివ్ అయ్యేలా క‌నిపిస్తుంది. కాబ‌ట్టి ఈ అతిని కొంచెం త‌గ్గిస్తే బెట‌ర్.