ఓవర్సీస్ వార్ .. ఎవరు గెలిచారంటే!

May 29, 2020

టాలీవుడ్ హీరోల్లో ఓవర్సీస్ వరకు మహేష్ బాబుది తిరుగులేని ఆధిపత్యం. ఓవరాల్‌గా మహేష్ పేరిట అక్కడ చాలా రికార్డులున్నాయి. అక్కడ తొలి మిలియన్ డాలర్ మూవీని అందించిన ఘనత మహేష్ బాబుదే. ఆ తర్వాత కూడా మిలియన్ల కొద్దీ కలెక్షన్లు కొల్లగొట్టాడు మహేష్. అందుకే అతణ్ని ఓవర్సీస్ కింగ్ అంటుంటారు. ఐతే గత కొన్నేళ్లలో ఈ హోదాకు న్యాయం చేసేలా సూపర్ స్టార్ సినిమాలు ఆడట్లేదు. అందులోనూ అతడి కొత్త సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’కు ఓవర్సీస్‌లో అనుకున్నంత క్రేజ్ కనిపించడం లేదు. మరోవైపు సోషల్ మీడియా కింగ్‌గా తన పీఆర్ టీంతో ట్యాగ్ వేయించుకున్న అల్లు అర్జున్‌.. ఓవర్సీస్‌లో చాలా వీక్ అని గత సినిమాల కలెక్షన్లను బట్టి అర్థం చేసుకోవచ్చు. అతను క్లాస్ టచ్ ఉన్న సినిమాలే చేసినప్పటికీ.. ఓవర్సీస్‌లో పెద్దగా మార్కెట్ సంపాదించుకోలేకపోయాడు.

ఐతే ఈసారి ‘అల వైకుంఠపురములో’ అనే క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయడం, దానికి త్రివిక్రమ్ దర్శకుడు కావడంతో ఓవర్సీస్‌పై బన్నీ పట్టు సాధించేలాగే కనిపిస్తున్నాడు. మహేష్ సినిమాను మించి బన్నీ చిత్రానికి అక్కడ క్రేజ్ కనిపించడం విశేషం. దీంతో వసూళ్లలో ‘సరిలేరు..’ను ‘అల..’ దాటేస్తుందేమో అన్న అంచనాలు కలిగాయి. ప్రి సేల్స్ ట్రెండ్ చూస్తే అది నిజమే అనిపిస్తోంది. మహేష్ సినిమాతో పోలిస్తే  ఒక రోజు ఆలస్యంగా వస్తున్నప్పటికీ బన్నీ మూవీకే ప్రి సేల్స్ ఎక్కువగా ఉండటం విశేషం. బుధవారం నాటికి యుఎస్‌లో సంక్రాంతి సినిమాల ప్రి సేల్స్ చూస్తే.. ‘అల వైకుంఠపురములో’కు 14,689 టికెట్లు అమ్ముడుబోవడం విశేషం. ‘దర్బార్’ అన్ని భాషల్లో కలిపి 13,423 టికెట్లతో రెండో స్థానంలో ఉంది. ‘సరిలేరు నీకెవ్వరు’12,507 టికెట్లు అమ్మకంతో మూడో స్థానానికి పరిమితం కావడం గమనార్హం. ఇలా మహేష్ మీద ఓవర్సీస్‌లో బన్నీ పైచేయి సాధించడం అరుదైన విషయమే. ఐతే ‘సరిలేరు..’, ‘దర్బార్’ సినిమాల ప్రిమియర్ టికెట్ రేటు 20 డాలర్లు కాగా.. ‘అల..’ రేటు 14 డాలర్లే కావడం విశేషం.