ఏపీ ముస్లిం అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా (AMANA) ఏర్పాటు

November 20, 2019

* ముస్లింల ఆత్మీయ సమావేశంలో కార్యరూపం దాల్చిన సంస్థ

అమెరికా లో నివశిస్తున్న తెలుగువారిలో - ముస్లిం సామాజిక వర్గం గణనీయమైన సంఖ్య లో పెరుగుతోంది. భారతీయ ముస్లింల వలసలు కూడా ఇటీవల బాగా పెరిగాయి. ఇంతకాలం అమెరికా లో ఎక్కువగా ఉన్న తెలుగు వారిలో తక్కువ సంఖ్యలో ఉన్న ముస్లిం కుటుంబాలకు ఒక వేదిక లేకపోవడం వారిని ఆలోచనలో పడేసింది. తమ ఆధ్యాత్మిక అవసరాలకు అంతర్జాతీయ ముస్లిం సమాజం లో ఒకరుగా కలిసిపోయినా, తాము పుట్టి పెరిగిన ఆంధ్ర ప్రదేశ్ మూలాలను గుర్తు పెట్టుకుని అనుసంధానం అవడానికి, తెలుగు వారందరితో పాటు తాము కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రగతిలో పాలుపంచుకోవడానికి ఒక వేదిక అవసరాన్ని వారు గ్రహించారు. ఆంధ్ర ప్రదేశ్ ముస్లిం అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా ని స్థాపించాలన్న తమ చిరకాల ఆలోచనకు కార్యరూపం ఇచ్చారు. దీనికోసం తెలుగు ముస్లింలు ప్రత్యేకంగా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు.
స్థానిక అలెన్ లో డాక్టర్ అబ్దుల్ రహమాన్ నివాసం లో దాదాపు 15 ముస్లిం కుటుంబాలు సమావేశమయ్యి, ఆంధ్ర ప్రదేశ్ ముస్లిముల ప్రాతినిధ్యం గురించి, తెలుగు సమాజం లో మమేకవ్వడం గురించి, అమెరికా లో నివసిస్తున్న ఆంధ్ర ముస్లిం లను ఒక వేదిక మీదకు తీసుకువచ్చి వారి సామాజిక, సాంఘిక అవసరాలలో తోడ్పాటు అందించడం గురించి చర్చించుకున్నారు.
ఈ సమావేశాం లో డాక్టర్ అబ్దుల్ రహమాన్ తో పాటు, డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ, మహమ్మద్ ఇక్బాల్ గగ్గుతురు, అక్బర్ సయ్యద్, షాజహాన్ షేక్, మస్తాన్ షేక్, షఫీ మహమ్మద్, ముజాహిద్ షేక్, ఫైజ్ షేక్, కాలిఫోర్నియా నుంచి అబ్దుల్ ఖుద్దూస్, జాకిర్ మహమ్మద్ మరియు నసీం షేక్ పాల్గొన్నారు.