ఆ నాయకుడి దెబ్బకు వైసీపీకి దిమ్మతిరిగింది…

May 28, 2020

చీరాల నుంచి గెలిపొందిన స్వతంత్ర ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌.. తన ప్రాంతం అభివృద్ధి చెందడానికి తెలుగుదేశంలోకి వచ్చానని చెప్పకున్నారు. తీరా ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తాను పార్టీ మారుతున్నట్లు మీడియాకు లీకులిచ్చారు. వైసీపీ కండువా కప్పుకోవడమే తరువాయి.. జగన్‌ సమక్షంలోనే చేరుతున్నారు అంటూ.. ఒక దశలో ఎప్పడు చేరతారో టైం కూడా చెప్పారంటే ఏ రేంజ్‌లో ప్రచారం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. దాంతో ఆయనకు కావాల్సినంత ప్రచారం దక్కింది. ఇటు వైసీపీ శిబిరంలోనూ అటు తెలుగుతమ్ముళ్ల గూటిలోనూ విపరీతంగా చర్చ జరిగింది. అధికార పార్టీని కాదంటూ తమ దగ్గరకు రావడం ఎన్నికల వేళ కలిసొస్తుందని జగన్‌ కోటరీ భావించింది. అందుకే ఈ అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆమంచి కూడా వీటిపై ఎటువంటి కామెంట్‌ చేయకుండా మౌనంగా ఉన్నారు. బాగా దగ్గరగా ఉన్న మీడియా మిత్రులు అడిగితే చెప్పి చెప్పనట్లుగా తన మనసులో మాట పంచుకున్నారు. జరగబోయే నష్టాన్ని సరిగ్గా అంచనా వేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చక్రం తిప్పారు. ఆమంచి వెళ్లిపోవడానికి కారణాలు ఏంటి అంటూ అటు పార్టీలోనూ ఇటు ఎమ్మెల్యేతోనూ సంప్రదింపులు ప్రారంభించారు. రెండువైపుల నుంచి వచ్చిన అంశాలను పరిశీలించి వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేశారు. ప్రధానంగా పార్టీలో ఇమడలేని పరిస్థితులు కల్పించారని ఆమంచి తెలిపినట్లు సమాచారం. తొలుత వైసీపీ తిరుపతి సభ వేదికగానే పార్టీ మారతారు అని జరిగిన ప్రచారం ఆధారంగా ఆ లోపులోనే ఇటు బాబు అటు లోకేష్‌ కల్పించుకుని సమస్య పరిష్కారానికి ప్రయత్నిద్దాం కంగారు పడొద్దని హామీ లభించేసరికి పార్టీ మారే విషయం వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఆ తరువాత ఇతర నాయకులతో ఉన్న ఇబ్బందులు తొలిగించి, తన దగ్గరకు తీసుకురావాలని జిల్లా మంత్రి శిద్దారాఘవరావుకు బాధ్యత అప్పగించారు.

అసలు కథ అప్పుడే ఇంట్రస్టింగ్‌ మారింది. అప్పటి వరకు వైసీపీలో చేరతారని బలంగా నమ్మిన జగన్‌ కోటరీ ఆమంచి సీఎంని కలిస్తే మారే అవకాశం ఉందని లెక్కలు గట్టారు. గంట గంటకు వైసీపీ నాయకులు ఆమంచితో టచ్‌లోనే ఉన్నారు. ఇప్పుడు ఉన్నపళంగా ఎన్నికలు వస్తే వైసీపీకి 140 పైచీలుకు వస్తున్నాయని సర్వేలు ఉన్నాయని, పార్టీలోకి రావడానికి ఇదే సరైన సమయంమని ఇప్పడు వస్తేనే తగినంత గౌరవం దక్కుతుందంటూ రకరకాల ప్రలోభాలకు గురిచేశారు. అయితే పార్టీ మారేముందు సీఎంని కలవాల్సిందే అని ఆమంచి తేల్చి చెప్పారట.. దాంతో దిక్కుతోచని వైసీపీ నాయకులు జగన్‌కు అతి సన్నిహితంగా ఉన్న నాయకుడితో నేరుగా ఫోన్‌ చేయించారట.. బ్రదర్‌ రాబోయేది మన ప్రభుత్వమే ఇప్పుడు అక్కడే ఉంటే కలిగే ప్రయోజనం ఏంటి అని హితోపదేశం చేశారట.. వాటన్నింటినీ దాటుకుంటూ ఆమంచి సీఎంతో భేటీ అయ్యారు. ఆయన ఎదుర్కొంటున్న ప్రతి అంశాన్ని షార్ట్‌అవుట్‌ చేసి పరిష్కారదిశగా బాబు మాట్లాడటంతో ఆమంచి మెత్తబడ్డారు. నా సమస్యలను పరిష్కరించిన తరువాత మారాల్సిన అవసరం ఏముంది అని చెప్పి.. అయితే తన కార్యకర్తలతో సమావేశమై చెబుతానని, పార్టీ మారే ప్రసక్తి లేదని కూడా స్పష్టత ఇచ్చారట.. దీంతో వైసీపీలో గుబులు మొదలైంది. వస్తానన్నా నాయకులు రాకపోతే పార్టీపై అపనమ్మకం కలిగేలా ఉందని తెగ ఆందోళన పడిపోతున్నారట…