అమరావతి జేఏసీ లక్ష్యం ఏంటి?... థింక్ బిగ్ బాసూ

July 10, 2020

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలోనే కొనసాగించాలంటూ రాజధాని రైతులు 66 రోజులుగా పట్టు వదలని విక్రమార్కుడికి మల్లే నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే వారి నిరసనలు, నినాదాలు తమ చెవికి ఎక్కలేదన్నట్లుగా వ్యవహరిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు...మూడు రాజధానుల దిశగా సాగిపోతూనే ఉంది. అయితే ఎలాగైనా రాజధానిని అమరావతి నుంచి తరలించకుండా అడ్డుకుంటామంటూ రైతులతో ఏర్పాటైన అమరావతి ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) చెబుతోంది. ఈ దిశగానే వీలయినమేర ఉద్యమాన్ని ఉర్రూతలూగిస్తున్న జేఏసీ... అందుబాటులో ఉన్న అన్ని రకాల నిరసనలను నిర్వహిస్తోంది. నేతలను కలుస్తోంది. ఈ క్రమంలో శనివారం నాడు అమరావతి బంద్ కు పిలుపిస్తూ జేఏసీ సంచలన ప్రకటన చేసింది. ఇక్కడే జేఏసీ చేస్తున్న ఆందోళనల తీరుపై ఒకింత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయినా అమరావతి బంద్ కు పిలుపు ఇస్తే... అమరావతిని బంద్ చేస్తే ఫలితం ఏమిటి? నిజమే.. సగటు జీవిలో వ్యక్తమయ్యే అనుమానమే ఇది. ఎందుకంటే... అమరావతి పరిధిలో 29 గ్రామాలున్నా... అన్నీ పల్లెసీమలే. పల్లె సీమల్లో బంద్ నిర్వహిస్తే ఒరిగేదేమిటి? ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా.. అమరావతి పరిరక్షణ ఉద్యమానికి ఊతం అందిస్తున్న ఆ 29 గ్రామాల ప్రజలకు ఇక్కట్లు తప్పవు. ఎందుకంటే.. అమరావతి పరిధిలో ప్రస్తుతం ఉన్నది ఆయా గ్రామాలకు చెందిన ప్రజలే. బయటి వారు ఎవరూ అక్కడ ఉండటం లేదు. ఇక సచివాయ ఉద్యోగులంటారా? వారికి శని, ఆదివారాలు సెలవులే కదా. మరి ఉద్యోగులకు సెలవు రోజున అమరావతిని దిగ్బంధిస్తే... ఉద్యోగులకు గానీ, ప్రభుత్వ పాలనకు గానీ ఇబ్బందేమీ ఉండదు కదా. 

అయినా ఎప్పుడైనా, ఎవరైనా బంద్ చేస్తే ఏం ఆశిస్తారు? తమ నిరసనల ఫలితంగా జనజీవనం స్తంభించి ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలిగి ప్రభుత్వం దిగి వస్తుందనేగా నిరసనకారులు ఆలోచిస్తారు. నిజమే. మరి శనివారం నాటి అమరావతి బంద్ కారణంగా ప్రభుత్వ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు ప్రభుత్వం ఎందుకు దిగివస్తుంది? ఎందుకు స్పందిస్తుంది? మరి ప్రభుత్వానికి నొప్పి కలగని అమరావతి బంద్ ఎందుకు? ప్రభుత్వం మొద్దు నిద్రను వీడేలా చేయని ఈ అమరావతి బంద్ ఎందుకు? అమరావతి పరిరక్షణ కోసం అమరావతి బంద్ కాకుండా ఏపీ బంద్ అని ఎందుకు పిలుపునివ్వరు? ఇదీ ఇఫ్పుడు అందరి నోటా వినిపిస్తున్న ప్రశ్న. 

నిజమే... అమరావతి పరిరక్షణ కోసం జేఏసీ ఇవ్వాల్సింది అమరావతి బంద్ పిలుపు కాదు. అమరావతి పరిరక్షణ కోసం నవ్యాంధ్ర బంద్ కు జేఏసీ పిలుపునివ్వాలి. అప్పుడే అమరావతి బంద్ వల్ల కలిగే నొప్పి ఏమిటో జగమొండిగా మారిన జగన్ సర్కారుకు తెలిసి వస్తుంది. మరి అమరావతి పరిరక్షణ కోసం నవ్యాంధ్ర బంద్ కు జేఏసీ ఎందుకు పిలుపునివ్వదు? దానిని ఆ స్థాయి లేదా? అమరావతి పరిరక్షణ ఉద్యమాన్ని అమరావతికే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తం చేసి ఉంటే... ఇప్పటికే జగన్ సర్కారు దిగివచ్చేది కదా. అందుకే ఇప్పుడు అమరావతి బంద్ అంటూ జేఏసీ నుంచి పిలుపు రాగానే... అందరూ కాస్త విశాల దృక్పథంతో ఆలోచించాలని జేఏసీకి సూచనలు ఇస్తున్నారు. అంటే కార్యసాధనలో అలుపెరగకుండా ఉద్యమిస్తున్న అమరావతి జేఏసీ తన థింకింగ్ ను విశాలం చేయాలన్న మాట. అప్పుడే ఫలితం వస్తుందన్న మాట. ఆ దిశగా అమరావతి జేఏసీ ఎప్పుడు నినదిస్తుందో చూడాలి.