రాజధాని కడితే.. 60 వేల కోట్లు, మార్చాలంటే 2 లక్షల కోట్ల ఖర్చు?

April 06, 2020

ఎంపీ సుజన చౌదరి రాజధాని అమరావతి గురించి షాకింగ్ విషయాన్ని చెప్పారు. ఆయన మాట విన్నవారికి ఎవరికైనా ‘‘రాజధాని మారదు’’ అనిపించేలా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... రాజధాని కట్టాలంటే... గత ప్రభుత్వం అంచనాల ప్రకారం 60 వేల కోట్లు అవుతుంది. కానీ రాజధాని మార్చడానికి 90 వేలు కోట్లు కావాలి. ఎందుకంటే... రాజధానిలో రైతులందరూ కోర్టుకు పోతే నష్టపరిహారం కింద వాళ్లందరికి కలిపి 80 - 90 వేల కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి వస్తోంది అని సుజనా అన్నారు. అదే పనులు మొదలుపెట్టిన కాంట్రాక్టర్లు అందరూ కోర్టుకు పోతే వారికి లక్షన్నర కోట్లకు పైగా నస్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని, ఆ డబ్బు ఏపీ సర్కారు భరించగలదా అని సుజన ప్రశ్నించారు. రాజధాని మార్చడం సులువు కాదని అన్నారు. వేలాది మంది ప్రజలు రాజధానికి విరాళాలు ఇచ్చారని... వారికి కూడా సమాధానం చెప్పాల్సి వస్తోందని, లేకపోతే అది చీటింగ్ కేసు అవుతుందని సుజన అన్నారు. 

ఉన్న రాజధానిని పూర్తి చేసి కొనసాగించడానికి లక్ష కోట్లు అవసరం లేదని, పెండింగ్ పనులు పూర్తి చేసి పాలన పై దృష్టి పెట్టాలని సుజన హెచ్చరించారు. నవరత్నాలకు డబ్బు కోసం దేవాదాయ భూమలు, ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారని ఆయన ఆరోపించారు. అయినా అసెంబ్లీ సాక్షిగా అమరావతిని అందరూ ఆమోదించినట్టు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి 30 వేల ఎకరాల రాజధాని కోరుకుంటున్నట్టు సాక్ష్యాలు ఉన్నాయని, ప్రతిపక్ష నేతగా ఆ రోజు విభేదించకుండా ఈరోజు విభేదించడం అంటే ప్రజలను మోసగించడమే అన్నారు. ఒకవేళ ఆరోజు జగన్ అంగీకరించకుండా ఉంటే... రాజధాని రైతులు భూములు ఇచ్చేవారు కాదని, అపుడు ప్రభుత్వం కూడా పునరాలోచన చేసేదని సుజన అన్నారు.