అమరావతి ధర్నాలు - ఆ పుకారు నిజం కాదు

July 15, 2020

అమరావతి పరిరక్షణ కోసం రోడ్డెక్కిన మ‌హిళ‌ల‌పై క‌క్ష సాధింపు కోసం పోలీసులు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నార‌నే ప్ర‌చారం అవాస్త‌వ‌మ‌ని తేలింది. పాస్‌పోర్టులు ర‌ద్దు చేయ‌నున్నార‌నే ప్ర‌చారం నిజం కాద‌ని తాజాగా అధికారికంగా రుజువు అయింది. ఈ మేర‌కు విజ‌య‌వాడ పాస్‌పోర్ట్ అధికారి డీఎస్ఎస్ శ్రీ‌నివాస‌రావు ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.
విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ నుంచి మహాత్మాగాంధీ రోడ్డులోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు ఈనెల 10న మహిళలు, యువతులు పెద్దసంఖ్యలో భారీ ర్యాలీ తలపెట్టగా దీనికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో నిర్బంధాలు, పోలీసులను చేధించుకుంటూ యువతులు రోడ్డుపైకి వ‌చ్చారు. అయితే, ర్యాలీకి వచ్చిన మహిళలు, యువతులను పోలీసులు అరెస్ట్‌ చేసి వివిధ స్టేషన్లకు తరలించారు. అయితే, ఇదే స‌మ‌యంలో ఓ కీల‌క ప్ర‌చారం జ‌రిగింది. ఆందోళ‌న‌ల్లో పాల్గొన్న వారి ఆధార్‌, పాస్‌పోర్ట్‌ నెంబర్లు సేకరించి.. మొత్తం 8 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి సంబంధిత‌ వివరాలను విజయవాడలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయానికి అందించారని పేర్కొంటూ...ర్యాలీలో పాల్గొన్న యువతుల్లో ఎక్కువమంది విదేశాల్లో చదువుకోవాలని రెడీ అవుతున్నందున వారికి పాస్‌పోర్టు రాకుండా, వ‌చ్చిన వారివి ర‌ద్ద‌య్యేలా చేశార‌నేది ఆ ప్ర‌చారం సారాంశం.
అయితే, ఈ ప్ర‌చారాన్ని విజ‌య‌వాడ పాస్‌పోర్ట్ అధికారి డీఎస్ఎస్ శ్రీ‌నివాస‌రావు ఖండించారు. ``అమ‌రావ‌తి ఆందోళ‌న‌ల్లో పాల్గొన్న వారికి పాస్‌పోర్ట్ ఇవ్వ‌బోం అంటూ ప్ర‌చారం జ‌రుగుతుండ‌టం మా దృష్టికి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే వివ‌ర‌ణ ఇస్తున్నారు. పాస్‌పోర్టు ఇవ్వ‌క‌పోవ‌డం మ‌రియు ర‌ద్ధు చేయ‌డం సంబంధిత చ‌ట్టాల ప్ర‌కార‌మే జ‌రుగుతుంది. తాజా ప్ర‌చారంలో ఎలాంటి నిజం లేదు. `` అని ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.  

Read Also

ఎస్వీబీసీ చానల్ బాధ్యతలు ఆ దర్శకుడికా?
మహేష్ దమ్మెంతో చూడాలిప్పుడు..
కష్టపడి పని చేశాక.. పార్టీ ఎంతగా చేసుకోవాలో చెప్పేసింది