చిరంజీవి, నాగార్జున... ఈ ట్విస్టును ఊహించలేదు

August 03, 2020

ప్రపంచంతో మాకేం పని. మా పనులు అయితే చాలు అన్నట్టు సినిమా పెద్దలు ముఖ్యమంత్రులను కలుస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మే నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన చిరంజీవి, నాగార్జున తదితరులు ఈ విషయంపై బాలకృష్ణ వంటి ప్రముఖులకు కూడా సమాచారం ఇవ్వకపోవడం తెలిసిందే. ఇది వివాదాస్పదం అయ్యింది. అయితే అయ్యింది గాని చిరంజీవి కోరిక తీరింది. తెలంగాణ గవర్నమెంటు షూటింగులకు అనుమతి ఇచ్చింది. పనిలో పనిగా ఏపీ సీఎం జగన్ ను కలిస్తే ఒక పనైపోతుందని... చిరు, నాగార్జున, రాజమౌళి తదితరులు అమరావతికి ప్రత్యేక విమానం వేసుకుని మరీ వెళ్లారు.

అయితే, వారి ఊహించిన ట్విస్ట్ ఒకటి ఎదురైంది. అమరావతి రైతులు వారు దిగిన గోకరాజు గంగరాజు అతిథి గృహం వద్దకు మెరుపు ధర్నాకు దిగారు. సినిమా పరిశ్రమకు రాజధాని అక్కర్లేదా. ఒకటే రాష్ట్రం, ఒకటే రాజధాని అంటూ నినాదాలు చేశారు. సినిమా వాళ్లను మేము వ్యతిరేకించడం లేదు. వారి మద్దతు కోరుకుంటున్నాం. ఏపీ సమస్యలు వారికి పట్టవా? ఏపీ ప్రభుత్వం నుంచి హక్కులు కోరుకున్నపుడు ఏపీ ప్రజలకు మద్దతు కూడా పలకాలి అని వారు అన్నారు.

మాది అత్యాశ కాదు.. అమరావతి కడతామంటే మా పొలాలు ఇచ్చాం. అపుడే ఇలాంటి 3 రాజధానుల సంగతి చెబితే మేము పొలాలు ఇచ్చేవాళ్లం కాదు. మమ్మల్ని మోసం చేశారు. అమరావతియే రాజధానిగా కొనసాగించాలి. సినిమా పరిశ్రమ అమరావతికి మద్దతు పలకాలి అంటూ వారు డిమాండ్ చేశారు. 175 రోజులుగా అమరావతి రైతులు రాజధాని కోసం ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉంది. కోర్టు ఈ వ్యవహారాన్ని ఆపింది. అయితే పూర్తిగా రద్దు చేయలేదు. ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది.

గతంలో చిరంజీవి మూడు రాజధానులకే మద్దతు పలికారు. తమ్ముడు జనసేన పవన్ మాత్రం ఒకే రాజధాని అన్నాడు. అయితే, ప్రతిపక్షాలన్నీ అమరావతి తరఫునే మాట్లాడతున్నాయి. జగన్ మాత్రం తన మాటే చెల్లాలని అనుకుంటున్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే అమరావతిని మార్చే అవకాశం కనిపించడం లేదు.