నేటి అర్ధరాత్రికి అమరావతి మొత్తం ఖాకీలతో నిండిపోనుందా?

July 14, 2020

రాజధాని బిల్లును ఏపీ అసెంబ్లీలో రేపు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అమరావతి ప్రాంతం మొత్తం పోలీసుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే ప్రమాదం ఉందని అంచనాలు ఉండటంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. అర్ధరాత్రి కల్లా పోలీసులు అమరావతి చేరుకోనున్నారు. ప్రస్తుతం ఇప్పటికే అక్కడే పెద్ద సంఖ్యలో పోలీసులు ఉన్నారు. అయితే, రేపు అసెంబ్లీ ముట్టడికి అమరావతి జేఏసీ పిలుపు ఇవ్వడంతో  పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని గ్రహించి పోలీసులను మొహరిస్తున్నారు. అసెంబ్లీ ప్రాంతంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 

భద్రత ఏర్పాట్లు పరిశీలించడానికి దక్షిణ కోస్తాంధ్ర ఐజీ ఐపీఎస్ అధికారులతో సమావేశం అయ్యారు. పలువురు ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో ఈ భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు వారందరికీ ఐజీ ప్రత్యేక సూచనలు చేశారు. అమరావతి మొత్తం పోలీసుల ఆంక్షలు రేపటి నుంచి మూడు రోజుల పాటు అమలవుతాయి.   అమరావతితో పాటు గుంటూరు, కృష్ణా జిల్లా అంతటా పోలీసు ఆంక్షలు ఉండే అవకాశం ఉంది. 

పోలీసులకు ఐజీ చేసిన ఆదేశాల్లో ఒక మాట చాలా కీలకంగా కనిపిస్తోంది. ‘‘అసెంబ్లీ సమావేశాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి. ముఖ్యంగా నిరసనకారులతో స్నేహ పూర్వకంగా, మర్యాదగా వ్యవహరించాలని తెలిపారు. అప్పటికీ పరిస్థితి అదుపు తప్పితే మాత్రం కఠినంగా వ్యవహరించండి’’.

ఈ ఆదేశాల్లో రెండు విరుద్ధమైన విషయాలు ఉన్నాయి. స్నేహ పూర్వకం, మర్యాద అంటూనే... కఠినంగా వ్యవహరించమనడం అంటే ఏదో తేడాగా ఉంది. ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే ఏపీ ప్రజలు రేపు కొన్ని ఘోరాలు చూడక తప్పదు అనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. అయినా రైతులకు ఏమేం ప్రయోజనాలు కల్పిస్తారో మొదట ప్రకటించి తర్వాత అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడితే వారి ఆందోళన చాలావరకు తగ్గేది. కానీ ఏపీ ముఖ్యమంత్రి దూకుడు వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనల్లో ఉన్నారు.