కొత్త రాజధాని పెట్టలేరు, ఉన్నరాజధానిలో తిరగలేరు

August 13, 2020

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇపుడు త్రిశంకు స్వర్గంలో ఉంది. అమరావతి విషయంలో అటు ముందుకు వెళ్లలేక, ఇటు వెనక్కు పోలేని ఒక అగమ్యగోచర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ముందుకు పోవడానికి ఆటంకాలు అడ్డు వస్తున్నాయి, వెనక్కు తగ్గడానికి ఇగో అడ్డు వస్తోంది. దీంతో వ్యూహాత్మక అడుగులు వేయడానికి వైసీపీ సర్కారు చేస్తున్న ప్రయత్నం అనేక అనుమానాలకు, సందేహాలకు , అయోమయానికి దారితీస్తోంది.  

అమరావతి గురించి వైసీపీ సర్కారు ఏదో చేద్దాం అనుకుని, ఏదో చేసి, అదింకేదో అయ్యింది. ఎంతకీ అమరాతి ప్రాంతంలో నిరసనలు ఆగకపోవడం, 3 రాజధానులకు ఊహించినంత ప్రజా మద్దతు రాకపోవడం, కోర్టుల పరంగా భారీగా చిక్కులు వచ్చే అవకాశం ఉండటంతో ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటోన్న ప్రభుత్వం గందరగోళంలో పడింది.

కొత్త రాజధాని పెట్టలేరు. ఉన్నరాజధానిలో తిరగలేరు. 188 రోజులు అయినా అమరావతి రైతుల్లో నిరసన ఆగడం లేదు. ఇప్పటికే భారీ బలగాల సాయం లేకుండా రాజధానిలో ముఖ్యమంత్రి, మంత్రులు తిరగలేని పరిస్థితి. నిరసనల భయం. కోవిడ్ కూడా వారి నిరసనలను ఆపలేకపోయింది.

ఆటంకాలతో పాటు కరోనా నేపథ్యంలో ఆర్థిక వనరులు తారుమారైన నేపథ్యంలో ఇక అమరావతిలోనే రాజధానిని కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే... ఒకే సారి వెనక్కు తగ్గడానికి అధినేతకు అవమానంగా అనిపిస్తోంది. దీంతో ముందు మంత్రుల ద్వారా సానుకూల పవనాలు పంపి అమరావతి వాసులను మచ్చిక చేసుకునే ఒక ప్రయత్నం జరుగుతోంది. 

అవమాన భారం తగ్గించుకోవానికి లెజిస్లేటివ్ క్యాపిటల్ డెవలప్ మెంట్ అనే పేరుతో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, తద్వారా అమరావతిలో వాతావరణాన్ని చల్లబరుచుకోవడానికి చూస్తున్నారు. కుదిరితే 3 రాజధానులు మార్చడం. ఒకవేళ టెక్నికల్ గా కుదరకపోతే లెజిస్లేటివ్ పేరిట అప్పటికే పనులు పూర్తి చేసుకుని... కోర్టు చెప్పిందనో, కేంద్రం చెప్పిందనో, రైతుల కోసం మేం ఏమైనా చేస్తాం అనో అన్వయించుకుని అమరావతితో సర్దుకుపోవడం చేసే ప్రయత్నం అనిపిస్తోంది.

ఈ క్రమంలో పట్టణ శాఖ మంత్రి బొత్స ద్వారా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆయన మూడు రోజులుగా పర్యటనలు చేస్తున్నారు. బొత్స శాఖ అదే కాబట్టి... అనుమానాలు కూడా రావు. గతంలో తాను గ్రాఫిక్స్ అన్న భవనాలనే తాజాగా నిన్న, ఈ రోజు స్వయంగా కలియతిరిగారు. రైతులతో కూడా మాట్లాడారు. 

ఇదంతా గమనిస్తున్న విశ్లేషకులు ఇప్పటికి ఏడాది అయిపోయింది. కొత్త రాజధానికి జగన్ చెప్పిన పదివేల కోట్లు కూడా దొరికే పరిస్థితుల్లేవు. చివరి ఏడాది ఎలాగూ ఎన్నికలకు అంకితం. ఇక మూడేళ్లకు హడావుడి ఎందుకు... సర్దుకుపోతే బెటరేమో అన్న ఆలోచన ప్రభుత్వంలో మొదలైందంటున్నారు. పైకి తిరస్కరిస్తూనే మానసికంగా అంగీకరించే ప్రయత్నం.

పెట్టే ఖర్చంతా లెజిస్లేటివ్ పేరు మీదనే పెడతారు. అదేంటి 3 అన్నారు కదా అని ఎవరైనా అడిగితే... అందుకే కదా మొదట దీనిని సిద్ధం చేస్తున్నాం అని ఎలాగూ చెప్పుకోవచ్చు అంటున్నారు విశ్లేషకులు.

రాజధానిలో పెండింగ్ ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలు, స్ధానికంగా ఉన్న పరిస్ధితులను అధికారులతో కలిసి మంత్రి బొత్స అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.  శాసన రాజధాని కొనసాగుతుందని, ఎడ్యుకేషన్, అగ్రికల్చరల్ హబ్ లుగా అభివృద్ధి చేస్తామని పలు సందర్భాల్లో చెప్పింది. ఇపుడదే ఆయుధంతో అమరావతి చిక్కుముడిని చేధించేందుకు ఒక భీకర ప్రయత్నం జరుగుతోంది.

అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్షాలు ఒకటే చెబుతున్నాయి... నిర్మాణాలకు క్రెడిట్ మీరే తీసుకోండి, కానీ రాజధాని అమరావతినే ఉంచండంటున్నాయి. బంపరాఫరే ఇది.