అది నోరేనా?

May 31, 2020

నాడు జగన్‌ 30 వేల ఎకరాలు కావాలన్నారు
ఇప్పుడు ఏకంగా మాటే మార్చేశారు
అదంతా ప్రభుత్వ భూమే అయి ఉండాలట!
రాష్ట్రంలో ఒకే చోట ఇంత భూమి దొరుకుతుందా?
అమరావతి రైతులు 33 వేల ఎకరాలిచ్చారు
దీనిని అభివృద్ధి చేయకుండా రోజుకో సాకు
ఆరునూరైనా రాజధానిని మార్చి తీరాలన్న పంతం పట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. గద్దెనెక్కాక మరోలా మాట్లాడుతున్నారు. తన దుర్మార్గపు, దుందుడుకు ఆలోచనలతో అమరావతి రైతులను క్షోభపెడుతున్న ఆయన.. రాజధానిపై రోజుకో మాట మార్చుతున్నారు. ఎకరా అభివృద్ధికి రూ.2 కోట్లు కావాలని.. మొత్తంగా రూ.1.05 లక్షల కోట్లు ఖర్చవుతాయని.. తానింత డబ్బు తీసుకురాలేనని.. ఒకే చోట అభివృద్ధిని కేంద్రీకరించరాదని వితండ వాదం చేస్తున్నారు. ఐదేళ్లు చంద్రబాబు నానా కష్టాలు పడి.. పైసా ఖర్చులేకుండా రాజధానిని అమర్చిపోతే.. అందులో ఉంటూ.. సుఖమరిగి.. దాని అభివృద్ధిని పక్కనపెట్టి.. ఉత్తరాంధ్ర భూములు, వనరులను నిలువునా దోచుకునేందుకు ఇప్పుడు విశాఖపై దృష్టి సారించారు. నికరంగా రూ.5 వేల కోట్ల ఖర్చుతో అమరావతి సంపూర్ణ రాజధాని రూపం సంతరించుకుంటుంది. కానీ తనకు, తన బంధుమిత్రుల భూములు రాజధానిలో పెద్ద సంఖ్యలో లేకపోవడం.. ఉన్నవి కూడా సీఆర్‌డీఏ నిషేధ ప్రాంతంలో ఉండడంతో.. విశాఖపై కన్నేశారు. పాలన వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు. సీఆర్‌డీఏని రద్దుచేస్తూ మరో బిల్లును ఆమోదించారు. శాసనమండలిలో వీటికి బ్రేకు పడడంతో ఏకంగా మండలినే రద్దుచేసే దుస్సాహసానికి ఒడిగట్టారు. ఇంత నిరంకుశ ధోరణి చరిత్రలో హిట్లర్‌, ముస్సోలినీలాంటి నియంతల్లో కూడా కనిపించదు. జగన్‌కు జనమంటే వీసమెత్తు గౌరవం లేదు. వారి అభిప్రాయాలకు, అభ్యంతరాలకు పూచికపుల్ల విలువ లేదు. ఇక ప్రతిపక్షాలంటే రాలిన వెంట్రుకతో సమానం. వాటి విమర్శలకు సమాధానం ఉండదు. పైపెచ్చు ప్రధాన ప్రతిపక్షంపై నిరాధారమైన అడ్డగోలు ఆరోపణలు. కాల్చిన గుడ్డను ముఖాన వేసి కడుక్కోమని చెబుతున్నారు. ఏమాత్రం నిలబడని, ఏ వాదనకూ నిలవని మొండి వైఖరితో ముందుకెళ్తున్నారు. రాజధానిపై చెప్పిన అబద్ధం చెప్పకుండా.. పూర్తి అసత్యాలతో నానా యాగీ చేస్తున్నారు. లక్ష కోట్ల ఖర్చు.. మౌలిక వసతుల లేమి.. ఒకే సామాజిక వర్గానికి ప్రయోజనం..  ఇతర ప్రాంతాలకు దూరం అంటూ చేసిన పాత వాదనలన్నీ వీగిపోయాయి. జనంలో వ్యతిరేకత చూసి సొంత పార్టీలోనే అసంతృప్తి చెలరేగుతుండడంతో జగన్‌ అండ్‌ కో కొత్త పాట మొదలుపెట్టారు. విజయవాడ-గుంటూరు ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటు చేయాలని, దానికి కనీసం 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అయినా ఉండాలని జగన్‌ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సంగతి తెలిసిందే. ఆరోజు అలా మాట్లాడి ఉండాల్సింది కాదని, మాట్లాడిన దానికి కట్టుబడి ఉండాలి తప్ప.. రాజధాని మార్పు నిర్ణయం వల్ల ప్రజల్లో చులకన అవుతున్నామని వైసీపీ నేతలు, అభిమానులు బహిరంగంగానే వాపోతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం కొత్త అంశం లేవనెత్తింది. జగన్‌ 30 వేల ఎకరాలు రాజధానికి అవసరం అన్నమాట వాస్తవమేనని.. కానీ అది ప్రభుత్వ భూమి అయ్యుండాలన్నారని బొత్స కొత్త పల్లవి అందుకున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఎక్కడా ఒకేచోట ఏకమొత్తంగా దొరకదు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు.. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చివరకు దొనకొండ ఎక్కడ చూసినా ఇంత ప్రభుత్వ భూమి ఒకే చోట లేదు. రెండోది.. అమరావతి రైతులు 30 వేలు కాదు.. ఏకంగా 33 వేల ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చేశారు. ప్రభుత్వానికి పైసా ఖర్చు లేకుండా 33 వేల ఎకరాల భూమి దఖలుపడింది. పోనీ మిగతా చోట్ల భూమి ఉందనే అనుకుందాం. దాని రేటెంత.. అంత పెట్టి కొనగలిగిన సత్తా, సొమ్ము ప్రభుత్వం వద్ద ఉన్నాయా..? ఆయా భూముల్లో సాగు చేసుకుంటున్నవారిని.. ఇళ్లూ వాకిళ్లూ ఉన్నవారిని ఖాళీచేయించడానికి  తగినంత ధనం ఉందా? ఒకవేళ ఖాళీచేయించినా అభివృద్ధి చేసేందుకు అమరావతిలో కంటే కనీసం మూడున్నర రెట్లు అధికంగా ఖర్చవుతుందని అధికారులే అంటున్నారు. 33 వేల ఎకరాల భూమిని రైతులు రాజధాని నిర్మాణానికి ఉదారంగా ఇస్తే.. ఇప్పుడు మార్చేస్తామనడం మూర్ఖత్వం కాక మరేమిటని వైసీపీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు.
నదీతీరాన...అందరికీ సమదూరాన
రాజధాని ప్రాంతంగా నిర్ణయించిన అమరావతి.. అందరికీ సమదూరంలో ఉంది. అటు శ్రీకాకుళం, ఇటు చిత్తూరు జిల్లా.. ఎక్కడి నుంచి రావాలన్నా దరిదాపుగా ఒకటే దూరం. అందుకే అన్ని ప్రాంతాలవాళ్లూ అంగీకరించారు. కానీ ఇప్పుడు విశాఖకు మారిస్తే రాయలసీమకు రాజధాని అందనంత దూరం వెళ్లిపోతుంది. అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి రాజధానికి రావాలంటే కనీసం రెండు రోజులు పడుతుంది. బస్సులు, రైళ్లలో అంతంత దూరం ప్రయాణించాల్సి వస్తే విలువైన సమయం, ధనం వృధా అవుతాయి. అదే సమయంలో రాజధాని అంటే శతాబ్దాలు పాటు ఉండేది. దానికి తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. కృష్ణా నది ఒడ్డున ఉండడంతో రాజధానికి ఆ ఇబ్బంది లేదు. ప్రాచీన కాలం నుంచీ నగరాలు నదుల చెంతనే అధికంగా అభివృద్ది చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు విశాఖకు రాజధాని తరలితే తాగునీటికి కటకటే. ఎందుకంటే రాజధాని అయితే అక్కడ జనం పెరుగుతారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయి.. ఎడమ కాలువ పనులన్నీ పూర్తయితే తప్ప విశాఖకు చుక్కనీరు అందదు.
మహా నగరం అక్కర్లేదా?
రాష్ట్ర విభజన అన్నది ఆంధ్రకు తీరని నష్టం మిగిల్చింది. అయితే తొలిసారి సొంతగా నూతన రాజధానిని అభివృద్ధి చేసుకునే అవకాశం మాత్రం వచ్చింది. నూతనంగా నిర్మించే నగరాన్ని అద్భుతంగా ఉండేటట్లు ప్రపంచ ప్రసిద్ద సంస్థలతో ప్రణాళికలు రూపొందించారు. వాస్తవానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమదూరం అనుకుంటే విజయవాడ, గుంటూరుల్లో ఎక్కడో ఒకచోట ఏర్పాటుచేయవచ్చు. కానీ ఈ రెండు నగరాల మధ్య రాజధాని ప్రాంతంగా నిర్ణయించడం చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనం. ఒక సరికొత్త నగరం నిర్మాణమంటే.. రోడ్లు, రవాణా సౌకర్యాల నుంచి భవనాల నిర్మాణం వరకు అంతా ఈ ఆధునిక యుగానికి తగ్గట్లే ఉండాలి. నూతన నగరం అభివృద్ధి చెందడం అంటే.. అటు విజయవాడ-ఇటు గుంటూరు వరకు విస్తరించడం కూడా. అలా విజయవాడ-గుంటూరు-అమరావతి-మంగళగిరి-తెనాలి కలిసిపోతే అదెంత పెద్ద మహానగరం అవుతుంది? రాష్ట్రంలో ఒక పెద్ద నగరం, ఆర్థిక అవకాశాలు సృష్టించే నగరం లేదన్న కొరత కూడా తీరిపోతుంది. ఇప్పటికే కేవలం నాలుగేళ్లలో విజయవాడ-గుంటూరు నగరాలు దాదాపుగా కలిసిపోయాయి. మధ్యలో మంగళగిరి కూడా ఇమిడిపోయింది. ఇదే ఊపు కొనసాగి ఉంటే.. మరో నాలుగేళ్లలో అమరావతి కూడా అభివృద్ది చెంది.. మెగా నగరంగా ఆవిర్భవించి ఉండేది. దానికి దాదాపు బొందపెట్టేసిన జగన్‌.. ప్రస్తుతం ఉన్న నగరాలను అభివృద్ధి చేయగలరేమో! అది కూడా తాను అనుకుంటేనే. ఆయన జమానాలో మహానగరం ఏర్పాటన్నది కలే. ఒక్క రూపాయి ప్రభుత్వ సొమ్ము ఖర్చుకాకుండా...ఒక్క పైసా ఖర్చులేకుండా సమీకరించిన భూములతోనే అద్భుతంగా అభివృద్ధి చేసే అవకాశాన్ని ప్రభుత్వం వదిలేసిందన్న భావన, తీవ్ర అసంతృప్తి ప్రజల్లో నెలకొంది.
మారిస్తే లక్షకోట్ల పరిహారం..
రాజధాని నిర్మాణం తమ గ్రామాల్లో చేయాలని ఆ 29 గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని అడగలేదు. ప్రభుత్వమే రాజధాని అక్కడ పెట్టాలని నిర్ణయించి రైతుల ముందు భూసమీకరణ పథకాన్ని ప్రతిపాదించింది. విభజన గాయాలతో ఉన్న మొత్తం ఆంధ్రప్రదేశ్‌కు తమ వంతు సాయం చేయడం, అదే సమయంలో రాజధానే ఇక్కడ పెడితే తమకు, తమ తర్వాతి తరానికి మేలు జరుగుతుందన్న భావనతో రైతులు ముందుకొచ్చారు. తమ భూములను సీఆర్‌డీఏకు అప్పగించారు. రాఽజధాని పెడతామని, ఇక్కడే సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, రాజ్‌భవన్‌, హైకోర్టు, మంత్రులు, అఽధికారుల క్వార్టర్లు ఇవన్నీ నిర్మిస్తామంటేనే.. సింగపూర్‌ తరహా నగరం నిర్మాణం చేస్తామంటేనే వారు ముందుకొచ్చారు. రైతులకు ఇచ్చే రిటర్నబుల్‌ ప్లాట్లలో రోడ్లు, విద్యుత, మురికినీటిపారుదల, పాఠశాలలు, పార్కులు, ఆస్పత్రులు, విద్యాలయాలు తదితర మౌలిక సదుపాయాలన్నీ అభివృద్ధి చేసి ఇవ్వాలి. ఒకవేళ ప్రభుత్వం తాను చెప్పిన, ఒప్పుకున్న విధంగా ప్లాట్లను అభివృద్ధి చేయకపోతే నష్టపరిహారం కోరే హక్కు రైతులకు ఉంది. రైతులు సీఆర్‌డీఏతో చేసుకున్న ఒప్పందంలోని 18వ నిబంధన ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ప్రభుత్వం రాజధానిని మారిస్తే.. రైతులకు నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ గజం ధర ప్రభుత్వ రికార్డుల ప్రకారం రూ.5 వేలు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం దీనికి 2.5రెట్లు పరిహారం చెల్లించాలి. అంటే గజానికి రూ.12,500. ఈ విలువ మీద మళ్లీ సొలేషియం, వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుంది. ఎకరాకు లే అవుట్‌ చేశాక 2,800 గజాలే వస్తుందని అనుకున్నా.. గజానికి సుమారు రూ.15వేల పరిహారం.. అంటే ఎకరాకు రూ.4.2 కోట్లు అవుతుంది. 33 వేల ఎకరాలకు అంటే రూ.1.38 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. అదే ఇక్కడ రాజధాని అభివృద్ధి చేస్తే రైతుల నుంచి సేకరించిన భూమిలో రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలకు పోను.. సగం భూమి ఉంటుంది. ఇందులో రైతుల వాటా పోను ప్రభుత్వానికి 8,442 ఎకరాలు మిగులుతుంది. అదే సమయంలో రాజధానిలోనే భాగంగా 19,876 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో నవనగరాలకు అవసరమైన స్థలం పోను ఇంకా వేల ఎకరాలు మిగులుతుంది. ఎకరా కనీసం రూ.10 కోట్ల చొప్పున 10 వేల ఎకరాలు అమ్మినా లక్ష కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఈ డబ్బును రాజధాని అవసరాలకే కాకుండా.. రాష్ట్ర అవసరాలకూ ఉపయోగించవచ్చు. రాజధాని అభివృద్ధి జరిగితే..అక్కడ వ్యాపారాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కి ఆ ఫలాలు రాష్ట్రమంతటికీ అందుతాయి. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న రీతిలో రాజధాని వ్యవహారంపై జగన్‌ వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుంది. పాలన నడిపించేందుకు కావలసిన భవనాలు, మౌలిక సదుపాయాలు అన్నీ ఉన్నా.. రాజధాని అభివృద్ధికి నిధులు అమరావతిలోనే ఉన్నా.. తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది? కొత్తగా విశాఖలో ఖర్చు చేయాల్సిన అవసరమేంటని వారు అసంతృప్తితో ఉన్నారు. కొత్త ఖర్చులతో పాటు.. రాజధానిని తరలిస్తే అమరావతి రైతులకు నష్టపరిహారంగా కనీసం దరిదాపుగా లక్షన్నర కోట్లు చెల్లించాల్సి వస్తుందని తెలిసినా.. ఎవరేమన్నా.. ఏమైపోయినా.. తన మాటే నెగ్గాలన్న ధోరణిలో ఆయన ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. రాజుకంటే విశ్వాసపాత్రులైన స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కు అమరావతి నగరం ఓ ఎడారి. పచ్చని చేల గుండా కార్లో రోజూ వెళ్తున్న ఆయనకు అది ఎడారిగా కనిపిస్తే.. రాజస్థాన్‌ ఎడారి ఆయన కళ్లకు ఎలా కనిపిస్తుందో మరి! మంత్రి బొత్స సత్యనారాయణకైతే అమరావతి శ్మశానమే. అక్కడే కట్టిన శాసనసభ, సచివాలయాలకు రోజూ వెళ్తున్నారు.. అక్కడే భోజనం చేస్తున్నారు. మరి శవాలపై కట్టిన ఇళ్లలో ఉంటున్నామనే భావన తినే సమయంలో మెదులుతుందో లేదో తెలియదు. నోటికెంత వస్తే అంత మాట్లాడడమే! ఉచ్ఛం.. నీచం ఏనాడో మరిచిపోయినట్లు వారి మాటల్లోనే తెలిసిపోతోంది.