రాజధాని రైతులు జీఎన్ రావుకు చుక్కలు చూపించారు

February 25, 2020

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానిపై సీఎం హోదాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయంపై ఏపీ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం ప్రకటించిన రాజధాని అమరావతి కోసం స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలకు పైగా భూములు ఇచ్చిన రాజధాని రైతుల ఆగ్రహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజున జగన్ నోట నుంచి వచ్చిన మూడు రాజధానుల ప్రకటన మరుక్షణమే రాజధాని రైతులు ఆందోళనలకు దిగేశారు. నాటి నుంచి శనివారం నాలుగో రోజు దాకా రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనలు ఏ స్థాయిలో ఉన్నాయన్న విషయాన్ని నిన్న జరిగిన ఓ చిన్న ఘటన కళ్లకు కట్టిందని చెప్పక తప్పదు.

జగన్ మాటకు అనుగుణంగా నివేదికను రూపొందించేసిన జీఎన్ రావు కమిటీ నిన్న మధ్యాహ్నం తర్వాత జగన్ కు నివేదిక ఇచ్చేందుకు బయలుదేరింది. రాజధాని రైతులు కొనసాగిస్తున్న ఆందోళనలు దాటుకునే ఈ కమిటీ సభ్యులు సీఎం ఇంటికి చేరుకోవాల్సి ఉంది. జగన్ ఇచ్చిన భరోసానో, ఓ కమిటీగా తమను ఏం చేస్తారన్న భావనో తెలియదు గానీ... ఏమాత్రం ముందు జాగ్రత్తలు లేకుండా జీఎన్ రావు కమిటీ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి బయలుదేరింది. అయితే కమిటీకి షాకిస్తూ... వారి వాహనాలకు రాజధాని రైతుల సెగ అడ్డు తగిలింది. ముందుకు కదిలేందుకు వీల్లేదు. అలాగని వెనక్కు వెళ్లేందుకూ అవకాశం లేదు. 

మరేం చేయాలి? కార్లు దిగి పరుగు పెట్టాలి. రాజధానిపై నివేదికను రూపొందించుకుని, దానిని భద్రంగా చేతుల్లో పెట్టుకుని పరుగు లంకించుకుంటే చూడ్డానికి బాగోదు కదా. అందుకేనేమో... అప్పటికప్పుడు పోలీసులకు కబురు పెట్టారు. అప్పటికే రాజదాని రైతుల ఆందోళనలతో నానా పాట్లు పడుతున్న పోలీసులు... జీఎన్ రావు కమిటీ నుంచి పిలుపు రాగానే ఎలాగోలా అక్కడకు చేరుకున్నారు. అయినా కూడా పెద్దగా ఫలితం కానరాలేదు. దీంతో పోలీసుల సూచనలతో కాస్తంత వెనక్కు తగ్గినట్టే యాక్ట్ చేసిన కమిటీ... కొంత దూరం వెనక్కు వెళ్లినట్టే వెళ్లి... రైతులను ఏమార్చేసి సీఎం క్యాంపు కార్యాలయానికి పరుగు పెట్టింది. అంటే... రాజధాని రైతుల నిరసనలతో బెంబేలెత్తిపోయిన జీఎన్ రావు కమిటీ సీఎం వద్దకు చేరుకోవడానికి దొడ్డిదారిని ఆశ్రయించక తప్పలేదన్న మాట.