వీళ్లు... కూడా పెయిడ్ ఆర్టిస్టులేనా జగన్.. ?

February 23, 2020
CTYPE html>
కింద పడ్డా పైచేయి మాదేననే బ్యాచ్ ఒకటి ఉంటుంది. కళ్ల ముందు కనిపించే దానిని సైతం తమకున్న అద్భుతమైన మాటతీరుతో.. ప్రత్యర్థులపై విరుచుకుపడే పోరాటతత్త్వంతో బండలేయటంలో జగన్ బ్యాచ్ కు మించినోళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కనిపించరు. ఒక పద్దతి ప్రకారం తిమ్మిని బమ్మిని చేసే ఆర్ట్ ఉన్న జగన్ పరివారం ఎప్పటికప్పుడు తమ వాదనే కరెక్ట్ అనేలా చేయటం చూస్తే.. కాలం వారి వైపు ఉందనిపించక మానదు. కానీ.. తరచి చూస్తే ప్రత్యర్థుల్లో లోపించిన స్థైర్యం కూడా కారణమన్న భావన కలుగక మానదు.
ఎవరైనా తమకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసినా.. నిరసనలు చేపట్టినా వెంటనే వారిని పెయిడ్ ఆర్టిస్టులంటూ బండేయటంలో జగన్ బ్యాచ్ కు ఉన్న ప్రావీణ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీ రాజధాని మీద సాగుతున్న ఊహాగానాలకు కొత్త రెక్కలు తొడిగేలా.. ఏమో.. ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చేమో అని సెలవిచ్చిన సీఎం జగన్ మాట విన్న ఆంధ్రోళ్లకు షాకింగ్ గా మారింది.
అందరికంటే ఎక్కువగా మంట పుట్టింది మాత్రం రాజధాని అమరావతి ప్రాంతాల్లోని వారికే. రాజధాని నగరంగా తీర్చిదిద్దిన చంద్రబాబునను కాదని మరీ.. జగన్ కు జై కొట్టిన తమకు తగిన శాస్తి జరిగిందన్న వేదనకు గురి అవుతున్నారు. రాజధానిపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.. అభిమానులు.. సానుభూతిపరులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.
జగన్ ను నమ్మి తాము ఘోరంగా మోసపోయినట్లు వాపోతున్నారు. నమ్మించి మోసం చేయటం సరికాదంటూ జగన్ పై విమర్శనాస్త్రాల్ని సంధిస్తున్నారు. రాజధాని మారదని మాట ఇచ్చి ఇప్పుడిలా చేస్తారా? అంటూ వేదన చెందుతున్నారు. రాజధాని మారదన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఇప్పుడెక్కడ? అంటూ రగిలిపోతున్నారు. ఇదంతా చూస్తున్న జగన్ బ్యాచ్ కు నిరసనలు మింగుడుపడటం లేదు. తమదైన శైలిలో చెలరేగిపోదామని.. ఇలా ఆందోళనలు చేసే వారిపైన పెయిడ్ ఆర్టిస్టులని ముద్ర వేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. గతంలో వర్క్ వుట్ అయిన ప్లాన్ ఈసారి మాత్రం వర్క్ వుట్ కాదంటున్నారు. తొందరపడి ఆందోళనలు చేస్తున్న వారిని పెయిడ్ ఆర్టిస్టులగా ముద్ర వేస్తే.. తమకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని చూపిస్తే మరింత ఇబ్బందిగా మారుతుందన్న మాట వినిపిస్తోంది. ఎందుకైనా మంచిది ఎప్పటిలా.. రాజధాని మీద పోరాడుతున్న వారి మీద పెయిడ్ ఆర్టిస్టు ముద్రలేసే విషయంలో ఏమాత్రం తొందరపడొద్దన్న సూచనలు వినిపిస్తున్నాయి. జగన్ బ్యాచ్ ఏం చేస్తుందో చూడాలి.