అన్నిటి కంటే అమరావతే బెటర్‌

August 03, 2020

అన్నిటి కంటే అమరావతే బెటర్‌
నాడు శివరామకృష్ణన్‌ కమిటీకి ప్రజలు చెప్పింది ఇదే
ఊరూరా తిరిగి ప్రజలను కలుసుకుంది
అన్ని వర్గాల అభిప్రాయాలూ తీసుకుంది
కృష్ణా-గుంటూరుకే ఎక్కువ మంది మొగ్గు
కానీ భూసేకరణ కష్టమన్న కమిటీ
పంటభూములు పోతాయని మెలిక
బోలెడు ఖర్చవుతుందని విముఖత
పైసా పెట్టకుండా భూసమీకరణ చేసిన చంద్రబాబు
స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలిచ్చిన రైతులు
5 కోట్ల మందిలో ఒక్కరినీ కలవని జగన్‌ కమిటీలు
బాగుండదని కొన్ని నగరాలకు వెళ్లిన జీఎన్‌ రావు
నాలుగు గోడల నుంచి కదలని బోస్టన్‌ గ్రూపు
శివరామకృష్ణన్‌ కమిటీ అమరావతిలో రాజధాని వద్దన్నప్పటికీ చంద్రబాబు తన సామాజికవర్గం, పార్టీ కోసం ఇక్కడే నిర్ణయించారని మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నుంచి అక్షరం ముక్కరాని పనికిమాలిన వైసీపీ ఎమ్మెల్యేల వరకు వదురుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పడానికి కూడా వెరవడం లేదు. జీఎన్‌ రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) కమిటీలను నియమించుకుని.. తమకు నచ్చినట్లు జగన్‌ అండ్‌ కో నివేదికలు తీసుకుంది. తెల్లకాగితాలపై ఆయా కమిటీల సభ్యుల సంతకాలు తీసుకుని తనకు నచ్చింది జగన్‌ రాసుకున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ చేసిన విమర్శ నిజమని ఇప్పుడనిపిస్తోంది. శివరామకృష్ణన్‌ కమిటీ సేకరించిన ప్రజాభిప్రాయాల్లో ఎక్కువ మంది కృష్ణా-గుంటూరుకే మొగ్గుచూపారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిని సూచించడంతోపాటు అభివృద్ధికి తీసుకోవలసిన చర్యల కోసం తగిన సిఫారసులు చేయడానికి కేంద్రప్రభుత్వం 2014 ఫిబ్రవరిలో ఈ కమిటీని నియమించింది. ఆంధ్రప్రదేశ్‌ పొడగిట్టని.. దాని అభివృద్ధిని ఏ మాత్రం సహించని శివరామకృష్ణన్‌.. కమిటీ చైర్మన్‌గా ప్రజాస్వామికంగానే వ్యవహరించారు. అన్ని ప్రాంతాలకు కమిటీ సభ్యులు తిరిగారు. ప్రజాభిప్రాయం, వివిధ వర్గాలు, సంఘాలు, మేధావుల అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రజలు నేరుగా తనను కలవడానికి శివరామకృష్ణన్‌ అవకాశమిచ్చారు. ఈమెయిల్స్‌ ద్వారా కూడా అభిప్రాయ సేకరణ జరిపారు. 2014 ఏప్రిల్‌ 22 నుంచి ఆ ఏడాది మే 7 వరకు అంటే 15 రోజులు ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. వివిధ మార్గాల్లో సేకరించిన ప్రజాభిప్రాయాన్ని తన నివేదికలో పొందుపరిచారు. మొత్తం 4,728 మంది అభిప్రాయాలు(ఓట్లు) సేకరించగా.. అందులో విజయవాడ-గుంటూరు ప్రాంతంలో రాజధాని ఏర్పాటుకు మద్దతుగా 1,156 మంది.. విజయవాడలోనే ఏర్పాటుచేయాలని మరో 663 మంది, గుంటూరులో ఉండాలని 372 మంది.. మొత్తంగా ఈ ప్రాంతానికి 2,192 మంది ఓట్లేశారు.  విశాఖపట్నంలో ఉండాలని 507 మంది, కర్నూలులో పెట్టాలని 360, ఒంగోలులో రాజధాని కోసం 265, రాజమండ్రిలో ఏర్పాటుచేయాలని 139, తిరుపతిలో పెట్టాలని 113, దొనకొండకు 116 మంది మొగ్గుచూపారు. నెల్లూరు, అనంతపురం, కడప, ఏలూరు...ఇలా పలుచోట్ల పెట్టాలని కోరినవారు 1037 మంది. ఈ కమిటీ  తాను ఆయా నగరాలు, ప్రాంతాలకు ఎప్పుడు వచ్చేదీ ప్రజలకు, సంఘాలకు ముందుగానే సమాచారమిచ్చింది. మీడియా ద్వారా విస్తృత ప్రచారం కూడా చేసింది. అన్ని విధాలుగా ప్రచారం చేసి.. ఆ తర్వాత అభిప్రాయ సేకరణ చేసింది. అప్పటికి అమరావతి పేరు లేదు. విజయవాడ-గుంటూరు ప్రాంతాల్లోనే ఉండాలని అత్యధికులు చెప్పారు. కమిటీ ఆ విషయం చెబుతూ.. ఇక్కడ భూసేకరణ చాలా కష్టమని.. పంట భూములు సేకరించడం బాగా ఖర్చుతో కూడుకున్నదని పేర్కొంది. అయితే చంద్రబాబు అది తప్పని నిరూపించారు. విజయవాడ-గుంటూరు-తెనాలి, మంగళగిరిలు కూడా భవిష్యతలో కలిసిపోయేలా...వాటన్నింటి మధ్యలో రాజధాని ఏర్పాటుకు అవసరమైన భూములను గుర్తించారు. భూసేకరణ కాకుండా భూసమీకరణ విధానంలో వెళ్లి 33 వేల ఎకరాలను ఒక్క పైసా ఖర్చులేకుండా సేకరించి...రాజధాని ప్రాంతంగా నిర్ణయించారు. అనంతరం దానికి అమరావతి అన్న పేరు పెట్టారు.
ఏదీ పారదర్శకత?
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన జీఎన్‌ రావు కమిటీ, బీసీజీలు ఇలా పారదర్శకంగా వ్యవహరించలేదు. జీఎన్‌ రావు కమిటీ ఏర్పాటుపై కనీసం జీవో అయినా ఇచ్చారు. అసలు బీసీజీ అంటే ఏంటో.. అందులోని సభ్యులెవరో.. వాళ్లేం చేస్తారో జగన్‌కు, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డికి, ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌కు తప్ప నరమానవుడికి తెలియదు. ఆ కమిటీ నాలుగు గోడల మధ్య తన పనిచేసింది. జీఎన్‌రావు ప్రజాభిప్రాయ సేకరణ చేశామని చెప్పినా.. ఆయన ఎవరిని కలిశారో, వారు ఏ రాష్ట్రానికి చెందినవారో ఎవరికీ తెలియదు. తమ అభిప్రాయమే అడగలేదని రాజధాని ప్రాంత రైతులు చెప్పారు. బీసీజీ ఎక్కడా అడుగుపెట్టలేదు. అసలు అభిప్రాయ సేకరణే చేయలేదని అంగీకరించింది.
జగన్‌ మాటే వారి మాట..
అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరిరోజు జగన్‌ చెప్పింది పొల్లుపోకుండా జీఎన్‌ రావు తన కమిటీలో పొందుపరిచారు. అమరావతిలో కొత్తగా పెట్టుబడులు పెట్టడం సుముచితం కాదని.. అమరావతి అభివృద్ధి పనులను వెంటనే సమీక్షించాలని, ఇప్పటికే చేపట్టిన పనులను వెంటనే పూర్తిచేయాలని సిఫారసు చేసింది. ఇంతకు ముందే మొదలు పెట్టిన పనులను పూర్తిచేయాలని పేర్కొంది. జిల్లాల పర్యటనల్లో ప్రజలు తమ అవసరాలు ఏమిటో వివరించారని తెలిపింది. కర్నూలు జిల్లా ప్రజలు హైకోర్టును ఆశించారని పేర్కొంది. కానీ సచివాలయం తమ జిల్లాలో/ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఏ జోన్‌ నుంచీ వచ్చినట్లుగా లేదు. విశాఖ మెట్రో రీజియన్‌ను ఏర్పాటు చేసి విజయనగరంలో సచివాలయం ఏర్పాటు చేయాలని కమిటీ సిఫారసు చేసింది. అయితే కమిటీ నివేదిక ప్రకారం ఉత్తరాంధ్ర ప్రజలు ప్రధానంగా విద్య, నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత సరఫరా, పరిశ్రమలు, పట్టణాల అభివృద్ధి, స్మార్ట్‌సిటీ, మెట్రో రైలు వంటివి తమకు కావాలంటూ కోరినట్లుగా నివేదికలో స్పష్టంగా పేర్కొంది. విజయనగరం ప్రజలు తమ ప్రాంతంలో శాసనసభ ఏర్పాటు కావాలని ఆకాంక్షించినట్లుగా వివరించింది. అయితే ప్రజాభీష్టాన్ని ప్రతిబింబించేలా పరిశ్రమలు, సంస్థలు, కార్యాలయాల ఏర్పాటుపై ఈ కమిటీ నిర్దుష్టమైన సూచనలు చేయలేదు. ‘కర్నూలులో హైకోర్టు నెలకొల్పాలి. దాని బెంచ్‌లను అమరావతి, విజయనగరంలో ఏర్పాటు చేయాలి. ట్రైబ్యునళ్లను మూడు ప్రాంతాల్లోనూ నెలకొల్పాలి.   శాసనసభ అమరావతిలో, సచివాలయం విజయనగరం (విశాఖ మెట్రో రీజీయన్‌-వీఎంఆర్‌)లో ఏర్పాటు చేయాలి. అమరావతి-మంగళగిరి కాంప్లెక్స్‌లో హైకోర్టు బెంచ్‌, శాసనసభ (శీతాకాలం), గవర్నర్‌ కార్యాలయం, ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసు ఉండాలి. విశాఖ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (వీఎంఆర్‌)లో హైకోర్టు బెంచ్‌, శాసనసభ(వేసవికాలం), సచివాలయం, ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసు పెట్టాలి. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేయాలి’ అని సూచించింది. ఆయా ప్రాంతాల్లో వాటి ఏర్పాటుకు ప్రాతిపదికేంటో స్పష్టంగా చెప్పడంలో కమిటీ విఫలమైంది. అసలా కమిటీ సొంతగా ఆలోచించి ఈ నివేదిక ఇచ్చినట్లు కనబడడం లేదు.
బాబు విజన్‌నే పొందుపరచిన బీసీజీ
కాపీ కొట్టడంలో బోస్టన్‌ గ్రూపు కొత్త శైలి ప్రదర్శించింది. చంద్రబాబు గత ఐదేళ్లలో అమలుచేసిన వాటినే.. గొప్ప సూచనలుగా తన నివేదికలో పొందుపరిచింది. చంద్రబాబు విజన్‌ డాక్యుమెంటును మక్కీకి మక్కీ దింపింది. పీజీ చదివేసినవాడిని.. మళ్లీ నర్సరీలో చేరాలన్నట్లుగా నివేదిక ఉంది. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలను ఒక ప్రాంతంగా తీసుకుని...అక్కడ డాటా హబ్‌, మెడికల్‌ పరికరాల తయారీ, కాఫీ, పసుపు, జీడిపప్పులాంటి వాణిజ్య పంటల సాగు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, అరకువ్యాలీని ప్రకృతి సాహస పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని సూచించింది. వాస్తవానికి ఇవన్నీ చాలావరకు అమల్లోకి వచ్చేశాయి. డాటా హబ్‌ ఏర్పాటుకోసం అదానీ గ్రూప్‌ను చంద్రబాబు తీసుకొచ్చారు. జగన్‌ దానిని తరిమేశారు. మెడికల్‌ పరికరాల తయారీ కోసం మెడ్‌టెక్‌ పార్కు బాబు హయాంలోనే ఏర్పాటైంది. కాఫీ, పసుపు, జీడిపప్పులాంటి వాణిజ్య పంటల సాగు ఇప్పటికే జరుగుతోంది. చంద్రబాబు హయాంలో అరకు కాఫీకి అంతర్జాతీయ బ్రాండ్‌ వచ్చింది. అమరావతి సచివాలయంలో అరకు కాఫీ విక్రయ కేంద్రాన్ని ప్రభుత్వమే ఏర్పాటుచేసింది. దేశ, విదేశీ ప్రముఖులు ఎవరు తనను కలవడానికి వచ్చినా చంద్రబాబు అరకు కాఫీ ఇచ్చి.. దాని గొప్పదనం గురించి వివరించేవారు. ఇక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, అరకును ప్రకృతి సాహస పర్యాటక కేంద్రంగా చేయడం...వీటిపైనా గత ప్రభుత్వం అడుగులు ముందుకేసింది. విధానపరమైన దశ నుంచి అమలు దిశగా అడుగులు పడ్డాయి. అలా అమలైపోయిన వాటినే ఇప్పుడు బీసీజీ కొత్తగా చెప్పడం ఏమిటని అందరూ నవ్వుకుంటున్నారు. ఈ విషయాలన్నీ చంద్రబాబు విజన్‌ డాక్యుమెంట్‌లోవే. అంతేకాదు.. నాడు అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు ఆయన జిల్లాల వారీగా తామెలాంటి అభివృద్ధిని సంకల్పించామో అసెంబ్లీలోనే చదివి వినిపించారు. శ్రీకాకుళంలో భావనపాడు పోర్టు, కళింగపట్నం పోర్టు, పైడిభీమవరం పారిశ్రామిక వాడ, ఫుడ్‌పార్కు, వంశధార-నాగావళిపై ఉన్న ఇరిగేషన్‌ ప్రాజెక్టులను పూర్తిచేయడం, విజయనగరం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణం, పారిశ్రామిక నగరం, తోటపల్లి రిజర్వాయరును పూర్తిచేయడం, ఫుడ్‌ పార్కు, గిరిజన విశ్వవిద్యాలయం, ఎలక్ర్టానిక్స్‌, హార్డ్‌వేర్‌ పార్కు, పోర్టు, సంగీత, లలిత కళల అకాడమీ ఏర్పాటు, విశాఖపట్నంను మెగాసిటీగా చేయడం, విశాఖపట్నం అంతర్జాతీయ విమనాశ్రయం, మెట్రోరైల్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ట్రేడ్‌, మెగా ఐటీ హబ్‌, ఎలక్ర్టానిక్స్‌ ఉత్పత్తుల కేంద్రం, ఇన్నోవేషన్‌, ఇంక్యుబేషన్‌ హబ్‌, ఎగ్జిబిషన్‌, కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని పెట్టారు. పలు సంస్థలను ఇప్పటికే ఏర్పాటుచేశారు.
గోదావరి నుంచి రాయలసీమ వరకూ..అదే తరహా
గోదావరి జిల్లాల్లో పెట్రోకెమికల్స్‌, ప్లాస్టిక్స్‌ తయారీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, పండ్లతోటలు, వాణిజ్యపంటల వైపు మళ్లింపు, పోలవరం ప్రాజెక్టు, రోడ్‌ కనెక్టివిటీ పెంపు, కోనసీమను బ్యాక్‌వాటర్స్‌ పర్యాటక ప్రాంతంగా ప్రోత్సహించాలని బీసీజీ కమిటీ సూచించింది. పెట్రోకెమికల్‌ కారిడార్‌ కోసం కేంద్రంతో మాట్లాడి ఇప్పటికే ఆ దిశగా అడుగులు పడ్డాయి. ప్లాస్టిక్స్‌ తయారీ, ఫుడ్‌ ప్రాసిసెంగ్‌ల కోసం ఎంఎస్‌ఎంఈ పార్కులు ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఆ ప్రాజెక్టు పనులను శరవేగంతో పరుగులు పెట్టించి...ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఇతర అంశాలు కూడా అమల్లోకి వచ్చినవే. ఇలా అమలైపోయిన వాటిని, అమల్లో ఉన్నవాటినే మళ్లీ కొత్తగా చెప్పినట్లుగా బీసీజీ కమిటీ చెప్పిందని పలువురు విమర్శిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ హైటెక్‌ అగ్రికల్చర్‌, చేపల పెంపకం, మల్టీమోడల్‌ లాజిస్టిక్స్‌ హబ్‌, హెల్త్‌ హబ్‌, మచిలీపట్నం పోర్టు అభివృద్ది చేయాలని పెట్టారు. ఇందులో సుమారుగా అన్నింటినీ గతంలోనే చేశారు. అశోక్‌లేలాండ్‌ తయారీ కంపెనీ ఎప్పుడో వచ్చింది. హెచ్‌సీఎల్‌ ఐటీ కంపెనీని తీసుకొచ్చారు. కేంద్రం సహకారంతో గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఇలా చేసినవాటి సంగతి పక్కనపెడితే బీసీజీ నివేదికలోని అంశాల కంటే ఎక్కువుగానే చేశారు. దక్షిణ ఆంధ్రలో అంటే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఆటోమొబైల్‌ తయారీ, పేపర్‌ పల్ప్‌, లెదర్‌, ఫర్నిచర్‌ ఎంఎస్‌ఎంఈ క్లస్టర్‌, మత్స్య ఎగుమతులు, గోదావరి-పెన్నా అనుసంధానం చేయాలని బీసీజీ నివేదికలో పేర్కొంది. పేపర్‌ పల్ప్‌ ఏర్పాటుకోసం ఏసియన్‌ పేపర్‌ మిల్స్‌తో గత ప్రభుత్వమే ఒప్పందం చేసుకుంది. మత్స్య ఎగుమతులకు ప్రోత్సాహం, ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు పలు చర్యలు తీసుకున్నారు. గోదావరి-పెన్నా అనుసంధానంపైనా ప్రాథమిక కసరత్తు పూర్తిచేశారు. పశ్చిమ రాయలసీమకు అంటే అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో టెక్స్‌టైల్స్‌ ప్రోత్సాహకం, ఆటోవిడిభాగాల తయారీ, సేంద్రీయ పండ్లతోటల పెంపకం, డ్రిప్‌ ఇరిగేషన్‌ లాంటి సూచనలు చేశారు. ఆటో విడిభాగాల తయారీ కాదు...ఏకంగా కార్ల తయారీ కంపెనీ కియను అనంతపురం జిల్లాకు తీసుకొచ్చారు. పండ్లతోటల పెంపకం, డ్రిప్‌ ఇరిగేషన్‌లను ఇప్పటికే ఏ ప్రభుత్వం ఉన్నా పెద్దఎత్తున ప్రోత్సహిస్తోంది. కర్నూలులో ఓర్వకల్లు వద్ద విమానాశ్రయం, అదే జిల్లాలో మెగా సీడ్‌పార్కు ఏర్పాటు, పలు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ఇక తూర్పు రాయలసీమ అంటే చిత్తూరు, కడప జిల్లాల్లో ఎలక్ర్టానిక్స్‌ తయారీ, స్టీల్‌ప్లాంట్‌, టమాటా ప్రాసెసింగ్‌, గండికోట, బెలూం గుహలు తదితరాలను కలుపుతూ ఎకో టూరిజం సర్క్యూట్‌ ఏర్పాటు ఇలాంటివి సూచించింది. తిరుపతి, ఏర్పేడు ప్రాంతాన్ని పూర్తిస్థాయి ఎలక్ర్టానిక్స్‌ హబ్‌గా గత  ప్రభుత్వం ప్రకటించడమే కాదు...అమలుచేసింది. పలు సెల్‌ఫోన్‌ కంపెనీలను అక్కడ ప్లాంట్లు ప్రారంభించేలా చేసింది. తిరుపతి ప్రాంతంలో కొన్ని ఐటీ కంపెనీల పెట్టుబడులనూ తెచ్చింది. కడపలో ఉక్కు కర్మాగారానికి గత ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం కూడా మళ్లీ మళ్లీ శంకుస్థాపనలు చేశాయి. మొత్తంగా చూస్తే పాత రిపోర్టులు, పాత ప్రణాళికలు చూసి.. కనీసం వాటిలో ఏమైనా అమలయ్యాయో లేదో తెలుసుకోవాలన్న జ్ఞానం కూడా లేకుండా.. కనీస ప్రాథమిక అవగాహన లేకుండా బీసీజీ తూతూ మంత్రంగా నివేదిక ఇచ్చేసింది. ఈ మహా కమిటీల నివేదికలపై అధ్యయనానికి మరో జంబో కమిటీని జగన్‌ నియమించారు. పది మంది తాబేదార్లయిన మంత్రుల్ని.. సీఎస్‌, డీజీపీ సహా నోరుమెదపని ఆరుగురు ఉన్నతాధికారులను ఈ హైపవర్‌ కమిటీలో నియమించారు. ఈ కమిటీ రెండు సార్లు సమావేశమైంది. కానీ ఆందోళనపథంలో ఉన్న రాజధాని ప్రాంత రైతులను కనీసం ఒకరిద్దరినైనా పిలిచి మాట్లాడలేదు. నిజానికి జగన్‌ ఏం చేయబోతున్నాడో వారికే తెలియదు. ఆయన ఇచ్చినదానినే నివేదికగా ఆయనకే త్వరలో సమర్పిస్తారన్న మాట.