అమరావతి పరిరక్షణ ఉద్యమం... సంచలన నిర్ణయాలు

May 24, 2020

నవ్యాంధ్ర నూతన రాజధానిగా గత టీడీపీ ప్రభుత్వం ఎంపిక చేసిన అమరావతిలోనే రాజధాని కొనసాగాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. ఇందుకోసం రాజధాని రైతుల ఆద్వర్యంలో ఏర్పాటైన అమరావతి పరిరక్షణ సమితి... తన లక్ష్యం సిద్ధించే దాకా ఉద్యమాన్ని వీడే ప్రసక్తే లేదన్న దిశగా సాగుతోంది. ఇప్పటికే 47 రోజులుగా మొక్కవోని దీక్షతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్న పరిరక్షణ సమితి... తాజాగా రైతు సంఘాల నేతలతో భేటీ అయ్యింది. ఈ భేటీలో అమరావతి పరిరక్షణ సిద్ధించే దాకా ఉద్యమాన్ని నిలిపే ప్రసక్తే లేదని తేల్చేసింది. అంతేకాకుండా ఏకంగా ఏడాది పాటు ఉద్యమ కార్యాచరణకు కూడా పరిరక్షణ సమితి రూపకల్పన చేస్తోంది.

ఆదివారం విజయవాడలో రైతు సంఘాల నేతలతో అమరావతి పరిరక్షణ సమితి నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ సమావేశానికి రైతు సంఘాల తరఫున ఏపీలోని దాదాపుగా అన్ని జిల్లాల నుంచి రైతు సంఘాల నేతలు హాజరుకావడం గమనార్హం. అమరావతి పరిరక్షణ కోసం పరిరక్షణ సమితి సాగిస్తున్న ఉద్యమంపై భేటీలో చర్చించారు. రోజుల తరబడి సాగిస్తున్న ఉద్యమానికి మద్దతుగా అన్ని జిల్లాల నుంచి రైతు సంఘాలతో బస్సు యాత్రలు నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. 

అంతేకాకుండా అత్యంత కీలకమైన ఈ భేటీలో పలు అంశాలను చర్చించి పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. రైతులు, మహిళలకు అండగా ఉండాలని, రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, రైతులకు ఎలాంటి అన్యాయం జరగకూడదని, అమరావతిలోని ప్రస్తుత భవనాల నిర్మాణాలను పూర్తి చేసి పాలన ఇక్కడి నుంచే సాగించాలని, అన్ని జిల్లాల అభివృద్ధి కోసం ప్రణాళిక రూపొందించాలని, అమరావతి రైతులకు మద్దతుగా జిల్లాల నుంచి బస్సు యాత్ర చేయాలని, పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏడాది కార్యక్రమాలపై దీర్ఘ కాలిక ప్రణాళిక రూపొందించాలని... ఇలా పలు కీలక అంశాలపై ఏకగ్రీవంగా తీర్మానాలను ఆమోదించారు. మొత్తంగా రాజధానిని అమరావతిలోనే కొనసాగించేందుకు ప్రభుత్వం ప్రకటించేదాకా ఉద్యమాన్ని వీడేది లేదన్న దిశగా ఈ భేటీలో పరిరక్షణ సమితి, రైతు సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.