అమరావతి ఉద్యమం ఆపొద్దు....

February 25, 2020

రాష్ట్రంలో అసలైన సమస్యలు వదిలేసి రాజకీయ లాభంతో రాజధాని సమస్యను కెలికిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అందరూ తప్పు పడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ప్రాంతీయవాదం, ప్రాంతీయ విద్వేషం రేపారని అందరూ ఆరోపిస్తున్నారు. అమరావతిని ప్రారంభించిన రోజు ఏ నిరసనలు రాలేదని.. రాష్ట్ర ప్రజలు మొత్తం అమరావతిని ఆమోదించారని... దానిని ఇపుడు మార్చాల్చిన అవసరం ఏమొచ్చిందని స్వామీజీ కమలానంద భారతి ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఆలోచన సరైనది కాదని, అమరావతి రైతులు పోరాటాన్ని ఆపొద్దని ఆయన పిలుపునిచ్చారు.

జగన్ ప్రకటన వచ్చిన నాటి నుంచి అమరావతి రైతులు పోరాటం మొదలుపెట్టారు. రాజధాని తరలింపు సరికాదని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రం కోసం త్యాగం చేసి 33 వేల ఎకరాలు ఇచ్చిన మమ్మల్ని రోడ్డున పడేసిన ఈ ప్రభుత్వం కూలిపోతుందని శపిస్తున్నారు. గుంటూరు జిల్లాలో సొంత పార్టీ వాళ్లు కూడా జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. వీరికి కమలానంద భారతి స్వామి మద్దతు పలికారు. మందడంలో రైతుల నిరసనకు ఆయన తన సంఘీభావం తెలిపారు. రాజధాని అమరావతిపై చర్చలు, కమిటీలు ఏమీ అవసరం లేదని, సర్వాంగీకారంతోనే రాజధాని ఏర్పడిందని, కేంద్రమూ గుర్తించిందని అన్నారు. రైతుల భద్రత, భవిష్యత్తు అమరావతితోనే ముడిపడి ఉందని వారికి చెప్పారు. రైతులు పోరాటం కొనసాగిస్తే...  అమరావతి ఉద్యమం జిల్లాల వారీగా విస్తరిస్తుందని, ప్రజాబలం పెరుగుతుందని, రాజధాని నిర్మాణం జరిగి తీరుతుందని ఆయన సూచించారు.