అమరావతిపై ఫెంటాస్టిక్ ఐడియా - మోడీకి చెప్పండి సార్

February 25, 2020

2014 ఎన్నికలకు మధ్య... మీకు ఢిల్లీ ని తలదన్నే రాజధాని కట్టుకోవడానికి అవసరమైన సహాయం చేస్తానని చెప్పి మాట తప్పిన మోడీ ఇపుడు ఏదో ఏపీ తన మానాన తాను ఏదో కిందా మీద పడి అమరావతి కట్టుకుందాం అంటే... అనుమతులు, డబ్బులు ఆలస్యం చేయడంతో ఇప్పటికే రెడీ అవ్వాల్సిన సిటీ కొంచెం పెండింగ్ అయిపోయింది. ఇదే అదనుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.. తన రాజకీయ ప్రయోజనాలకు అమరావతిని పణంగా పెట్టాడు. ఇంత జరగుతున్నా కేంద్రం తనకేమీ సంబంధం లేదన్నట్టు సైలెంటుగా ఉండాలని ప్రయత్నం చేస్తోంది. 

ఇక ఏపీని ఒక రాజకీయం అంశంగా మాత్రమే చూస్తున్న బీజేపీలాగే ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. మీరేం ఉద్దరించకపోయినా పర్లేదు ఉన్నదానిని ఉంచడానికి సహాయం చేయండి ఏపీ ప్రజలు అర్థిస్తుంటే... న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిని ఏకంగా దేశ రాజధానిని చేయమంటున్నారు బీజేపీ జంపింగ్ లీడర్ టీజీ వెంకటేష్. అమ్మకు అన్నం లేదురా అంటే పిన్నమ్మకు విందు భోజనం వడ్డించాలి అంటున్నాడు. 

పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణసంకటం అన్నట్టు... పిల్లి ఏమో కేంద్రం... ఎలుకేమో ఏపీ ప్రజలు అయ్యారు. జగన్ - మోడీ లోపాయకారీగా రాజకీయ ప్రయోజనాల కోసం ఆడుతున్న ఆటలో రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అంధకారంలో పడింది. దేశంలో అన్ని రాష్ట్రాలు దావోస్ ఎలా పెట్టుబడులు తెచ్చుకుందాం అని తలమునకలు అవుతుంటే...ఏపీలో రాజకీయ కొట్లాట జరగుతోంది. సీనియారిటీ కాస్త మంచి సలహాలు చెప్పాల్సిన టీజీ వెంకటేష్ వంటివారు ... ఇలా పనికిమాలిన, జీరో పర్సెంట్ కూడా నెరవేరే అవకాశం లేని కామెడీ సలహాలతో ఏపీ ప్రజలకు మంట పుట్టిస్తున్నారు. 

నిజంగా టీజీ వెంకటేష్ ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల బాధ్యత ఉంటే... అమరావతిని దేశ రెండో రాజధానిని చేయండని డిమాండ్ చేయడం కాదు చేయాల్సింది. ఒక వినతి పత్రం రాసుకుని.. ఇతర ఎంపీలను కలిసి...తనదో వచ్చే వారిని తీసుకుని ప్రధానిని కలిసి బాధ్యతాయుతంగా ఒక వినతిపత్రం ఇవ్వాలి. అది నెరవేరినా నెరవేరకపోయినా... కనీసం బాధ్యతాయుతంగా ప్రవర్తించినట్టు అవుతుంది. కానీ అలాంటి ఆలోచన టీజీకే కాదు ఏపీలో ఎవరికి లేదు. అందుకే తెలంగాణ నుంచి విడిపోయేటపుడు గాని, ఇపుడు గాని ఏపీ ఇంతగా నష్టపోయింది.