చంద్రబాబు.. హీరో ఆప్ ద డే

July 15, 2020

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిజంగానే హీరో ఆఫ్ డేనే. ఎందుకంటే... నవ్యాంధ్ర రాజధాని అమరావతిని పీక పిసికేసేలా ఏపీకి మూడు రాజధానుల దిశగా దూకుడుగా సాగుతున్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ముక్కు తాడు వేయడంలో చంద్రబాబు సఫలీకృతం అయ్యారనే చెప్పాలి. తాను సభ్యుడిగా ఉన్న అసెంబ్లీలో తన పార్టీకి బలం లేని నేపథ్యంలో వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దుకు ఉద్దేశించిన బిల్లును చంద్రబాబు అడ్డుకోలేపోయారు. అయితే తనదైన శైలి మంత్రాంగాన్ని రచించిన చంద్రబాబు.... తాను మండలిలో సభ్యుడిగా లేకున్నా... బయట కూర్చుని మరీ ఈ రెండు బిల్లులకు చెక్ పెట్టేశారు. అంతేకాకుండా శాసనమండలిలో ఓ రేంజిలో నాటకాన్ని రక్తి కట్టించి.. ఆ మొత్తం సీన్ ను ఓ సాధారణ పౌరుడి మాదిరిగా శాసనమండలి విజిటర్స్ గ్యాలరీలో కూర్చుని తిలకిస్తూ చంద్రబాబు ఎంజాయ్ చేశారు.

అసెంబ్లీలో ఎలాగూ రెండు బిల్లులను చంద్రబాబు అడ్డుకునే పరిస్థితి లేదు. అందుకే... తన వాదనను జనానికి వినపడేలా వ్యవహరించిన చంద్రబాబు... మండలిలో మాత్రం తన పార్టీకి ఉన్న బలాన్ని అస్త్రంగా మలచుకుని బిల్లులకు చెక్ పెట్టే వ్యూహానికి పదును పెట్టారు. ప్రత్యేక శాసన సభా సమావేశాల ప్రారంభానికి ముందే వైసీపీ ప్లాన్ ను పూర్తిగానే పట్టేసిన చంద్రబాబు.. మండలి వేదికగా తన మంత్రాంగానికి పదును పెట్టారు. ఈ క్రమంలో మండలిలో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఓ వ్యూహాన్ని రచించి... దానిని నడిపించే బాధ్యతను పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి అప్పగించారు. పనిలో పనిగా తన కుమారుడికి కూడా ఆ బాధ్యతలను అప్పగించేశారు. బాబు దిశానిర్దేశంతో అటు యనమల, ఇటు లోకేశ్ లు తమదైన శైలిలో చక్రం తిప్పారు.

అంతిమంగా శాసనమండలి చైర్మన్ గా కొనసాగుతున్న టీడీపీ సీనియర్ నేత షరీఫ్ ద్వారా కూడా వ్యూహాన్ని నడిపారు. ఈ క్రమంలోనే మంగళవారం రూల్ 71ను బయటకు తీసిన టీడీపీ... బుధవారం హౌస్ లో బిల్లుల ప్రస్తావన లేకుండా చేయగలిగారు. ఎప్పటికప్పుడు మండలిలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తూ సాగిన చంద్రబాబు.. ఎప్పుడు ఎలా వ్యూహాన్ని నడపాలన్న విషయంపై తన పార్టీకి చెందిన ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. అంతిమంగా... వికేంద్రీకరణ బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి నివేదిస్తున్నట్లుగా షరీఫ్ తో సంచలన ప్రకటన చేయించిన చంద్రబాబు... మొత్తం ఎపిసోడ్ లో హీరోగా నిలిచారు. అయితే చివరి ఘట్టాన్ని చూసేందుకు సిద్ధపడ్డ చంద్రబాబు... తనకు మండలిలోకి ప్రవేశం లేదని మిన్నికుండిపోకుండా... ఏకంగా నేరుగా మండలి విజిటర్స్ గ్యాలరీలోకి వెళ్లి కీలక ఘట్టాన్ని వీక్షించారు. ఎలా చూసినా... మొత్తం షోను తన వైపునకు తిప్పుకున్న చంద్రబాబు నిజంగానే హీరో ఆప్ ద డేగా నిలిచారని చెప్పాలి.