గుడ్ న్యూస్ - అమరావతి ఆగదట !

September 16, 2019

జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎక్కడి పనులు అక్కడ ఆపేసెయ్యండి అని గవర్నమెంటులోని అన్ని విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు. చివరకు ఏపీలోని ప్రతి పౌరుడితో సంబంధం ఉన్న పోలవరం, అమరావతి పనులను కూడా ఆపేయమనడంతో జనాల్లో అనుమానాలు మొదలయ్యాయి. పోలవరం ఆగితే ఎట్లయ్యా అదే కదా మనకు అత్యవసరం అని జనాల్లో ఫీడ్ బ్యాక్ రావడం, అమరావతి ఆపడంపై ప్రజలందరిలో అనుమానం రావడంతో జగన్ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. అందుకే మళ్లీ జగనే ఈ రెండింటిని కొనసాగిస్తాం అని ప్రకటిస్తే గిల్టీగా ఉంటుందని ఫీలైనట్టున్నారు. ’’అమరావతి ఆగదు‘‘ అంటూ ముందుగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ చూస్తున్న సంబంధిత మంత్రి బొత్స సత్యనారాయణతో ప్రకటన చేయించారు.
సోమవారం తొలిసారి బొత్స సత్యనారాయణ అమరావతి నిర్మాణ సంస్థ సీఆర్డీఏ ఆఫీసుకు వచ్చారు. అమరావతి పనులపై ఆరా తీశారు. అక్కడ ఆ సంస్థతో పాటు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రాజధాని నిర్మాణాలు, ఇతర పనులపై వివిధ విభాగాల అధిపతులు మంత్రి బొత్సకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సమావేశంలో సీఆర్డీయే కమిషనర్‌ పి.లక్ష్మీ నరసింహం, స్పెషల్‌ కమిషనర్‌ వి.రామమనోహరరావు, అడిషనల్‌ కమిషనర్‌ కె.విజయ (ఈమె తాజాగా బాధ్యతలు స్వీకరించారు), ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీ పార్థసారధి, సీఈలు, వివిధ విభాగాధిపతులు, కన్సల్టెంట్లు పాల్గొన్నారు. అధికారులతో సమావేశం అనంతరం బొత్స సత్యానారయణ అమరావతిపై ప్రభుత్వ ఆలోచన గురించి ప్రకటించారు.
రాజధాని పనులను ఏకపక్షంగా ఆపడం లేదన్నారు. తాత్కాలిక విరామమే అని అన్ని పనులు కొనసాగుతాయని మంత్రి ప్రకటించారు. తమ ప్రభుత్వం అన్ని నిర్మాణాలు ఆపివేస్తుందనడంలో వాస్తవం లేదన్నారు. మేము అభివృద్ధి కాముకులం అని చెప్పుకున్నారు. ఇటీవలే అన్ని పనులు ఆపేయమని జగన్ అంత స్పష్టంగా ప్రకటిస్తే... సాక్షిలో కూడా రాశారు. కానీ అమరావతిలోని ప్రాజెక్టులను నిలిపివేస్తామనేది కేవలం అపోహేనని బొత్స అంటున్నారు. త్వరలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి రాజధానిపై సమీక్షిస్తారని చెప్పారు. అనంతరం నిధుల లభ్యత, ప్రాథమ్యాల క్రమాన్ని అనుసరించి, ప్రయారిటీ ప్రకారం ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి వివరించారు.