అమరావతి వైసీపీ నేతల్లో టెన్షన్, ఒత్తిడి: భవిష్యత్తుపై అదే 'ధైర్యం!

February 23, 2020

మూడు రాజధానుల అంశం ప్రతిపక్ష టీడీపీలోనే కాదు.. అధికార వైసీపీలోను చిచ్చు రేపుతోందా? తమ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో పాటు జగన్‌కు చెప్పలేక లోలోన ఆందోళన చెందుతున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిణామాలు తమ రాజకీయ భవిష్యత్తును ఎక్కడ దెబ్బతీస్తాయోననే టెన్షన్ వైసీపీ ప్రజాప్రతినిధులకు పట్టుకుందట. అమరావతితో పాటు కృష్ణా, గుంటూరు, సమీప జిల్లాల్లోని వైసీపీ నేతలు లోలోన గుబులు చెందుతున్నారని అంటున్నారు.

ఆదివారం నందిగామకు వచ్చిన వైసీపీ ఎంపీ సురేష్‌ను టీఎన్ఎస్ఎఫ్, విద్యార్థులు అడ్డుకున్నారు. రాజధాని అమరావతికి మద్దతు తెలపాలని నిలదీశారు. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని, పరిపాలన వికేంద్రీకరణ కాదని ఎంపీ ఎదుట నినాదాలు చేశారు. అమరావతి రాజధానికి పలువురు వైసీపీ నేతలు మద్దతిస్తున్నారని వారు గుర్తు చేశారు. మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా మద్దతివ్వాలనే డిమాండ్ చేశారు.

నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అమరావతి రైతులకు మద్దతు తెలిపారు. ఇదే విషయాన్ని విపక్షాలు, రైతులు ప్రస్తావిస్తున్నారు. నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా తొలుత మూడు రాజధానుల అంశంపై మాట్లాడి, ఆ తర్వాత వెనక్కి తగ్గారని అంటున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందోనని.. జగన్ చేతుల్లోనే ఉందని ఈ ప్రాంత వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు చెవులు కొరుక్కుంటున్నారట.

అమరావతి రాజధాని ప్రాంతం ఉన్న గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు ప్రకాశం, గోదావరి జిల్లాల్లోని వైసీపీ నేతల్లో అసంతృప్తి ఉందంటున్నారు. రైతులు, ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నామని ఆయా ప్రాంతాల కిందిస్థాయి నేతలు ఎమ్మెల్యేలు, ఎంపీల ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. కానీ తాము ఏమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారట.

రాజధాని, సమీప ప్రాంతాల వైసీపీ ప్రజాప్రతినిధుల్లో చాలామంది రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నప్పటికీ.. కొందరిలో మరో మొండి ధైర్యం కనిపిస్తోందట. మళ్లీ ఎన్నికలు రావడానికి ఇంకా నాలుగేళ్లు ఉందని, ఆ సమయానికి తమ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి, అమరావతి ప్రాంతాన్ని రైతులు, స్థానికులు మెచ్చేలా అభివృద్ధి చేస్తే అప్పటికి రాజధాని అంశాన్ని అందరూ మరిచిపోతారని భావిస్తున్నారట.

ప్రస్తుతం రాజధాని ప్రాంతవాసులకు తమపై ఆగ్రహం ఉందని, కానీ నాలుగేళ్ల తర్వాత తమ ప్రభుత్వం చేసే అభివృద్ధిపై తమ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తమను తాము సర్ది చెప్పుకుంటున్నారట. అయితే కిందిస్థాయి నేతలకు మాత్రం ప్రజల్లోకి ఎలా వెళ్లాలో అర్థం కాని పరిస్థితి ఉందని అంటున్నారు.