అమరావతి పాలిట మరో సైంధవుడు!

August 06, 2020

బీజేపీలో వైసీపీ అధికార ప్రతినిధి
జీవీఎల్‌లో అణువణువునా జగన్‌భక్తి
విశాఖ హోటల్లో షేర్లు ఇచ్చినందుకేనా?
జీవీఎల్‌ నరసింహారావు.. తెలుగువాడే.. రాజధాని అమరావతికి పొరుగునే ఉన్న ప్రకాశం జిల్లా వ్యక్తి. సొంతూరు వదిలి ఏనాడో ఢిల్లీ వెళ్లిపోయిన ఆయన.. ప్రధాని మోదీ- కేంద్ర హోంమంత్రి అమిత షాలకు సన్నిహితుడు. వారి ప్రాపంకం సంపాదించి.. ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యాక గాని.. ఆయన పుట్టుపూర్వోత్తరాలు తెలియలేదు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న ఆయన ప్రస్తుతం.. వైసీపీకి అనధికార అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ నేతలు చంద్రబాబును తిట్టినా తిట్టకున్నా.. ఈయన మాత్రం ప్రతి వేదికపైనా ఆయన్ను టార్గెట్‌ చేసుకుని మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఓటమి తర్వాత నలుగురు టీడీపీ ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేశ్‌, టీజీ వెంకటేశ్‌, గరికపాటి మోహనరావు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నలుగురూ తరచూ అమితషాను కలిసి ఆంధ్ర రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు వివరిస్తూ వస్తున్నారు. రాజధానిని విశాఖకు తరలించాలన్న జగన్‌ నిర్ణయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా విమర్శిస్తోంటే.. జీవీఎల్‌ మాత్రం అమరావతి రైతులకు వ్యతిరేకంగా.. పార్టీ రాష్ట్ర శాఖ వైఖరికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.

రాజధాని నిర్మాణం కోసం వేల మంది చిన్నా చితకా రైతులు 33 వేల ఎకరాల భూములిస్తే.. ఎవడివ్వమన్నారన్న రీతిలో మాట్లాడుతున్నారు. రాజధాని కాదు.. రాజధానులు ఎక్కడ పెట్టుకోవాలో రాష్ట్రప్రభుత్వ ఇష్టమని.. కేంద్రానికి సంబంధం లేదని పదే పదే మాట్లాడుతున్నారు. అన్ని సార్లు వైసీపీ నేతలు కూడా మాట్లాడి ఉండరు. రాజధాని ఎక్కడ పెట్టాలో నిర్ణయాధికారం రాష్ట్రప్రభుత్వానిది కాదని అందరూ అంగీకరిస్తారు. అది ఎప్పుడు? కొత్త రాజధానిని నిర్ణయుంచేటప్పుడు! మరి ఆంధ్ర రాజధాని అమరావతి అని కేంద్రం ఎప్పుడో నోటిఫై చేసింది కదా! దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉన్న రాజధానిని తీసేసి మూడు కొత్త రాజధానులు పెట్టారా? ఒకచోట ఉన్న హైకోర్టును తీసేసి.. వేరే చోటకు తరలించిన సందర్భంగా ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? సుప్రీంకోర్టును సంప్రదించకుండా ఏకంగా అసెంబ్లీలో బిల్లును ఆమోదించడం కరెక్టేనా? పోనీ ఇందుకు కేంద్రం అనుమతి తీసుకుందా? శాసనమండలి ఆమోదించలేదని.. మండలినే రద్దుచేసిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? ఢిల్లీ నుంచి రాజధానిని దౌలతాబాద్‌ (దేవగిరి)కు మార్చిన మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ తప్ప.. ప్రపంచంలో ఏ దేశంలోనైనా రాజధానిని అకారణంగా.. నిర్హేతుకంగా మార్చిన మూర్ఖపు ప్రభుత్వం ఉందా? అమరావతి రైతులు మూడు నెలలుగా ఆందోళన చేస్తున్నా చీమకుట్టినట్లు కూడా లేని జగన్‌కు వత్తాసు పలకడానికి జీవీఎల్‌కు ఏ మాత్రం సిగ్గనిపించడం లేదు. పైగా అలా మార్చడానికి కుదరదని.. కోర్టులు అడ్డుకుంటాయని సుజనా ఈ నెల 5న ఢిల్లీలో చెబితే.. దానిని వైసీపీ నేతలో, రాష్ట్రప్రభుత్వమో ఖండించాలి. కానీ జీవీఎల్‌ ఆ రాత్రి మీడియా చానళ్ల ప్రతినిధులందరికీ ఫోను చేశారు. ఈ వ్యవహారంపై స్పందిస్తాను రమ్మని కబురు పంపారు. వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి సూచనతోనే ఆయన ఈ హడావుడి చేసినట్లు సమాచారం. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని బీజేపీ రాష్ట్ర శాఖ తీర్మానించింది నిజమేనని, అయితే కేంద్రం దానిని వినాలని లేదని జీవీఎల్‌ ఆ సందర్భంగా తేల్చిచెప్పారు. పీపీఏల రద్దుపై రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టినప్పటికీ.. కేంద్రం రాష్ట్రంపై చర్యలు తీసుకోగలిగిందా అని లాజిక్‌ పాయింట్‌ లాగారు. తమ రాష్ట్ర శాఖ కోరినవన్నీ కేంద్ర ప్రభుత్వం అమలుచేయాలని లేదని కూడా అనేశారు. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత సైతం వేసవి రాజధానిగా గైర్‌సైణ్‌ను ప్రకటించడం దీనికి నిదర్శనమని చెప్పారు. జీవీఎల్‌ కుతర్క వాదనకు ఇదే నిదర్శనం. గైర్‌సైణ్‌ను వేసవి రాజధానిని చేస్తామని బీజేపీ 2017లో ఉత్తరాఖండ్‌ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. దానికి అనుగుణంగా.. మూడేళ్లకు ఆ ప్రకటన చేసింది. నిజానికి ఆ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌ తాత్కాలికమే. ఈ నగరం, నైనిటాల్‌ రాజధాని కోసం పోటీపడగా.. తాత్కాలికంగా డెహ్రాడూన్‌ను ఎంపిక చేస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడి నుంచే అసెంబ్లీ, సచివాలయం నడుస్తున్నాయి. నైనిటాల్‌లో హైకోర్టును ఏర్పాటుచేశారు. ఇది జీవీఎల్‌కు తెలుసా?

పోనీ అమరావతిని నిర్ణయించేటప్పుడు జగన్‌ ఆమోదించారని.. చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కూడా మద్దతిచ్చిందని గుర్తుందా? ఇప్పటికీ తన పార్టీ అమరావతికే జైకొడుతోందన్న కనీస స్పృహ ఆయనకుందా? ఇవన్నీ ఆయనకు తెలుసు. కాకపోతే ఆయన అణువణువునా ప్రస్తుతం జగన్‌ భక్తి తొణికిసలాడుతోంది. విశాఖలో నిర్మాణంలో ఉన్న ఓ భారీ హోటల్‌లో కొంత షేరు తనకు కూడా వైసీపీ ఇవ్వడమే దీనికి కారణమని బీజేపీ నేతల్లో ప్రతి ఒక్కరికీ తెలుసు. మోదీ-షాలతో తనకున్న సాన్నిహిత్యాన్ని రాష్ట్ర నేతలను బెదిరించడానికి ఆయన ఉపయోగించుకుంటున్నారని స్పష్టమవుతోంది. అమరావతి విషయంలో ఎవరైనా కేంద్రం చేతిలో అధికారం ఉందని హామీలు ఇచ్చినా, వ్యాఖ్యలు చేసినా.. అవన్నీ వారి వ్యక్తిగత అభిప్రాయాలుగానే పరిగణించాలని.. అవన్నీ తప్పుడువేనని జీవీఎల్‌ స్పష్టం చేశారు. ఇటీవల విజయవాడలో నగర ప్రముఖులు, మేధావులతో ఆ ప్రాంత సమస్యలపై సమావేశం జరిగిందని, కొందరు జేఏసీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారని, వారు రాజధానిపై ఉన్న అనిశ్చిత పరిస్థితిని ప్రస్తావించారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పరిమితులు ఉంటాయని వారికి చెప్పానని.. సీఆర్‌డీఏతో చేసుకున్న ఒప్పందం మేరకు రైతులు భూములు ఇచ్చారు గనుక కచ్చితంగా వారికి న్యాయం జరుగుతుందని చెప్పానన్నారు. ఆ ప్రాంతంలో అభివృద్ధికి జగన్‌ ప్రభుత్వం ఏయే నిర్ణయాలు తీసుకుంటుందో, ఏయే మౌలిక సదుపాయాలు కల్పించనుందో వివరంగా చెప్పానని తెలిపారు. అలా చెప్పడానికి ఈయనెవరు? జగన్‌ ప్రభుత్వంలో ఈయనేమైనా సలహాదారా.. మంత్రిగారా? రాష్ట్రప్రభుత్వం ఏం అభివృద్ధి చేస్తుందో వేరే పార్టీకి చెందిన ఈయనకెలా తెలుసు? అంటే జగన్‌ ప్రభుత్వంలో ఈయనకు ఎంత పలుకుబడి ఉందో అర్థమవుతోంది. అందుకే చంద్రబాబు విశాఖ పర్యటనకు వెళ్లకుండా విశాఖ ఎయిర్‌పోర్టులో వైసీపీ కార్యకర్తలు, పోలీసులు అక్రమంగా అడ్డుకుంటే ఆయనకు ఎలాంటి అన్యాయం అనిపించలేదు. పైగా జగన్‌ తరపున వకాల్తా పుచ్చుకున్నారు. చంద్రబాబుపై కోడిగుడ్లు వేసిన చోట.. జగన్‌పై కత్తిదాడి జరిగితే టీడీపీ అవహేళన చేయలేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలపై దాడులు చేయించే సంస్కృతిని తిరుపతి వెంకన్న సాక్షిగా టీడీపీయే మొదలు పెట్టిందని, అమిత షా, ప్రధాని మోదీపై నల్ల బెలూన్లు ప్రదర్శించారని పోలిక తెచ్చారు. నల్ల బెలూన్ల ప్రదర్శన శాంతియుతమైనది. పైగా ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ప్రకటించినందుకు నిరసనగా ప్రతి పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడింది. ఇక్కడ ఏ కారణం ఉందని విశాఖలో చంద్రబాబును అడ్డుకున్నారు? దీనికి ఆయన్నుంచి సమాధానం లేదు.   జగన్‌ పట్ల ఉన్న కృతజ్ఞతా భావం జీవీఎల్‌లోని విచక్షణను, వివేకాన్ని నశింపజేసినట్లు అవగతమవుతోంది. ఇలాంటి నేతలను ముందుపెట్టుకుని బీజేపీ రాష్ట్ర శాఖ అమరావతి రైతులకు ఎంత వరకు న్యాయం చేస్తుందో చూడాలి.