జగన్ వద్దకు అంబానీ... ఎందుకో తెలిస్తే షాకే

June 02, 2020

నవ్యాంధ్రలో శనివారం జరిగిన ఓ కీలక భేటీ... అధికార పార్టీ వైసీపీకి భారీ షాకే ఇచ్చిందని చెప్పాలి. దేశంలోనే నెంబర్ వన్ కుబేరుడిగా పేరు పడిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ముంబై నుంచి వచ్చి వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. కుమారుడు అంకిత్ అంబానీ, తన కంపెనీలో కీలక వ్యక్తిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీతో కలిసి వచ్చిన అంబానీకి గన్నవరం ఎయిర్ పోర్టులో ఎంపీ విజయసాయిరెడ్డితో జగన్ ఘన స్వాగతం పలికించారు. ఆ తర్వాత సాయిరెడ్డితో కలిసి వచ్చిన అంబానీ బృందంతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్ సుదీర్ఘ భేటీ నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు రహస్యంగా సాగిన భేటీ ఓ కీలక అంశం చుట్టూనే తిరిగిందట.

ఈ కీలక అంశమేమిటన్న విషయానికి వస్తే... మరో రెండు నెలల్లో వైసీపీ దక్కనున్న నాలుగు రాజ్యసభ సీట్లలో ఓ సీటును అంబానీకి జగన్ ఇవ్వాల్సిందేనట. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలతో అంబానీ ఏపీకి రాగా... షా నుంచి అంతకుముందే ఒప్పందం కుదుర్చుకున్న మేరకు పరిమళ్ నత్వానీకి వైసీపీ నుంచి రాజ్యసభ సీటు ఇచ్చే దిశగా ఈ భేటీలో దాదాపుగా ఓ అంగీకారం కుదిరిందట. పరిమళ్ నత్వానీ ఇప్పటికే రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగగా... ఆయన పదవీకాలం ఏప్రిల్ తో ముగియనుందట. అంబానీ కంపెనీలో కీలక వ్యక్తిగా, కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు, రిలయన్స్ కంపెనీకి అనుసంధానకర్తగా ఉన్న నత్వానీని మరోమారు రాజ్యసభకు పంపాలని ఇప్పటికే బీజేపీ తీర్మానించిందట.

అయితే ప్రస్తుతం ఏ రాష్ట్రం నుంచి చూసినా బీజేపీకి పెద్దగా రాజ్యసభ సీట్లు దక్కేలా లేదట. అయితే బీజేపీని మచ్చిక చేసుకుని కేసుల నుంచి తనను తాను రక్షించుకునేందుకు జగన్ యత్నిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ క్రమంలోనే తన పార్టీకి ఈ దఫా దక్కనున్న నాలుగు రాజ్యసభ సీట్లలో ఒకటో, రెండో సీట్లను బీజేపీకి ఇచ్చేందుకు తాను సిద్ధమేనని అమిత్ షాకు జగన్ చెప్పిన సంగతి తెలిసిందే కదా. అయితే అప్పడు అమిత్ షా ఈ ప్రతిపాదనకు అంతగా ఆసక్తి చూపకున్నా... బీజేపీకి దక్కే సీట్లు చాలా తక్కువగా ఉండటం.. ఎలాగూ బీజేపీకి సీట్లిస్తానని జగన్ చెప్పడంతో ఆలోచించిన షా... అంబానీ బృందాన్ని జగన్ వద్దకు పంపారట. మొత్తంగా తనకు దక్కే నాలుగు రాజ్యసభ సీట్లలో ఓ స్థానాన్ని పరిమళ్ కు ఇవ్వక తప్పని పరిస్థితిలో జగన్ పడిపోయారు. 

 

ఇదిలా ఉంటే... వైసీపీకి దక్కే నాలుగు రాజ్యసభ సీట్లను దక్కించుకునేందుకు ఆ పార్టీలోని చాలా మంది నేతలు ఇప్పటికే జగన్ వద్ద భారీ సంఖ్యలోనే ప్రతిపాదనలు పెట్టారు. ఒకేసారి నాలుగు రాజ్యసభ సీట్లు దక్కనున్న నేపథ్యంలో వైసీపీలో వీటిని దక్కించుకునేందుకు నేతలు తమదైన శైలి యత్నాలు చేస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో అమిత్ షా మాటతో అంబానీ ఏపీకి రావడంతో ఓ సీటు బీజేపీ కోటాకు విడిచిపెట్టక తప్పని పరిస్థితి జగన్ కు ఎదురైంది. అంటే.. నాలుగు సీట్లలో ఓ సీటు బొక్క పడినట్టే కదా. అంటే... అంబానీ దిగిన వెంటనే వైసీపీకి... మరీ ముఖ్యంగా జగన్ కు బొక్కపడిపోయిందన్న మాట.