AP : కరోెనా ఆ ఇద్దరికీ రావడం మాత్రం వెరైటీ

August 09, 2020

అదేంటో ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. చివరకు కరోనా కూడా అధికారం ఉంటేనే అక్కర చేరుతుందేమో అని పలువురు సెటైర్లు వేస్తున్నారు. ఇది పక్కన పెడితే... ఇప్పటికే ఏపీలో అనేక మంది వైసీపీ నేతలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా వైసీపీ నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా సోకింది. 

నిన్నరాత్రి వైసీపీలో నెం.2 అని అందరూ చెప్పుకునే విజయసాయిరెడ్డికి కరోనా సోకింది. చంద్రబాబుకు, లోకేష్ కి కరోనా రత్న అవార్డులు ప్రకటించిన సాయిరెడ్డి అందరికంటే ముందు కరోనా బారిన పడటం విధివైచిత్రి అంటూ అందరూ అంటున్నారు. చివరకు వైసీపీలో మాటలరాయుడు అంబటి రాంబాబుకు తాజాగా కరోనా సోకడం కలకలం అయ్యింది. ఈయనతో కలిపి గుంటూరులో ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. 

ఇప్పటికే తెనాలి ఎమ్మెల్యే శివకుమార్, పొన్నూరు ఎమ్మెల్యే వెంకట రోశయ్యలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా అంబటి దాని బారిన పడ్డారు. సత్తెనపల్లిలో ఇప్పటి వరకు 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సత్తెనపల్లిలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించాలని అధికారులను అంబటి కోరారు. తన దాకా వస్తే గాని తత్వం బోధపడలేదా అంటూ జనం అంబటిని ఎద్దేవా చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ లో జగన్ హయాంలో ఆస్పత్రుల రంగు రూపు మార్చామని చెబుతున్న విజయసాయిరెడ్డి ... హైదరాబాదుకు వెళ్లి  అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.