జగన్ కు అమిత్ షా ఫోన్ కాల్ అంత్యర్యం అంతేనా?

August 07, 2020

అనుకోకుండా జరిగిందో.. లేక అంతకు మించి మరో కారణం ఏదైనా ఉందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. లాక్ డౌన్ పొడిగింపు అంశంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారని.. వారి ఆలోచనల్ని తెలుసుకుంటున్నారన్నది తెలిసిందే.

శుక్రవారం సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అమిత్ షా ఫోన్ చేశారు. మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులకు షా ఫోన్ చేయటం ఆసక్తికరం కాకున్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ కు ఫోన్ చేయటం మాత్రం కాస్త అండర్ లైన్ చేసుకునేలా మారింది.

ఇటీవల కాలంలో ఏపీ హైకోర్టు నుంచి వరుస మొట్టికాయలు పడుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం పడిన మొట్టికాయ తీవ్రత ఎక్కువగా ఉండటమే కాదు.. బొప్పికట్టిన వైనం అందరికి కనిపించే పరిస్థితి. ఇలాంటివేళలోనే.. అమిత్ షా నుంచి సీఎం జగన్ కు ఫోన్ రావటంపైన ఆసక్తి వ్యక్తమవుతోంది. దీనికి కారణం లేకపోలేదు.

ఏపీకి సోదర రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రికి షా నుంచి ఫోన్ కాల్ రాలేదు. సాధారణంగా.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోన్ చేసిన వేళ.. పక్కనున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోన్ చేయటం మామూలే. ఉత్తరాది రాష్ట్రాలు ఒకసారి.. దక్షిణాది రాష్ట్రాలు మరోసారి అన్నట్లుగా షెడ్యూల్ ఉంటుందని చెబుతారు.
ఆ కోణంలో చూసినప్పుడు.. అమిత్ షా ఫోన్ కాల్ జగన్ కు ముందు కానీ.. తర్వాత కానీ ఉండాలి. కానీ.. అదేమీ కనిపించదు.

దీంతో.. జగన్ కు అమిత్ షా ఫోన్ కాల్ లో విశేషం ఉందన్న మాట వినిపిస్తోంది. మీడియా రిపోర్ట పరంగా చూస్తే.. లాక్ డౌన్ అంశంపై జగన్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు చెబుతున్నా.. అంతకు మించిన విషయాలే ఉంటాయన్నది అధికారపక్షానికి అత్యంత సన్నిహితంగా ఉండే వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీనికో ఉదాహరణ కూడా చెబుతున్నారు.

మీరు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు.. మీకు ఎవరైనా పెద్దవారి నుంచి ఫోన్ వచ్చినప్పుడు.. వారి పని గురించి మాట్లాడి.. ఫోన్ పెట్టేయరు కదా? కుశల ప్రశ్నలతో పాటు.. మరిన్ని విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆ కోణంలో విషయాన్ని చూసినప్పుడు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కేంద్రమంత్రి అమిత్ షా ఫోన్ కాల్ ను అండర్ లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.