కర్ణాటకలో సర్వే అంచనాలు నిజమవుతున్నాయి !!

June 01, 2020

కర్ణాటక విధానసభలోని 15 స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో సర్వే అంచనాలు నిజమయ్యేటట్లుగా కనిపిస్తోంది. యడ్డి ప్రభుత్వం లెక్క తేల్చే ఈ ఉప ఎన్నికల మీద బీజేపీ ఎన్నో ఆశల్ని పెట్టుకుంది. తమ చేతిలో ఉన్న అధికారాన్ని నిలుపుకోవాలంటే తప్పనిసరిగా ఆరు స్థానాల్ని సొంతం చేసుకోవాల్సిన అవసరం బీజేపీకి ఉంది. ఈ నేపథ్యంలో విపరీతంగా శ్రమించారు కమలనాథులు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న యడ్డి సర్కారు అతి తక్కువ మెజార్టీతో కొనసాగుతోంది. ఆ ప్రభుత్వం మనుగడ కొనసాగాలంటే ఆరు స్థానాల్లో గెలుపు తప్పనిసరి. అయితే.. ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత సర్వే సంస్థలన్ని బీజేపీ అత్యధిక స్థానాల్ని సొంతం చేసుకుంటుందన్న అంచనాల్ని వెల్లడించారు. పది నుంచి పన్నెండుస్థానాలు బీజేపీ ఖాతాలో పడే వీలుందన్న సర్వే అంచనాలకు తగ్గట్లే తాజాగా వెల్లడవుతున్న అధిక్యత ఉందని చెప్పాలి.
కాంగ్రెస్ - జేడీఎస్ కు చెందిన 17 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసిన తర్వాత కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవటం తెలిసిందే. స్పీకర్ తీసుకున్న చర్యతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 225 నుంచి 208కి తగ్గింది. దీంతో 105 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వేటు పడిన ఎమ్మెల్యేల స్థానాల్ని ఆర్నెల్ల లోపు భర్తీ చేయాలనే నిబంధన నేపథ్యంలో పదిహేను స్థానాల్లో తాజాగా ఉప ఎన్నికలు జరిగాయి.
వీటిల్లో కనీసం ఆరు స్థానాల్ని బీజేపీ సొంతం చేసుకుంటే యడ్డి ప్రభుత్వం నిలబడుతుంది. ఈ ఉదయం ఓట్ల లెక్కింపు మొదలయ్యాక వెలువడుతున్న ఓట్లు లెక్కింపు అధిక్యతను చూస్తే.. బీజేపీ 10 స్థానాల్లో ముందంజలో ఉంది. దీంతో..సర్వే అంచనాలు నిజమయ్యాయని చెప్పక తప్పదు.