తెలిసొచ్చిందా.. తెలివొచ్చిందా?

August 13, 2020

జగన్‌కు ముఖం చాటేసిన అమిత షా
అపాయింట్‌మెంట్‌ ఇచ్చి మరీ రద్దు
మారిన బీజేపీ పెద్దల వైఖరి?
వైసీపీ ఏడాది పాలనపై
ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
పేదల స్థలాల నుంచి
దేవుడి భూముల దాకా స్వాహా
తిరుమల వ్యవహారాలతో
రంగంలోకి ఆర్‌ఎస్‌ఎస్‌
దానివల్లే జగన్‌ను కలవని షా


టీడీపీ అధినేత చంద్రబాబుపై దుగ్ధతో వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని చేరదీసి.. నవ్యాంధ్రలో సొంత పార్టీని సైతం పణంగా పెట్టి.. వైసీపీ గెలుపులో కీలక భూమిక పోషించిన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత షాలకు వాస్తవ పరిస్థితులు తెలిసొచ్చాయా..? జగన్‌ తీరును చూసి తెలివి తెచ్చుకున్నారా..? తాజా పరిణామం చూస్తే ఇది నిజమేననిపిస్తోంది.

 

బీజేపీ రాష్ట్ర నేతలను పూచికపుల్లల కింద జమకడుతూ.. బీజేపీ అగ్రనాయకత్వానికి వారి కంటే తామే దగ్గరని కాలుదువ్వుతున్న జగన్‌, విజయసాయిరెడ్డిలకు కేంద్ర పెద్దలు గట్టి షాకే ఇచ్చారు. జగన్‌కు అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్లే ఇచ్చి అమిత షా చివరి నిమిషంలో రద్దుచేసేశారు. జగన్‌కు అన్నీ తానై సీఎం కార్యాలయంలో చక్రం తిప్పుతున్న కీలక అధికారి బిత్తరపోయారు. దీనివెనుక ఎవరున్నారో తెలియక విజయసాయి సైతం సతమతమయ్యారు.

 

వారికి అత్యంత సన్నిహితుడైన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావుకు నిజం తెలిసినా చెప్పలేదు. ఎందుకిలా జరిగిందని తర్జనభర్జన పడుతుంటే.. వైసీపీ నాయకత్వానికి కొన్ని సత్యాలు తెలిశాయి. జగన్‌ ఏడాది పాలనపై కేంద్ర పెద్దలు ఏ మాత్రం సంతృప్తిగా లేరు. మిత్రుడిగా ఉన్న చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లూ నిధులివ్వకుండా మోదీ-షా సతాయించారు.

 

అవసరమున్నా లేకున్నా యుటిలిటీ సర్టిఫికెట్లు అడగడం.. వాటిని ఇచ్చినా ఇవ్వలేదంటూ పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు, జీవీఎల్‌ వంటి వారితో ఎన్నికలముందు గోబెల్స్‌ ప్రచారం చేయించారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక యూసీలు అడుగుతున్నారో లేదో తెలియదు గానీ.. నిధులు మాత్రం ధారాళంగా విడుదల చేస్తున్నారు.

 

కానీ వాటిని వైసీపీ నేతలు దోచేస్తున్నారని మొదటి మూడు నెలల నుంచే బీజేపీ రాష్ట్ర నేతలలు నెత్తీనోరూ మొత్తుకుంటున్నా.. మోదీ-షా వినిపించుకోలేదు. దీనికి ప్రధాన కారణమే ఉంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రలో బీజేపీ అధికారం కోల్పోవడం, దీనివల్ల రాజ్యసభలో వైసీపీ సభ్యుల అవసరం తప్పనిసరి కావడంతో జగన్‌ ఏం చేసినా చూసీచూడనట్లు ఊరుకున్నారు.


ఎడాపెడా దోపిడీ..
జగన్‌ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పరిపాలనంతా రివర్సే. రివర్స్‌ టెండరింగ్‌ పేరిట తనకు నచ్చిన కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టడం, ఉపాధి నిధులను దారి మళ్లించడం, సహజ వనరుల దోపిడీకి శ్రీకారం చుట్టడం మొదలెట్టారు. తుగ్లక్‌లా రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మార్చాలనుకున్నారు. కర్నూలును కూడా మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు.

 

అయినా మోదీ-షా జగన్‌ను వారించలేదు. బీజేపీ రాష్ట్ర నేతలు పెద్దఎత్తున వ్యతిరేకించినా.. షా ప్రోద్బలంతో జీవీఎల్‌ రంగంలోకి దిగి రాజధాని ఏర్పాటు రాష్ట్రప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందని.. కేంద్రానికి సంబంధం లేదని వాదించారు. ఓపక్క తమ రాష్ట్ర నేతలు వైసీపీ దుర్మార్గ పాలనపై ఉద్యమిస్తుంటే... విజయసాయి ఇచ్చే ముడుపులు తీసుకుంటూ ఢిల్లీలో జీవీఎల్‌ వారికి అండగా నిలబడుతున్నారు.

 

ఇదే సమయంలో వైసీపీ నేతలు భూముల దోపిడీకి తెరలేపారు. ఇందులో భాగంగా దేవాలయ భూములపైనా కన్నేశారు. సింహాచలం, శ్రీశైలం భూముల కబ్జాను ప్రారంభించారు. చివరకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి తమిళనాడులో ఉన్న భూములను విక్రయించేందుకు కూడా సిద్ధపడడంతో రాషీ్ట్రయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) రంగప్రవేశం చేసింది.

 

రాష్ట్రంలో యథేచ్ఛగా క్రైస్తవ మతప్రచారం జరుగుతోందని.. తిరుమల కొండపైన, శ్రీశైలం ఆలయ పరిసరాల్లో సైతం ఇది జరుగుతోందని సంఘ్‌ ఏడెనిమిది నెలలుగా ఆందోళన చేస్తోంది. అయినా జగన్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. తిరుమల భూముల విక్రయం వ్యవహారం యావద్దేశం దృష్టికి రావడంతో రాష్ట్రంలో ఏం జరుగుతోందనేది సంఘ్‌ పూర్తిగా ఆరా తీసింది. రాష్ట్ర నేతల ఉద్యమానికి మద్దతు పలికింది.


స్థానిక ఎన్నికల్లో అక్రమాలు..
స్థానిక సంస్ధల ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ అభ్యర్థులపై అధికార పార్టీ దాడులు, దౌర్జన్యాలు; నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం.. ఆడా మగా అని కూడా చూడకుండా కిడ్నాపులు చేయడం వంటి అరాచకాలకు వైసీపీ పాల్పడింది. కరోనా కారణంగా స్థానిక ఎన్నికలను వాయిదావేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను తొలగించడానికి ఏకంగా ఆర్డినెన్సే తెచ్చింది.

 

ఆర్డినెన్సులోని గుణదోషాలను గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పరిశీలించనే లేదు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న కమిషనర్‌ను తొలగించే అధికారం రాష్ట్రానికి లేదని తెలిసినా గుడ్డిగా ఆమోదించేశారు. ఎంతో అనుభవజ్ఞుడైన ఆయన కూడా ఇలా చేయడాన్ని బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. కమిషనర్‌ తొలగింపును వ్యతిరేకిస్తూ.. తమ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అనుమతితో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

 

నిమ్మగడ్డ, టీడీపీ నేత వర్ల రామయ్య సైతం పిటిషన్లు దాఖలు చేశారు. ప్రభుత్వం తీరుపై హైకోర్టు మండిపడింది. నిమ్మగడ్డ తొలగింపు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. దీనిపై సుప్రీంకోర్టులో సవాల్‌ చేయాలని నిర్ణయించుకున్న జగన్‌.. అమితషాతో ఈ విషయం చర్చించేందుకు ఢిల్లీ పర్యటన తలపెట్టారు. ఆయన అపాయింట్‌మెంట్‌ అడిగారు.

 

ఈ నెల 2వ తేదీ రాత్రి అపాయింట్‌మెంట్‌ లభించింది. ఆ వెంటనే సంఘ్‌ రంగంలోకి దిగింది. ఏడాదిలోనే సర్వభ్రష్టత్వం పట్టిన వ్యక్తితో మంతనాలేంటని షాను నిలదీసింది. ఒక్క సంవత్సరంలోనే ఇంతగా దిగజారిన ప్రభుత్వం లేదని.. జగన్‌ నిర్వాకాలపై ఓపక్క బీజేపీ నేతలు పోరాడుతుంటే కేంద్రంలో అత్యున్నత స్థాయిలో ఉన్న మీరే ఆయనతో రాసుకుపూసుకు తిరిగితే ప్రజలకు ఎలా సంకేతాలు వెళ్తాయని ప్రశ్నించింది.

 

అప్పటికే జేపీ నడ్డాకు రాష్ట్ర నేతలు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి రాష్ట్ర నేతలు కృషిచేస్తుంటే.. వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా జీవీఎల్‌ వ్యవహరిస్తున్నారని.. ఇప్పుడు షా గనుక జగన్‌ను కలిస్తే రాష్ట్ర ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని నడ్డా కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సంఘ్‌ ఉద్దేశం అవగతమవడం.. పైగా మధ్యప్రదేశ్‌ మళ్లీ బీజేపీ ఏలుబడిలోకి రావడం, రాజఽస్థాన్‌ కాంగ్రెస్‌లో లుకలుకలు.

 

మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్‌ మధ్య సిగపట్లు, వైసీపీ మద్దతు లేకున్నా రాజ్యసభలో ఇబ్బంది ఉండదని తేలిపోవడంతో జగన్‌కు షా ముఖం చాటేశారు. చేసేది లేక జగన్‌ పర్యటనను మానుకున్నారు.


కీలక అధికారి అతి చేష్ఠలు..
నిజానికి నిమ్మగడ్డ అంశంపె చర్చించడానికే జగన్‌ ఢిల్లీ వెళ్లాలనుకున్నారు. ఇదే సమాచారాన్ని కేంద్రానికి పంపించారు. పోలవరం కోసమైతే ప్రొటోకాల్‌ ప్రకారం తొలుత జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కలుసుకోవాలని ఓ అధికారి అన్నప్పుడు.. జగన్‌ స్థాయి వ్యక్తి అందరు మంత్రులనూ కలుసుకోరని, నేరుగా అమిత్‌ షాకే విన్నవిస్తారని సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ అన్నట్లు తెలిసింది.

 

షెకావతను కలవకున్నా నిధులు వాటంతట అవే వచ్చేస్తాయని విజయసాయిరెడ్డి కూడా చెప్పారని బీజేపీ వర్గాలకు తెలిసింది. ఇది షెకావత్‌ దృష్టికీ వచ్చింది. షా రెండో తేదీ రాత్రి అపాయింట్‌మెంట్‌ ఇచ్చినందున.. ఈలోపు జలశక్తి మంత్రిని కలవాలని జగన్‌ భావించారు. అపాయింట్‌మెంట్‌ అడిగితే షెకావత కుదరదని తేల్చిచెప్పారు.

 

ఈ పరిస్థితుల్లో బీజజేపీ రాష్ట్ర నేతలు కూడా అంతర్గత నివేదిక పంపారు. రాష్ట్రంలో రాజకీయ వివాదాలు తలెత్తినప్పుడల్లా.. మోదీనో, షానో కలుసుకుని వారి ఆశీస్సులు తనకున్నట్లు  చెప్పుకోవడం జగన్‌కు పరిపాటైందని.. అడిగినప్పుడల్లా ఆయనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం సరికాదని వారు అందులో అసంతృప్తి వ్యక్తంచేశారు.

 

కేంద్రం తమకు పూర్తి మద్దతిస్తోందన్న ధోరణిలో విజయసాయిరెడ్డి తరచూ మాట్లాడుతుండడం.. కేంద్ర పెద్దలను కలిశాక వారంతా సంపూర్ణంగా తమతోనే ఉన్నట్లు అంతర్గత సమావేశాల్లో చెబుతున్నారని కూడా రాష్ట్ర నేతలు తెలియజేశారు.

 

రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావాలన్న వ్యూహానికి ఇది ఏ మాత్రం మంచిది కాదని సంఘ్‌ కూడా తేల్చిచెప్పడంతో షా మనసు మార్చుకున్నారని బీజేపీ వర్గాలు తెలియజేశాయి.