”ఏదైనా చేయండి… చంద్రబాబు ఓడిపోవాలంతే”

May 27, 2020

చంద్ర‌బాబు భ‌యం అటు బీజేపీలో, కేసీఆర్‌లో చాలా తీవ్రంగా ఉన్న‌ట్టు ఇటీవ‌ల జ‌రుగుతున్న అనేక ప‌రిణామాల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. తెలంగాణ‌లోనే గాని, ఆంధ్ర‌లో గాని బీజేపీ కొత్త చ‌రిత్ర‌ను సృష్టిస్తోంది. చ‌రిత్ర‌లో ఏ రాజ‌కీయ పార్టీ ప్ర‌వ‌ర్తించ‌ని విధంగా అధికారంలో ఉన్న ఒక జాతీయ పార్టీ మ‌రో ప్రాంతీయ ఓట‌మి కోసం త‌న స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డ‌టం అనేది చ‌రిత్ర‌లో ఏకైక సంఘ‌ట‌న‌. ఇంత‌కాలంలో తెలంగాణ‌లో త‌న వేషాలు వేసిన బీజేపీ ఇపుడు ఏపీలో మొద‌లుపెట్టింది. ఒక‌టే అజెండా… *ఏదైనా చేసి బాబును ఓడించాలి*.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమే లక్ష్యంగా ఆ పార్టీ పనిచేయబోతోంది. తమకు ఒక్క సీటు కూడా రాకపోయినా ప‌ర్లేదు, డిపాజిట్లు రాక‌పోయినా ప‌ర్లేదు. ప‌రువు పోయినా ప‌ర్లేదు. కానీ చంద్రబాబు మాత్రం ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఈసారి గెల‌వ‌కూడ‌దు. దీనికోసం వ్యూహాలు మాత్ర‌మే కాదు, ఎంత ఖ‌ర్చు పెట్ట‌డానికి అయినా ఆ పార్టీ సిద్ధంగా ఉంది. అవ‌స‌ర‌మైతే జ‌గ‌న్ కు అన్నిర‌కాల ఆర్థిక‌, రాజ‌కీయ సాయాలు చేసి చంద్ర‌బాబును ఓడించే అస్త్రంలా వాడుకోవాల‌ని… అందుకే జ‌గ‌న్ బ‌లం స‌రిపోతుందో లేదో అన్న అనుమానంతో బీజేపీ త‌న శ‌క్తిని జ‌గ‌న్ కు ధార‌పోస్తోంది. ఇదేమీ ఆషామాషీ గాసిప్ కాదు… బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీ బీజేపీ నేతలకు గట్టిగా చెప్పినట్లు అందిన విస్వ‌స‌నీయ‌ సమాచారం. 

ఈ మ‌ధ్య‌నే అమిత్ షా ఉత్తరాంధ్ర టూరుకు వ‌చ్చారు. జిల్లాల్లో ఆయ‌న‌కు తీవ్ర నిరసనలు ఎదుర‌య్యాయి. ఏపీలో బీజేపీ బస్సు యాత్రను పలాస నుంచి ప్రారంభించడానికి అక్కడ ఏర్పాటు చేసిన సభకు జ‌నం ఎవ్వ‌రూ రాక‌పోవ‌డంతో అమిత్ షా స‌భ ర‌ద్దు చేసుకున్నారు. ఒక అధికార జాతీయ పార్టీకి త‌ర‌లించ‌డానికి కూడా జ‌నం దొర‌క‌ని ప‌రిస్థితి ఉన్నాఆ అవ‌మానాలు దిగ‌మింగుకుని మ‌రీ చంద్ర‌బాబుపై క‌క్ష క‌డుతోంది బీజేపీ. పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శివాజీ అనూహ్యంగా వేసిన వ్యూహాల‌తో బీజేపీ టూర్ అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడి స‌భ‌కు వ‌చ్చిన కార్య‌క‌ర్త‌ల సంఖ్య మూడు వంద‌లు దాట‌లేదంటే… ఎవ‌రికీ న‌మ‌శ‌క్యం కాదు. కానీ ఇది ప‌చ్చినిజం. ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌తో బాబుపై కోపం వారికి మ‌రింత పెరుగుతోంది. ఇప్ప‌టికే మోడీ చంద్ర‌బాబుపై ర‌గిలిపోతున్నారు. తాజా ఘ‌ట‌న‌ల‌తో మోడీకి మించి బాబుపై ప‌గ పెంచుకుంటున్నారు అమిత్ షా. గురువారం రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా వీడియో కాన్ఫరెన్సు ఏర్పాటుచేశారట‌. అందులో ఆయ‌న ఇచ్చిన పిలుపు ఏంటో తెలుసా… పోలింగ్ బూత్‌లెవెల్ వ‌ర‌కు ప్ర‌తి ఊరిలో ప్ర‌తి బీజేపీ కార్య‌క‌ర్త‌కు ఈ స‌మాచారం చేరాలి. బాబు ఓట‌మే మ‌న ల‌క్ష్యం అని పిలుపునిచ్చార‌ట‌…. బాబా మ‌జాకా.