అమిత్ షాకు కరోనా !... అద్భుతమైన ఛాన్స్ మిస్ !!

August 14, 2020

భారతదేశపు హోంశాఖ మంత్రి అమిత్ షా కు కరోనా సోకింది. రెండ్రోజులుగా స్వల్పంగా ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో ఆయన స్వయంగా దీని గురించి ట్విట్టరు ద్వారా వెల్లడించారు.

నాకు కరోనా సోకింది. లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయి. నేను త్వరగా కోలుకుంటాను. వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరుతున్నాను. దయచేసి ఇటీవల నన్ను కలిసిన వారు పరీక్షలు చేయించుకోండి. ఫలితాలు వచ్చేవరకు ఐసోలేషన్లో ఉండండి అని అమిత్ షా ట్వీట్ చేశారు.

అమిత్ షా ట్వీట్ వేసిన వెంటనే బీజేపీ శ్రేణులు కంగారు పడ్డాయి. వరుసగా ప్రముఖులు కరోనా బారిన పడటం, నిన్న బీజేపీ మాజీ మంత్రి మాణిక్యాల రావు చనిపోవడం, ఈరోజు యూపీ విద్యా మంత్రి కమల్ రాణి కరోనాతో చనిపోవడం.. తాజాగా అమిత్ షాకు కరోనా సోకడం బీజేపీలో కలకలం రేపింది.

అమిత్ షాకు కరోనా వైరస్ విషయం తెలిసిన వెంటనే బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి స్పందించారు. ‘అమిత్ షాకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసి చాలా బాధించింది. ఆయన త్వరగా కోలుకోవాలి.’ అని సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా... అమిత్ షా అయోధ్య రామాలయం భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంది. ఆయనకు ఈ పూజాకార్యక్రమానికి ఆతిథ్యం అందింది. అంతలోపు ఆయనకు కరోనా పాజిటవ్ రావడంతో ఆస్పత్రికి పరిమితం కానున్నారు. ఆయనకు ఇష్టమైన ఓ మహాఘట్టానికి ఆయన ఆరోగ్యకారణాల వల్ల మిస్ కావడం సంచలనం.