అమితాబ్, అభిషేక్ బచ్చన్‌లకు కరోనా

August 07, 2020

బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ను శనివారం రాత్రి ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చేర్చారు.
అమితాబ్ బచ్చన్ కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.
అమితాబే స్వయంగా ఈ విషయాన్ని ప్రజలకు వెల్లడించారు.
ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 

కాగా అమితాబ్ కుమారుడు, ఐశ్వర్యరాయ్ భర్త అయిన అభిషేక్ బచ్చన్‌కు కూడా కరోనా సోకింది. అమితాబ్‌కు కరోనా పాజిటివ్ రావడంతో కుటుంబసభ్యులందరికీ పరీక్షలు చేయగా అభిషేక్‌కు పాజిటివ్‌గా తేలింది.

ఐశ్వర్య రాయ్‌కు సంబంధించిన ఫలితం ఇంకా రావాల్సి ఉంది.

‘‘నాకు కోవిడ్ -19 టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. దాంతో నన్ను ఆసుపత్రిలో చేర్చారు. నా కుటుంబ సభ్యులు, సిబ్బందికీ కరోనా పరీక్షలు జరిపారు. వారి ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. గత పది రోజుల్లో నాకు సమీపంగా మెలిగినవారరు ఎవరైనా కోవిడ్ పరీక్ష చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను’’ అని ఆయన ట్వీట్ చేశారు.

కాగా అమితాబ్ త్వరగా కోలుకోవాలంటూ సినీ పరిశ్రమ నుంచి స్పందనలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా అమితాబ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.