అమేజాన్‌లో ఆయన సినిమానా.. ఇది అన్యాయం

August 07, 2020

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో పేరున్న సినిమాల డైరెక్ట్ రిలీజ్ దిశగా పెద్ద ముందడుగు పడ్డట్లే. అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద స్టార్, ఆయుష్మాన్ ఖురానా లాంటి సూపర్ ఫామ్‌లో ఉన్న హీరో కలిసి నటించిన ‘గులాబో సితాబో’ సినిమాకు థియేట్రికల్ రిలీజ్ లేకుండానే నేరుగా అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేసేస్తున్నారు. సూజిత్ సిర్కార్ రూపొందించిన ఈ చిత్రం జూన్ 12న ప్రైమ్‌లో రిలీజ్ కాబోతోంది.

ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. పెద్ద స్టార్ కాస్ట్, క్రూ ఉన్న ఈ స్థాయి సినిమాను అమేజాన్ ప్రైమ్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ చేస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. మరోవైపు నవాజుద్దీన్ సిద్ధిఖి ప్రధాన పాత్రలో నటించిన ‘గూమ్ కేతు’ చిత్రాన్ని జూన్ 22న జీ 5లో డైరెక్ట్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ సినిమా ‘లక్ష్మీ బాంబ్’ సైతం నేరుగా హాట్ స్టార్‌లో రిలీజవుతుందని వార్తలొచ్చిన సంగ‌తి తెలిసిందే.
ఇలాంటి పెద్ద సినిమాల్ని ఆన్ లైన్లో డైరెక్ట్‌గా రిలీజ్ చేస్తే థియేట‌ర్ల సంగ‌తేంటి అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. ఇప్ప‌టికే మామూలు రోజుల్లో థియేట‌ర్ల మ‌నుగ‌డ క‌ష్టంగా మారుతోంది. అలాంటిది లాక్ డౌన్ దెబ్బ‌కు అవి పూర్తిగా మూత‌ప‌డ్డాయి. ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియ‌దు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ విజృంభిస్తున్నాయి. థియేట‌ర్ల ప్రేక్ష‌కుల్ని త‌మ వైపు లాగే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో గులాబో సితాబో సినిమాను అమేజాన్‌లో రిలీజ్ చేయ‌డం ప‌ట్ల ఐనాక్స్ థియేట‌ర్ల ఛైన్ యాజ‌మాన్యం తీవ్ర ఆవేద‌న వెళ్ల‌గ‌క్కుతూ ఓ ప్రెస్ నోట్ ఇచ్చింది. థియేట‌ర్ల‌కు, సినిమాల‌కు ద‌శాబ్దాలుగా అవినాభావ సంబంధం ఉంద‌ని, అస‌లు సినిమా తీసేదే థియేట్రిక‌ల్ రిలీజ్ కోసమ‌ని.. సినిమా చూడ‌టంలో థియేట‌ర్లు ఇచ్చే అనుభూతే వేర‌ని.. ప్ర‌స్తుత గ‌డ్డు ప‌రిస్థితుల్ని అధిగ‌మించే వ‌ర‌కు ఎదురు చూడ‌కుండా, థియేట్రిక‌ల్ రిలీజ్‌ను విస్మ‌రించి నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫాంలో రిలీజ్ చేయ‌డం స‌మంజ‌సం కాద‌ని ఆ సంస్థ అభిప్రాయ‌ప‌డింది. ఈ విష‌యంలో ఫిలిం మేక‌ర్లు పున‌రాలోచించాల‌ని ఆ సంస్థ కోరింది.