స‌ర్ ప్రైజ్: ఆ బెంజ్ కారుని మీరూ కొనొచ్చు

August 14, 2020

అమ్మ‌కానికో బెంజ్ కారు వ‌చ్చింది. అది కూడా ఓఎల్ ఎక్స్ లో! ఏంటండి.. మీరెప్పుడూ ఓఎల్ ఎక్స్ చూడ‌రా? ఏది ప‌డితే అది రాసేస్తారా? అన్న అగ్ర‌హం అక్క‌ర్లేదు. ఎందుకంటే.. ఆ పాత బెంజ్ కారు రోటీన్ కు కాస్త భిన్నం. దాని హిస్ట‌రీ తెలిస్తే స‌ర్ ప్రైజ్ కావ‌టం ఖాయం.
ఇంత‌కీ ఆ కారు ప్ర‌త్యేక‌త ఏమంటే.. అది బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ వాడిన కారు. దాన‌ని ఇప్పుడు ఓఎల్ ఎక్స్ లో అమ్మ‌కానికి పెట్టారు. ఎస్ క్లాస్ కారును రూ.9.99ల‌క్ష‌ల‌కు అమ్మ‌కానికి పెట్టిన‌ట్లుగా ఓఎల్ఎక్స్ వెల్ల‌డించింది. మిగిలిన కార్ల‌కు భిన్నంగా.. ఈ కారు ప్ర‌త్యేక‌త‌ల్లో ఇది అమితాబ్ వాడిన కార‌ని.. ఆయ‌న నుంచి మ‌రో వ్య‌క్తి దీన్ని కొనుగోలు చేశార‌ని.. ఈ కార‌ణంగా దాని ధ‌ర‌ను రూ.9.99 ల‌క్ష‌లు పెట్టిన‌ట్లుగా సంస్థ‌ పేర్కొంది.
మార్కెట్ లో ఎస్ క్లాస్ మెర్సిడెజ్ బెంజ్ కారు ధ‌ర రూ.1.36 కోట్లుగా ఉంది. కానీ.. ఈ కారు మాత్రం రూ.9.99ల‌క్ష‌ల‌కు అమ్మ‌కానికి పెట్టిన‌ట్లుగా వెల్ల‌డించారు. అమితాబ్ వాడిన కారు అని తెలియ‌టంతో దీన్ని కొనేందుకు ప‌లువురు ఆస‌క్తిని చూపిస్తున్న‌ట్లుగా ఓఎల్ ఎక్స్ పేర్కొంది. అమితాబ్ గ్యారేజ్ లో ఏదైనా కొత్త మోడ‌ల్ కారు చేరితే.. పాత‌వాటిల్లో అతి పాత కారును అమ్మేయ‌టం ఒక అల‌వాటుగా బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి.. బిగ్ బి వాడిన కారును ఎవ‌రు సొంతం చేసుకుంటారో చూడాలి.