అమ్మ జగనన్నా..! ఆయన్ని ఇలా కూర్చోబెట్టా‌రా..?

August 15, 2020

◆ కొత్త కమీషనర్ కథ వెనుక..!
◆ చక్రం తిప్పిన నాటి ఐఏఎస్ ఎవరు.?
◆ తమిళ, ఏపీ జీఓల వెలికితీత
◆ 'కరోనా' కంటే ఫాస్ట్


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా తనను నియమిస్తున్నారని రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ కు ఎప్పుడు సమాచారం వెళ్లింది? ఆయన దానికి అంగీకారం ఎప్పుడు తెలిపారు? కరోనా 'క్వారంటైన్' సమయంలో ఆయన రాష్ట్ర సరిహద్దులు దాటి తిరుపతికి ఎలా వచ్చారు.? అక్కడి నుంచి విజయవాడ ఎప్పుడు చేరుకున్నారు.? ఆర్డినెన్స్ రూప కల్పన ఎప్పుడు.? మొత్తం వ్యవహారంలో చక్రం తిప్పిన నాటి ఐఏఎస్ ఎవరు.? అయనకు సహకరించినది ఎవరు.? అత్యంత రహస్యంగా జీఓలు ఎందుకు ఇచ్చారు.? కేవలం ఏడు గంటల వ్యవధిలో ప్రక్రియ వేగంగా పూర్తి. ఇప్పుడు ఇలాంటి అంశాలు చాలా 'కీలకం'గా మారాయి

అసలేం జరిగింది..?:
అత్యంత గోప్యంగా అంతే వేగంగా క్షణాల్లో ఫైలు కదలడం చూస్తే 'వింత'ను చూసిన అనుభూతి. రాష్ట్ర ప్రభుత్వం 'డాక్టర్. నిమ్మగడ్డ రమేష్ కుమార్'ను వదిలించు కోవడానికి... 'జస్టిస్ కనగరాజ్'ను తెచ్చుకోవడానికి ఎంతో 'ప్లాన్' చేసుకుంది. ఈ నెల 9వ తేదీ ఆర్డినెన్సు రూపొందించడం మొదలు పెట్టినప్పటి నుంచి 11వ తేదీ ఉదయం 11.30కి జస్టిస్ కనగరాజ్ ప్రమాణ స్వీకారం చేసే వరకూ క్షణ క్షణం అత్యంత ఉత్కంఠభరితంగా, వేగంగా 'కథ' నడిచింది. ఎక్కడా ఒక్క క్షణం కూడా వృధా కాకుండా.. చేయకుండా.. ఆగమేఘాలపై ఫైళ్లు 'యమ స్పీడ్'గా నడిచాయి. కాదు జగనన్న నడిపించారు.

ముందుగా 'ఆర్డినెన్సు' విషయం చూద్దాం..:
విషయానికి వస్తే ఈ నెల 9న మధ్యాహ్నం 12.23కు ఎన్నికల కార్యాలయంలో మొదలైన ఫైలు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వద్దకు చేరింది. ఆయన దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ.. ఆ తర్వాత మంత్రి, నెక్ట్స్ ముఖ్యమంత్రి వద్దకు తిరిగి పంచాయితీరాజ్ సెక్రటరీకి చేరడానికి కేవలం ఏడు గంటలు పట్టింది.

2గంటల్లో.. గవర్నర్ వద్దకు.!:
అక్కడ నుంచి మరో రెండు గంటల్లో ఈ ఆర్డినెన్స్ 'దస్త్రాల సంకలనం' అంతా పూర్తి చేసుకుని గవర్నర్ వద్దకు చేరింది.

మధ్యాహ్నం.. క్లియర్:
రాత్రి 10 గంటలకు గవర్నర్ వద్దకు చేరగా దాన్ని ఆయన మధ్యాహ్నం రెండు గంటలకల్లా క్లియర్ చేశారు. రెండున్నర కల్లా ఆర్డినెన్సు వచ్చేసింది.

రహస్యంగా..!:
'ఇదే విచిత్రం' అనుకుంటే కొత్త ఎన్నికల కమిషనర్ ను నియమించడం కూడా ఇంత కన్నా వేగంగా జరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత రహస్యంగా, వేగంగా మరో ఫైల్ కదలలేదని తెలిసింది.

ఇంకా 'ఫాస్ట్' గా..:
10వ తేదీ మధ్యాహ్నం 3.29కి అధికారులు సబంధిత ఫైలు రెడీ చేయడం మొదలు పెట్టారు. సాయంత్రం 4 గంటల కల్లా గవర్నర్ కు చేరింది. 11వ తేదీ ఉదయం 8.54కు ఫైలు ముఖ్యమంత్రికి చేరింది. 9.01 కల్లా మూడు నాలుగు అంచెలు దాటి పంచాయితీరాజ్ కార్యరద్శికి 9.01కి చేరింది. తక్షణమే ఆర్డినెన్సు విడుదల. 11.30 కల్లా జస్టిస్ కనగరాజ్ ప్రమాణ స్వీకారం.

ఇవి ఎప్పుడూ అడక్కు..?:
జస్టిస్ కనగరాజ్ చెన్సైలో ఉంటారు. ఆయన అక్కడ నుంచి విజయవాడ వరకూ ఎప్పుడు వచ్చారు? ఎలా వచ్చారు? లాక్ డౌన్ నిబంధనలు లేకపోతే వేరే విషయం కానీ లాక్ డౌన్ నిబంధనలు ఉండగా ఆయన ఎలా వచ్చారు?

అంబులెన్స్ లో వచ్చారా..?:
జస్టిస్ కనగరాజ్ ను తిరుమల తిరుపతి దేవస్థానం అంబులెన్సులో తీసుకు వచ్చినట్లు తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. కానీ ఎవరూ ధృవీకరించ లేదు. అలా అని ఎవరూ ఖండించలేదు. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కొత్త ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్ ని నియమించినట్లు ఆదేశాలు అధికారికంగా ఇవ్వలేదు. అంటే అధికారిక సమాచారం లేకుండానే జస్టిస్ కనగరాజ్ విజయవాడ చేరుకున్నారు.

'టైం లాజిక్' జస్ట్ మిస్ ..?:
అంతా పక్కా ప్రణాళికతో జరిగిందే.! అయితే అందరూ ఈ 'టైం లాజిక్' మిస్సయ్యారు. న్యాయస్థానంలో వేసిన అఫిడవిట్లలో కూడా ఇది మిస్సయ్యారని తెలిసింది. గవర్నర్ జారీ చేసిన ఆర్డినెన్స్ ఉత్తర్వులకు.. జస్టిస్ కనగరాజ్ ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న సమయం... చెన్నై టు విజయవాడ సమయం
ఎంతో కీలకం. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ నియమించినట్లు ఇచ్చిన ఉత్తర్వుల సమయానికి ఎక్కడో చెన్నైలో ఉన్న జస్టిస్ కనగరాజ్ కరోనా కారణంగా వేగంగా గమ్యానికి చేర్చే విమానాలు లేవు. రోడ్డు మార్గమే ఓక్కటే దిక్కు. మరి జస్టిస్ కనగరాజ్ ఏ మార్గంలో విజయవాడకు చేరుకున్నారు. రాష్ట్ర సరిహద్దులు దాటి రావాలంటే.. 'క్వారంటైన్' ఇబ్బంది లేకుండా ఎలా చేరుకున్నారనేది... ప్రస్తుతానికే కాదు..భవిష్యత్తులో కూడా భేతాళ ప్రశ్నే.?

చక్రం తిప్పిన నాటి ఐఏస్..?:
ఈ వ్యవహారంలో జగనన్నకు మార్గనిర్థేశం చేసింది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ గా కూడా పనిచేసిన ఆయన నిక్కచ్చి మనిషి. పక్కాగా రూల్స్ తెలిసిన మనిషి అయనే రమాకాంత్‌రెడ్డి.! ఈ పక్కా ప్లాన్ ఓ 'షేప్' తీసుకురావటానికి జగన్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు కల్లం అజయ్ రెడ్డి ఉండనే ఉన్నాడుగా.! దటీజ ఎనఫ్.. అండ్ ఫినిష్.

తమిళనాడులో ఒకటి, ఏపీలో మరొకటి..:
ఇందుకోసం తమిళనాడులో 1994, జులై 7న విడుదల చేసిన జీఓ (ఎంఎస్) నెం.125 ప్రకారం అక్కడి ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవీకాలాన్ని రెండేళ్లకు కుదించింది. ఎన్నికల సంఘానికి సంబంధించి ఒక రాష్ట్రం తన పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేసుకుంటే సరిపోతోంది. ఈ ప్లాన్ ఫర్ ఫెక్ట్ గా రావడానికి ఆంధ్రప్రదేశ్‌లోనే మరొకటి దొరక బుచ్చుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ గా ఉన్న ఏవీఎస్ రెడ్డి పదవీకాలాన్ని పొడిగించాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడు చట్టాలన్నీ వడబోసి, జల్లెడ పట్టి… అప్పట్లోనే గవర్నర్‌తో ఆర్డినెన్స్ జారీ చేయించారు. ఐతే ఇక్కడ ప్రధానంగా న్యాయపరమైన చిక్కును తీసుకొచ్చే ఒక అంశం ఉంది… స్థానిక సంస్థల నోటిఫికేషన్ అమల్లో ఉన్నవేళ, అంటే ఎన్నికల ప్రక్రియ సాగుతూ ఉండగా… ఆల్‌ రెడీ పదవిలో ఉన్న కమిషనర్‌ కు ఈ చట్టంలోని మార్పు వర్తిస్తుందా.? లేదా..? అనేదే..! రాష్ట్ర ప్రభుత్వ, గవర్నర్ అధికారాలపై ఏ సందేహాలూ లేవు.! ఇదొక్కటే సమాధానం దొరకాల్సిన ప్రశ్న… కోర్టు ఏం చెబుతుందో ఆసక్తిగా చూడాల్సిన ప్రశ్న..!

అందుకే సీక్రసీ..:
టీడీపీ అండ్ కో, చంద్రబాబుకు న్యాయ వ్యవహారాల్లో మంచి పట్టుంది. నిమ్మగడ్డకు సంబంధించి ఏ అధికారిక కాగితం దొరికినా సరే, దాన్ని పట్టుకుపోయి కోర్టులో స్టే తెచ్చేసుకుంటారనే సందేహం..! అలా జరిగితే జగన్ నిర్ణయాలు అర్ధంతరంగా ఆగిపోతాయి. అందుకని కొత్త కమిషనర్‌ను నియమించి, తను వచ్చి ఆ పదవిలో చేరేదాకా గోప్యంగా ఉంచాలని అనుకున్నారు. అదే అమలు చేశారు. బట్ 'టైం లాజిక్' ఒక్కటే మిస్.

విచారణకు 'అవకాశం లేదు'..!:
ప్రభుత్వమే ఇవన్నీ చేసినందు వల్ల (?) ఇక విచారణ జరిపేందుకు అవకాశం లేదు. ఆ ఆశ కూడా లేదు.

హైకోర్టులో సోమవారం..:
హైకోర్టులో ఈ విషయాలను నిమ్మగడ్డ రమేష్ లేవనెత్తితే... కోర్టు జోక్యం చేసుకుంటే.. మరెన్నో విషయాలు వెలుగు చూస్తాయి. సోమవారం ఈకేసు హైకోర్టులో విచారణకు రానున్నది. మనం జస్ట్ ఉప్పు ఆందించాం అంతే.
ఓం నారదాయ నమః