అమ్మఒడి కోసం అప్పుల వేట

May 31, 2020


ఉద్యోగుల జీతాలూ దాని ఖాతాలోకే.
ఎస్సీ, కాపు కార్పొరేషన్‌ నిధులు కూడా..


రెవెన్యూ లోటు అపరిమితంగా ఉన్నా.. గత నాలుగేళ్లుగా సమర్థ ఆర్థిక నిర్వహణతో కేంద్ర శాఖల మెప్పు పొందిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ముఖ్యమంత్రిగా జగన్‌ వచ్చాక తిరోగమనంలో నడుస్తోంది. రాష్ట్రానికి ఆదాయమూ, ఆదాయ మార్గాలూ పెరగకపోయినా వేల కోట్ల అప్పులతో ఆదాయ లోటును పూడ్చుతున్నారు. వస్తున్న ఆదాయం ఆయన అమలు చేస్తున్న నవరత్నాలకే చాలడం లేదు. బ్యాంకులేమో అప్పులివ్వడం లేదు. దీంతో ఉద్యోగుల జీతాలపై ఆయన కన్నుపడింది. ఒకటో తారీఖును ఠంచనుగా పడే జీతాలు గత ఆరు నెలలుగా 21వ తేదీ వరకు అందని దుస్థితి నెలకొంది. అమ్మఒడి కోసం అప్పులు దొరక్కపోవడంతో చివరకు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు, కాపు, బీసీ కార్పొరేషన్లలో ఉన్న డబ్బంతా అటే మళ్లించేస్తున్నారు. 9వ తేదీన అమల్లోకి వచ్చిన అమ్మఒడి పథకం అమలు కోసం అప్పులు తేవడానికి జగన ప్రభుత్వం నానా యాతనలు పడింది. ఎక్కువ వడ్డీరేటు ఇచ్చేందుకు ముందుకొస్తున్నా.. బ్యాంకులు మాత్రం సందేహిస్తున్నాయి. 8.5 శాతం వడ్డీపై రూ.1,500 కోట్లు అప్పు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ఆంధ్రాబ్యాంకు చివరిలో రూ.900 కోట్లు మాత్రమే ఇస్తానని స్పష్టం చేసింది. ఇటీవల ప్రభుత్వం కొన్ని విద్యుదుత్పత్తి ప్రాజెక్టులను పవర్‌ ఫైనాన్స కార్పొరేషన(పీఎఫ్‌సీ)కు బదిలీ చేసింది. వీటన్నిటినీ పీఎఫ్‌సీ ఆస్తులుగా చూపి రూ.10 వేల కోట్ల రుణం సమీకరించాలని భావించింది. ఇందులో భాగంగానే పీఎఫ్‌సీకి రూ.1,500 కోట్లు అప్పుగా ఇచ్చేందుకు తొలుత ఆంధ్రాబ్యాంకు ముందుకొచ్చింది. కానీ పీపీఏల విషయంలో జగన్‌ ప్రభుత్వం చేసిన గొడవ.. హైకోర్టు ఆదేశించినా విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించకపోవడం దరిమిలా.. వెనక్కి తగ్గినట్లు తెలిసింది. ఆర్థిక శాఖలు పదే పదే బతిమాలడంతో చివరకు రూ.900 కోట్లయితే ఇవ్వగలమని చెప్పినట్లు సమాచారం. ఇదే సమయంలో మరో రూ.3,000 కోట్ల అప్పు కోసం ఇంకో బ్యాంకును ప్రభుత్వం ఆశ్రయించినా ఒప్పందం కుదరలేదు. ఈ పథకం అమలుకు రూ.6,000 కోట్ల నుంచి రూ.6,500 కోట్లు ఖర్చవుతాయని అంచనా. రైతు భరోసాకు ఇంకో రూ.2,500 కోట్లు కావాలి. అంటే 9 వేల కోట్ల వరకు కావాలి. ఇతరత్రా అవసరాలకు కూడా కలిపి రూ.10,000 కోట్లు అప్పు తెచ్చుకునేందుకు ఆర్థిక శాఖ బ్యాంకులతో తీవ్ర స్థాయిలో బేరసారాలు జరుపుతోంది.


ఓవర్‌డ్రాఫ్ట్‌కు మించిన వడ్డీ రేటు!
ఓవర్‌ డ్రాఫ్ట్‌(ఓడీ)కి వెళ్లడమే పెద్ద తప్పన్నట్లు భావిస్తున్న జగన్‌ ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల నుంచి తీసుకురావలనుకుంటున్న అప్పులపై ఓడీకి మించిన వడ్డీరేట్లు చెల్లించేందుకు సిద్ధమవుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓడీకి వెళ్లి నిధులు వాడుకుంటే రెపో రేటుపై 2 శాతం ఎక్కువ వడ్డీ చెల్లించాలి. ప్రస్తుతం రెపోరేటు 5.15 శాతంగా ఉంది. ఒకవేళ ఓడీకి వెళ్తే ఆ మొత్తంపై ఆర్థిక శాఖ 7.15 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ సంక్షేమ పథకాల అమలు కోసం బ్యాంకుల నుంచి ఏకంగా 8.5 శాతానికి ఆర్థిక శాఖ అప్పులు తేవాలని భావిస్తోంది. బ్యాంకులు సాధారణ ప్రజలకు గృహరుణాలను అంతకంటే తక్కువ వడ్డీరేటుకే అందిస్తున్నాయి. ఎక్కువ చెల్లించడానికి ఆర్థిక శాఖ అధికారులు ఒక కారణం చెబుతున్నారు. తీసుకుంటున్న అప్పులను ప్రభుత్వం సంక్షేమానికే వినియోగిస్తోంది కాబట్టి బ్యాంకులు అధిక వడ్డీరేట్లు విధిస్తున్నాయని.. అలా కాకుండా ఏదైనా సంపద/ఆస్తి సృష్టికి కోరితే బ్యాంకులు తక్కువ వడ్డీరేటుకే రుణాలిచ్చే అవకాశాలున్నాయని తెలిపారు.


సెక్యూరిటీల వేలానికి నో చాన్స్‌
భారతీయ రిజర్వుబ్యాంకు (ఆర్‌బీఐ) ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలు వేలం వేసి బహిరంగ మార్కెట్‌ నుంచి ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు ప్రభుత్వం రూ.29 వేల కోట్ల రుణాలు సమీకరించింది. ఈ రుణాలపై వడ్డీ 8 శాతం లోపే ఉంది. బడ్జెట్‌ గణాంకాల ప్రకారం.. బహిరంగ మార్కెట్‌ నుంచి ఇంకా రూ.3,300 కోట్ల వరకు అప్పు తెచ్చుకునే అవకాశం రాష్ట్రానికి ఉంది. కానీ, 14 ఆర్థిక కమిషనకు సంబంధించి ఇదే చివరి ఆర్థిక సంవత్సరం కావడంతో ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదని తెలుస్తోంది. గత ఐదేళ్లలో రాష్ట్రంలో చేసిన అప్పులు, జీడీపీలో వాటి వాటాను ఇప్పుడు కేంద్రం లెక్కిస్తుంది. ఒకవేళ ఆ అప్పుల మొత్తం జీడీపీలో 3 శాతానికి మించితే చివరి త్రైమాసికమైన జనవరి-మార్చిలో అప్పులు తెచ్చుకునేందుకు కేంద్రం అనుమతివ్వదు. రాష్ట్రప్రభుత్వం ఆ అప్పుల పరిమితి దాటేసినట్లు సమాచారం. అందుచేత నాలుగో త్రైమాసికంలో బహిరంగ మార్కెట్‌ నుంచి అప్పులు తెచ్చుకునే అవకాశమే ఉండదు. దీనివల్లే బ్యాంకుల నుంచి అధిక వడ్డీకే అప్పులు తెచ్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.


నిర్మలా సీతారామన్‌ దయతో..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దయతో పెను సంక్షోభం నుంచి జగన్‌ ప్రభుత్వం బయటపడింది. తాజాగా బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.7428 కోట్ల రుణం సమీకరించుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతించింది. జనవరి-మార్చి త్రైమాసికంలో ఈ అప్పులు వాడుకోవచ్చు. రూ.15,000 కోట్ల అప్పులు చేసేందుకు అనుమతి కోరుతూ డిసెంబరులో రాష్ట్రం కేంద్రానికి  లేఖ రాసింది. ప్రజా ఖాతా పద్దుల నుంచి ప్రభుత్వం చేస్తున్న ఖర్చులకు కారణాలు చెప్పాలని కేంద్రం కోరింది. ఆ వివరాలను రాష్ట్రం సమర్పించింది. అయినప్పటికీ 14వ ఆర్థిక సంఘానికి సంబంధించిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రం చేయగలిగే అప్పుల పరిమితి దాటిపోయింది. ఇక అప్పుల కోసం అనుమతి కష్టమేనని ఆర్థిక శాఖ అధికారులు భావించారు. కానీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన చొరవతో అప్పులు చేసుకునే వెసులుబాటు కలిగిందని సమాచారం. కొత్త అప్పుల కోసం కేంద్రం నుంచి 7వ తేదీ రాత్రి పొద్దుపోయాక అనుమతి రావడంతో రాష్ట్ర ఆర్థిక శాఖ హుటాహుటిన రూ.3,000 కోట్ల అప్పు కోసం అదేరోజు ఆర్‌బీఐని సంప్రదించినట్లు సమాచారం. మర్నాడు అధికారికంగా దరఖాస్తు పంపింది. రాష్ట్రం ఆర్‌బీఐని సంప్రదించే సమయానికే గడువు దాటిపోవడంతో ఆ రూ.3000 కోట్లు వస్తాయా రావా అనే సందిగ్ధం ఉంది.. సాధారణంగా ఆర్‌బీఐ ద్వారా బాండ్ల వేలం ద్వారా వారానికి కేవలం రూ.1000 కోట్ల రుణం మాత్రమే సమీకరించుకునే వెసులుబాటు ఉంది. ఏపీ విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రత్యేక చొరవ చూపినట్లు ఆర్‌బీఐ కూడా ప్రత్యేక చొరవ చూపించి మొత్తం రూ.3,000 కోట్లు ఇస్తుందో చూడాల్సి ఉంది..

అమ్మఒడి కార్యక్రమం 9నే ప్రారంభమైనా ఇంకా చాలా మంది తల్లుల ఖాతాలో డబ్బు జమకాలేదు. వారందరికీ ఒకేసారి కాకుండా నిధుల లభ్యతను బట్టి ఒక్కొక్కరి ఖాతాలో ఒక్కో సమయంలో జమచేస్తామని ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు.

RELATED ARTICLES

  • No related artciles found