అమరావతిపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన స్పీకర్

April 07, 2020

కుక్కను చంపాలంటే దాని మీద పిచ్చిది అనే ముద్ర వేయాలి. సేమ్ స్ట్రాటజీని అమరావతిపై ప్లే చేస్తోంది వైసీపీ. అమరావతిని ఆపేసిన రాష్ట్రంలో వ్యతిరేకంగా రాకూడదంటే... ముందు అమరావతిపై ఆశలు తగ్గించాలి, దానిని తక్కువ చేసి చూపాలి. అది మార్చినా ఏం పర్లేదు అని నిరూపించాలి.... వైసీపీ నేతలు ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నారు. 

అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని మార్పుపై జగన్ డిసైడైనట్లున్నారు. అంతదాకా ఎందుకు ఎన్నికల ముందే డిసైడయ్యారు. ఈ విషయాన్ని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు. కానీ మరి జనానికి అమరావతి వద్దనిపించిందో, పోలవరం వద్దనిపించిందో గాని జగన్ కే మద్దతు పలికారు. ఇపుడు చంద్రబాబు ప్రచారం చేసినట్టుగానే అమరావతిని టెక్నికల్ గా అలాగే ఉంచి అసలు రాధానిని మాత్రం వైజాగ్ కు మార్చేలా ప్లాన్ చేశారు ముఖ్యమంత్రి జగన్. దానికనుగుణంగా అధికారంలోకి వచ్చిననాటి నుంచి అమరావతిని పలుచన చేస్తూ వచ్చారు. స్వయంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణే అమరావతిని ’శ్మశానం’తో పోల్చారు. అది వివాదాస్పదం  అయ్యింది. తాజాగా ఏపీ స్పీకర్ కూడా అలాంటి కామెంట్లే చేశారు.

స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ అమరావతికి వెళ్తే రాజస్తాన్ వెళ్లిన ఫీలింగ్ ఉందన్నారు. కట్ట మీద వెళ్తుంటే... ఎంతదూరం వెళ్లినా రాజధాని కనిపించలేదన్నారు. రాజధాని అంటే నాది అని రాష్ట్ర ప్రజలంతా భావించాలని, అలాంటి ఫీలింగ్ అమరావతిలో కనిపించలేదన్నారు. చాలామందిది ఇదే అభిప్రాయం అని, వారు చెప్పడం లేదు, తాను చెబుతున్నాను అని తమ్మినేని వ్యాఖ్యానించారు.