ఫడ్నవిస్ భార్య సంచలనం... భవిష్యత్తును చెప్పిందా?

June 01, 2020

మెజార్టీ లేకుండా ముఖ్యమంత్రి పదవిని చేపట్టి.. నాలుగు రోజులకే సీఎం పదవికి రాజీనామా చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ వ్యవహారం తెలిసిందే. తన భర్తకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితికి తాను దన్నుగా నిలవాలని అనుకున్నారో లేక.. ఇంట్లో వారి మధ్య నడిచిన సంభాషణల సారాంశాన్ని తన భావోద్వేగ ట్వీట్ తో బయటపెట్టారో కానీ.. తాజాగా ఆమె ట్విట్టర్ లో చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. అందరి చూపు సదరు ట్వీట్ మీద పడుతోంది.
సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా చేసిన కొద్ది సేపటి తర్వాత ఆయన సతీమణి అమృతా ఫడ్నవీస్ ఒక ఉర్దూ కవితను ఉటంకిస్తూ పోస్టు చేశారు. ఆ ఉర్దూ కవితకు స్వేచ్ఛానువాదం చేస్తే.. సీజన్ మారనివ్వండి.. త్వరలోనే తిరిగి వచ్చి కొమ్మలపై పరిమళాల్ని వెదజల్లుతామని పేర్కొనటం గమనార్హం. చూస్తుంటే.. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కర్ణాటకలో ఎలా అయితే మేజిక్ చేశారో.. దాన్నే రిపీట్ చేస్తారా? అన్న సందేహం కలిగేలా ఆమె ట్వీట్ ఉండటం గమనార్హం.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. మహారాష్ట్ర ప్రజల్ని ఉద్దేశించి ఆమె ప్రస్తావిస్తూ..ప్రజల ప్రేమను తామెప్పడూ మరవలేమని.. గుర్తుంచుకుంటామని పేర్కొన్నారు. మొత్తంగా మహారాష్ట్ర రాజకీయాల్లో జరగబోయేది తన ట్వీట్ తో చెప్పకనే చెప్పేశారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.