ఆహా ఎంత భాగ్యం ఎంత భాగ్యం...

August 14, 2020

సీరియ‌ల్ అంటేనండి సీరియ‌లే. తెలుగు, త‌మిళం, హిందీ వంటి భాష‌ల‌తో సంబంధం లేకుండా ఎక్క‌డైనా ఒక‌టే ఫార్ములా. బోలేడు క‌ష్టాలు...ఊహించ‌లేని కుట్ర‌లు... అస‌హ్యం పుట్టించే రీతిలో ఆడ‌వాళ్ల పాత్ర‌ల మ‌ధ్య క‌క్ష‌లు-ప‌గ‌లు...జీవితంపై విర‌క్తి పుట్టించే అంత సాగ‌దీత‌...మ‌చ్చుకైనా క‌నిపించ‌ని హాస్యం, ఒక‌వేళ కామెడీ ఉంటే కుళ్లు జోకులు...ఇదే క‌దా? ఇలాంటివే మ‌హిళ‌లు చూస్తున్నార‌నేది నిజం!. పురుషులు సీరియల్ల మొహం కూడా చూడ‌ర‌నేది కఠోర స‌త్యం!! కానీ...మొగ‌వాళ్ల మ‌న‌సు దోచిన సీరియ‌ల్ ఒక‌టుండేది. ఆ సీరియల్ మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది.
ఔను. మొగాళ్లు కాలుమీద కాలువేసుకొని చూసే సీరియ‌ల్ వ‌స్తోంది! ఆ సీరియ‌ల్ పేరే తెలుగు టీవీ చ‌రిత్ర‌లో రికార్డుల‌ను సొంతం చేసుకున్న `అమృతం`. ఒక హోట‌ల్ చుట్టూ...నాలుగైదు పాత్ర‌ల చుట్టూ న‌డిచిన అమృతం సీరియ‌ల్ 'అమృతం ద్వితీయం' (అమృతం-2) పేరుతో రీ ఎంట్రీ ఇస్తోంది. అంజి, అమృతం అనే అమాయ‌క‌పు అతి తెలివి పాత్ర‌ల‌తో అల‌రించిన ఆ సీరియ‌ల్ తిరిగి అదే పాత్ర‌లతో అదే స‌ర్వం, అప్ప‌టి ఓన‌రు అప్పాజీ పాత్ర‌దారుడితో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. హాస్యాన్ని అల‌వోక‌గా పండించే ఎల్బీ శ్రీరాం అంజి పాత్రలో న‌టిస్తుండ‌గా అమృతం పాత్ర‌లో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ న‌టిస్తున్నారు. మ‌గ‌వారే కాదండోయ్ మ‌హిళ‌ల మ‌న‌సును సైతం దోచుకునేలా ఈ సీరియ‌ల్ ఉండ‌నుంది.
ఎలా చెప్తున్నారు అంటున్నారా? ఈ సీరియ‌ల్‌కు సంబంధించిన ట్రైల‌ర్ యూట్యూబ్‌లో విడుద‌లైంది. దాంట్లో ఉన్న పాత్ర‌లే కార‌ణం. ఇందులో పాత పాత్ర‌ల‌తో పాటుగా మ‌హిళా మ‌ణుల‌కు సైతం పెద్ద‌పీట వేశారు. అందుకే క‌దా...టాలీవుడ్ అగ్రదర్శకుడు రాజమౌళి వ‌రుస ట్వీట్ల‌తో ఈ రీఎంట్రీపై క్రేజ్ పుట్టించారు. `19ఏళ్ల క్రితం సీరియ‌ల్ల ఏడుపు ప్ర‌వాహాలు సాగుతున్న త‌రుణంలో మూస దారావాహిక‌ల‌కు భిన్నంగా కామెడీని పంచుతూ కొత్త ట్రెండ్‌ను సృష్టించిన అమృతం ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తోంది. ఐదు సార్లు రిపీట్ అవ‌డం, 270 మిలియన్ వ్యూస్ సంపాదించడం, చివరి కొన్ని నెలల్లోనే నెలకు 6 మిలియన్ల వ్యూస్ అందుకోవ‌డం వంటి ప్ర‌త్యేక‌త‌ల‌తో నిలిచిన ఈ సీరియ‌ల్ మ‌ళ్లీ మీ ముందుకు ఈ ఉగాదిన‌ వ‌స్తోంది. ప్రపంచ‌వ్యాప్తంగా ఉన్న అభిమానులు, అమృతం సీక్వెల్‌ను కోరిన వారి ఆకాంక్ష‌లు నెర‌వేరుస్తోంది`` అంటూ రాజ‌మౌళి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. అమృతం వ‌చ్చే స‌మ‌యం ఖ‌రారైతే...మునుప‌టిలాగే ఆద‌ర‌ణ పొందితే... ఆడ‌వారి ఆవేద‌న‌, ఆగ్ర‌హం, ఆలోచ‌న‌లు ఆక్ర‌మించేసిన `మ‌హిళాధిక్య‌పు సీరియ‌ల్స్‌` బాధ్యులు అవాక్క‌వ‌డం ఖాయ‌మే. ఏమంటారు?