అనగాని మాట.. జగన్ నమ్మించి గొంతు కోశారు

February 17, 2020

ఏపీలో ఇటీవలే కొత్తగా పాలనా పగ్గాలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాగిస్తున్న పాలనపై క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. జగన్ పాలన అంతా... నమ్మించి గొంతు కోయడమన్న చందంగానే సాగుతోందన్న మాట ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చేసింది. సంక్షేమం పేరిట కొత్త పథకాలను ప్రారంభిస్తున్న జగన్... ఆయా పథకాలకు నిధులను సంక్షేమ శాఖల నుంచే మళ్లిస్తూ... అప్పటిదాాకా కొనసాగుతున్న సంక్షేమానికి చరమ గీతం పాడేశారన్ని కొత్త తరహా వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వాదనలను టీడీపీ నేత, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఇప్పుడు తెరమీదకు తీసుకొచ్చారు. ఇదే వాదనతో ఆయన ఏపీ సీఎం జగన్ కు ఓ బహిరంగ లేఖ రాశారు. 

ఆ లేఖలో అనగాని ఏమని పేర్కొన్నారంటే... అమ్మఒడి పథకానికి బీసీ, ఎస్సీ, ఎస్టీల నిధుల మళ్లించారని సత్యప్రసాద్ ఆరోపించారు. అలాగే, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అప్పటిదాకా అందుతున్న ఉపకార వేతనాలు, ఇతర సదుపాయాల నిలిపివేతనూ సూటిగానే ప్రశ్నించారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో వైసీపీ పాలనపగ్గాలు చేపట్టిన నాటి నుంచి ప్రజల అవసరాలతో నేరుగా ముడిపడి ఉన్న విభాగాలన్నింటా అవినీతి జాఢ్యం వికృతరూపం దాలుస్తోందని... అవినీతే జీవన విధానంగా మారి నేతలు ప్రజల్ని దోచుకుతింటున్నారని అనగాని తనదైన శైలి విమర్శలు సంధించారు. ప్రజలకు దక్కాల్సిన ప్రయోజనాలన్నింటినీ దారి మళ్లీస్తున్నారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

సంక్షోభాల నుంచి అవకాశాలు సృష్టించుకొని గత టీడీపీ ప్రభుత్వం ముందుకుసాగితే.. ఈ ప్రభుత్వం సంక్షోభాలు సృష్టించి అభివృద్ధిని నిలిపివేసిందని అనగాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మఒడి పథకం పేరుతో రాష్ట్రంలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రభుత్వం మోసం చేస్తోందని అనగాని ఆరోపించారు. ఎన్నికల సమయంలో బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఇస్తామని, వాటిని తల్లి బ్యాంకు ఖాతాలో జమచేస్తామని చెప్పిన జగన్... ఇప్పుడు ఇంట్లో ఎంత మంది ఉన్నా తల్లి ఖాతాలో కేవలం రూ.15వేలు మాత్రమే జమచేస్తామని ప్రకటించడం వంచించడం కాక మరేమిటని ప్రశ్నించారు. పైగా రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న విద్యార్థులు 83 లక్షల మంది ఉంటే.. కేవలం 42 లక్షల మంది తల్లులకు మాత్రమే పథకం వర్తింపజేయడం ద్వారా 41లక్షల మందిని జగన్ మోసం చేసినట్టేనని అనగాని పేర్కొన్నారు. ఇదేనా మాట తప్పను.. మడమ తిప్పను అంటూ ఆయన ధ్వజమెత్తారు. పైగా అమ్మఒడి పథకానికి కూడా జే ట్యాక్స్ ను వసూలు చేస్తున్నారని అనగాని మరో సంచలన వ్యాఖ్య చేశారు. మాటలతో మాయ బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చాక వంచించడాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నామని అనగాని ఓ రేంజిలో విరుచుకుపడ్డారు.